Technology : ఓవర్ నైట్ స్క్రీన్ ఎఫెక్ట్.. స్మార్ట్ ఫోన్లతో ఏర్పడుతున్న లో విజన్.. ‘20-20-20 ఫార్ములా’తో చెక్

by Javid Pasha |

ఫోన్ లేదా స్క్రీన్ ఏదైనా కంటిచూపుపై ప్రతికూల ప్రభావం చూపకూడదంటే కంటికి, డివైస్‌కు మధ్య దూరం 16 నుంచి 24 అంగుళాలు లేదా 40 నుంచి 60 సెంటీమీటర్లు ఉండాలి.

Technology : ఓవర్ నైట్ స్క్రీన్ ఎఫెక్ట్.. స్మార్ట్ ఫోన్లతో ఏర్పడుతున్న లో విజన్.. ‘20-20-20 ఫార్ములా’తో చెక్
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. ఆధునిక కాలంలో అదొక అవసరంగా మారిపోయింది. ఇంతవరకూ పర్లేదు కానీ.. దాని అధిక వినియోగం మాత్రం అనర్థాలకు దారితీస్తోంది. ఎందుకంటే.. చేతిలో ఫోన్ ఉంది కదా అని కొందరు ఓవర్‌నైట్ వరకూ అందులో నిమగ్నమైపోతున్నారు. మరికొందరు పగలు, రాత్రి తేడా లేకుండా అవసరానికి మించి డెస్క్‌టాప్‌లు, కంప్యూటర్లు, టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇలా ఎక్కువసేపు స్ర్కీన్లకు గురికావడంతో అది కళ్లమీద, మానసిక ఆరోగ్యంమీద ప్రతికూల ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

*స్మార్ట్‌ఫోన్, ట్యాబ్, డెస్క్‌టాప్ మీరు యూజ్ చేస్తున్న డివైజ్ ఏదైనా సరే.. కళ్లకు, ఆ పరికరానికి మధ్య సరైన దూరాన్ని పాటించాలి. కంటిచూపుపై ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే.. సాధారణంగా 16 నుంచి 24 అంగుళాలు లేదా 40 నుంచి 60 సెంటీమీటర్ల దూరం పాటించాలి. దీనివల్ల కంటిపై ఒత్తిడి, లైటింగ్ ఫోకస్ తగ్గుతాయి. అంతేకాకుండా కాంట్రాస్ట్ అండ్ స్క్రీ‌న్ బ్రైట్‌నెస్ కూడా మీ కళ్లకు ఇబ్బంది కలిగించని విధంగా సెట్ చేసుకోవాలి.

*స్క్రీన్లలో సమయం గడిపినప్పుడు కళ్లపై ప్రతికూల ప్రభావం చూపకూడదంటే, స్క్రీన్ చూస్తున్నప్పుడు ‘‘20-20-20’’ ఫార్ములాను ట్రైచేస్తే బెటర్ అంటున్నారు సాంకేతిక, మానసిక నిపుణులు సైతం. దీని సారాంశం ఏంటంటే.. మీరు ఫోన్ చూస్తున్నప్పుడు ప్రతీ 20 నిమిషాలకు ఒకసారి గ్యాప్ ఇచ్చి.. మీకు 20 అడుగుల దూరంలో ఉన్న పరిసరాలను 20 సెకన్లపాటు తదేకంగా చూస్తూ ఉండాలి. ముఖ్యంగా పచ్చని చెట్లను, ప్రకృతిని చూడాలి. దీనివల్ల మీ కళ్లపై ఒత్తిడి, అసౌకర్యం, కంటి చూపు మందగించే అవకాశాలు తగ్గుతాయి.

*నిజానికి నిరంతరం స్క్రీన్ చూడటం వల్ల కళ్లల్లో అసౌకర్యం, ఒత్తిడి పెరుగుతుంది. కంటి నరాలు, కండరాలు ఉద్రిక్తంగా మారుతాయి. అదే కంటిన్యూ అవుతుంటే కళ్లల్లో చికాకు, పొడిబారడం, బయటి పరిసరాలను చూస్తున్నప్పుడు అకస్మాత్తుగా నీరు కారడం, కళ్లు లాగడం మసక చూపు వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలాంటి సమస్యను 20-20-20 ఫార్ములాతో నివారించవచ్చు. అయితే ఇది మాత్రమే శాశ్వత పరిష్కారం కాదు. స్క్రీన్లలో, ముఖ్యంగా ఓవర్‌నైట్ స్మార్ట్ ఫోన్లలో గడిపే సమయాన్ని తగ్గించుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

*గమనిక:పైవార్తలోని సమాచారంక ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story