రోజుకు 1.5 లీటర్ల కంటే తక్కువ నీరు.. 50% ఎక్కువ ఒత్తిడికి కారణం!!

by Javid Pasha |

అంతర్జాతీయ సిఫార్సుల ప్రకారం మహిళలు రోజుకు సుమారు 2.7 లీటర్లు, పురుషులు రోజుకు సుమారు 3.7 లీటర్ల నీరు తాగవచ్చు.

రోజుకు 1.5 లీటర్ల కంటే తక్కువ నీరు.. 50% ఎక్కువ ఒత్తిడికి కారణం!!
X

దిశ, ఫీచర్స్ : మీరు రోజుకు ఎన్ని నీళ్లు తాగుతారు? 1.5 లీటర్లకంటే తక్కువ తాగుతున్నారా? అయితే డేంజర్లో పడ్డట్టే. ఎందుకంటే ఈ విధంగా ఇంతకంటే తక్కువ తాగే వ్యక్తుల్లో కార్టిసాల్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుందని, నిరంతరం ఒత్తిడికి గురవుతుంటారని లివర్‌పూల్ జాన్ మూర్స్ యూనివర్సిటీ (LJMU) శాస్త్రవేత్తలు నిర్వహించిన స్టడీలో వెల్లడైంది. జర్నల్ ఆఫ్ అప్లైడ్ ఫిజియాలజీ (Journal of Applied Physiology)లో ఇందుకు సంబంధించిన వివరాలు పబ్లిష్ అయ్యాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె జబ్బులకు దారితీయొచ్చు!

అధ్యయనాన్ని విశ్లేషించిన నిపుణుల ప్రకారం 1.5 లీటర్లకంటే తక్కువనీరు తాగే వ్యక్తులు ఒత్తిడి పరిస్థితులను అనుభవించినప్పుడు, హైడ్రేటెడ్‌గా ఉండేవారికంటే 50% అధికంగా కార్టిసాల్ హార్మోన్ స్పైక్‌లను కలిగి ఉంటారు. ఎందుకంటే.. శరీరంలో నీరు తక్కువగా ఉందని గుర్తించినప్పుడు మెదడు భిన్నంగా స్పందిస్తుంది. ఆ సమయంలో శరీరంలో నీటి సమతుల్యతను నియంత్రించే వాసోప్రెసిన్ అనే హార్మోన్ కూడా ఎక్కువగా విడుదల అవుతుంది. కానీ అదే సమయంలో మెదడులోని హైపోథాలమస్‌పై ఇంపాక్ట్ పడటంవల్ల స్ట్రెస్ రెస్పాన్స్‌ను పెంచుతుంది. దీంతో ఒత్తిడికి గురైన సమయంలో కార్టిసాల్ స్థాయికి మించి రిలీజ్ అవుతుంది. ఈ పరిస్థితి దీర్ఘకాలికంగా కొనసాగితే.. రక్తంలో చక్కెరస్థాయిలు పెరగడం, ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గడం, కడుపు భాగంలో కొవ్వు పేరుకుపోవడం, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా ఇవన్నీ డయాబెటిస్, డిప్రెషన్, గుండె జబ్బులు వంటి సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి ప్రతీ వ్యక్తి సరిపడా నీరు తాగాలని, రోజుకు 1.5 లీటర్లకంటే తక్కువ తాగకూడదని సూచిస్తున్నారు.

తక్కువ నీరు తాగితే ఏం జరుగుతుంది?

పెద్దలు కనీసం 1.5 లీటర్లకంటే తక్కువ నీరు తాగితే శరీరం డీహైడ్రేషన్ మోడ్‌లోకి వెళ్తుంది. దీంతో వాసోప్రెసిన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఇది కోపాన్ని, ఒత్తిడిని మరింత అధికం చేస్తుంది. ముఖ్యంగా స్ట్రెస్ సమయంలో కార్టిసాల్ స్థాయిలు 50% కంటే ఎక్కువ పెరుగుతాయి. దీర్ఘకాలంపాటు ఎక్కువ కార్టిసాల్ రిలీజ్ అవుతూ ఉంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇన్సులిన్ సమస్యలు అధికం అవుతాయి. బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. స్ట్రెస్, యాంగ్జైటీస్, డిప్రెషన్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువ. ఇక తలనొప్పి, అలసట, కిడ్నీ స్టోన్స్, మెదడు సామర్థ్యం తగ్గడం వంటి అదనపు సమస్యలు సైతం తలెత్తవచ్చు.

ఎక్కువ నీరు తాగితే ఏం జరుగుతుంది?

సాధారణంగా ఎక్కువనీరు తాగడం సమస్య కాదంటున్నారు పరిశోధకులు ఎందుకంటే.. మూత్ర పిండాలు అదనపు నీటిని విసర్జిస్తాయి. అలాగనీ మరీ అతిగా తాగినా నష్టమే. ఉదాహరణకు గంటలో 3-4 లీటర్లు లేదా రోజంతా బలవంతంగా ఎక్కువ నీరు తాగారనుకోండి. ఓవర్ హైడ్రేషన్‌కు గురవుతారు. ఈ పరిస్థితి రక్తంలో సోడియం స్థాయిలు తగ్గి హైపోనట్రిమియా(hyponatremia)ను కలిగిస్తుంది. దీంతో తలనొప్పి, వికారం, వాంతులు, గందరగోళం, కండరాల బలహీనత సంభవించే చాన్స్ ఉంటుంది. అందుకే సరైన మోతాదులో తాగాలి.

రోజుకు ఎంత నీరు తాగాలి?

సాధారణ ఆరోగ్యవంతులైన పెద్దలు అంతర్జాతీయ సిఫార్సుల(Mayo Clinic, Institute of Medicine, Harvard Health): ప్రకారం మహిళలైతే రోజుకు సుమారు 2.7 లీటర్లు (11.5 కప్పులు), పురుషులైతే రోజుకు సుమారు 3.7 లీటర్లు తాగవవచ్చు. ఇందులో సుమారు 20% ఆహారం నుంచి వస్తుంది కాబట్టి మహిళలు సుమారు 2-2.5 లీటర్లు (8-10 గ్లాసులు), పురుషులు సుమారు 2.5-3 లీటర్లు (10-13 గ్లాసులు) తాగాలి. అయితే ఇవి అందరికీ ఒకేలా వర్తించకపోవచ్చు. వ్యాయామం, వేడి వాతావరణం, ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడింగ్ వంటి ఇతర పరిస్థితుల్లో ఎక్కువ నీరు కూడా అవసరం కావచ్చు.

వయసుల వారీగా ఎవరు ఎంత తాగాలి?

1-3 సంవత్సరాలు: సుమారు ఒక లీటర్ లేదా 4 కప్పులు తాగాలి.

4-8 సంవత్సరాలు: 1.2 లీటర్లు లేదా 5 కప్పులు

9-13 సంవత్సరాలు: 1.9 లీటర్లు లేదా 7-8 కప్పులు

14-18 సంవత్సరాలు: 2.6 లీటర్లు లేదా 8-11 కప్పులు

*ఇక 19+ సంవత్సరాల వయసు కలిగిన పురుషులు 3.7 లీటర్లు (13 కప్పులు), మహిళలు 2-2.2 లీటర్లు తాగాలి. గర్భిణులు 3 లీటర్లు తాగాలి. బ్రెస్ట్ ఫీడింగ్ మహిళలు 3.7 లీటర్లు తాగాలి. వృద్ధులు 60+ సంవత్సరాలు గల పురుషులు సుమారు 2.5 నుంచి 3 లీటర్ల వరకు తాగాలి. మహిళలు 2.7 లీటర్లు తాగడం ముఖ్యం.

ఇండియన్స్ ఎంత తాగాలి? (ICMR-NIN Dietary Guidelines 2024/2025):

*ఆరోగ్యవంతమైన పెద్దలకు : సాధారణంగా 2 లీటర్లు (8 గ్లాసులు) నీరు/పానీయాలు సిఫార్సు చేస్తారు. కానీ వేడి వాతావరణం, ఎక్కువ శ్రమ కలిగి ఉంటే 2.5-3.7 లీటర్లు వరకు అవసరం (పురుషులకు ఎక్కువ).

*పిల్లలు: వయసుకు అనుగుణంగా 1-2 లీటర్లు, బరువు ఆధారంగా కూడా లెక్కిస్తారు (ఉదా: 30 ml/kg బాడీ వెయిట్). ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే.. 2025 అప్‌డేట్స్ ప్రకారం.. సాధారణ గైడ్‌లైన్స్ మాత్రమే. వ్యక్తిగత అవసరాలు మారవచ్చు. అంటే వ్యాయామం, వేడి వాతావరణం, అనారోగ్యం వంటి పరిస్థితుల్లో ఎక్కువ నీరు అవసరం కావచ్చు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. శరీర తత్వం, అనారోగ్యాలు, వ్యక్తిగత అవసరాలను బట్టి నీటి అవసరం ఎక్కువ, తక్కువలకు మారుతుంది. కాబట్టి అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story