మీరు ఆందోళన చెందే విషయాల్లో 91% ఫేక్.. మీ మెదడు మిమ్మల్ని ట్రోల్ చేస్తుందంతే..!!

by Javid Pasha |   (  Updated:2025-11-21 10:51:26  IST  )

మీరు ఆందోళన చెందే విషయాల్లో 91% ఫేక్.. మీ మెదడు మిమ్మల్ని ట్రోల్ చేస్తుందంతే..!!
X

దిశ, ఫీచర్స్ : మీకు తెలుసా? ప్రతీ రోజు, ప్రతీ వ్యక్తి ఏదో ఒక విషయంలో కంగారు పడటమో, ఏం జరుగుతుందోనని ఆందోళన చెందడమో, ఒత్తిడికి గురికావడమో కామన్. కానీ అలాంటి స్ట్రెస్ రిలేటెడ్ యాంగ్జైటీస్‌లో 85% వరకు నిజమైన అనుభవాలవల్ల కావని, అనవసరంగా ఆందోళన చెందడంవల్లనే ఏర్పడుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదాహరణకు ఒక ఐటీ సెక్టార్ ఎంప్లాయి ‘బాస్ నుంచి మెసేజ్ వచ్చినట్లు నోటిఫికేషన్ కనబడగానే.. అందులో ఏముందో చూడకముందే అనవసరంగా భయపడతాడు. గత పని విధానంపట్ల ఎలా రియాక్ట్ అవుతాడోనని ఆందోళన చెందుతాడు. తీరా మెయిల్ ఓపెన్ చేసి చూస్తే.. అవతలి నుంచి ‘థ్యాంక్స్ లేదా గుడ్’ అని ఉంటుంది. అంటే ఇంతసేపు ఏదేదో ఊహించుకొని అనవసరంగా ఆందోళన చెందిన సదరు ఉద్యోగి రిలాక్స్ అవుతాడు. ఇలా అనేకమంది తమ జీవితంలో ముందస్తు ఆందోళనతో పడుతుంటారని నిపుణులు అంటున్నారు.

85% ఒత్తిడి రహితమైనవే..

తలనొప్పి వస్తే చాలు.. బ్రెయిన్ ట్యూమర్ ఏమోనని అనవసరంగా ఆందోళన చెందుతారు కొందరు. చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి చూస్తారు మరికొందరు. ఇక పరీక్షల డేట్ అనౌన్స్ చేయకముందే తాము ఫెయిలవుతామేమోనని నెగెటివ్‌గా ఊహించుకుంటారు కొందరు స్టూడెంట్స్. కానీ 90% మార్కులతో పాస్ అవుతారు. లేదా ఫెయిల్ అయినప్పటికీ ఊహించినంత భయంకరం ఉండదు. అలాగే బయటకు వెళ్లిన ప్రియమైన వ్యక్తి గానీ, ఫ్రెండ్ గానీ, కుటుంబ సభ్యులు గానీ ఫోన్ ఎత్తకపోతే కూడా కొందరు కంగారు పడుతుంటారు. ఏమైంది ఇంతకీ.. యాక్సిడెంట్ అయిందా? ఎవరైనా కిడ్నాప్ చేశారా? అని లోలోన నానా రకాల డౌట్లతో ఆందోళన చెందుతారు. ఓ10 నిమిషాల తర్వాత మళ్లీ ఫోన్ చేస్తే “సారీ రా.. ఫోన్ సైలెంట్‌లో పెట్టేశా” అంటారు అవతలి వ్యక్తి. అది వినగానే అయ్యో ఏదేదో ఊహించుకొని కంగారు పడ్డానని తనకు తాను సర్దిచెప్పుకుంటారు. అనవసర ఆందోళనే కదా ఇది! అయితే ఇవన్నీ ఒత్తిడికి గురిచేస్తాయి. కానీ అలా ఒత్తిడికి గురిచేసేవేవీ 85% వరకు ప్రమాదకరమైనవేవీ కావని నిపుణులు చెబుతున్నారు.

91.4% ఆందోళనలు ఒట్టిదే..!

బిహేవియర్ థెరపీ జర్నల్‌లో పబ్లిషైన పరిశోధనా వివరాల ప్రకారం.. జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ (GAD) ఉన్నవారిపై చేసిన పరిశోధనలో 91.4% ఆందోళనలు నిజం కాలేదని తేలింది. మధ్యస్థంగా 93.5% ఆలోచనలు కేవలం ఊహాజనితమే! జరిగిన కొద్ది శాతం సంఘటనల్లో కూడా 79% మంది “నేను ఊహించినంత భయంకరంగా లేదు, నేను బాగా ఎదుర్కొన్నాను” అని చెప్పారు. అంటే మన మెదడు కొన్ని విషయాల్లో ఆందోళనను, భయాన్ని ప్రేరేపించడం ద్వారా చిన్న సమస్యలను సైతం పెద్దగా భావించేలా చేస్తుంది. దీనికి కారణం మన మెదడులోని “అమిగ్డాలా” అనే భాగం. ఇది ఎప్పుడూ మనిషిని అలర్ట్‌గా ఉంచే తన పనితీరులో భాగంగా ప్రమాదాల కోసం స్కాన్ చేస్తూ ఉంటుంది. ఆదిమకాలంలో ముఖ్యంగా మనుషులు గుహల్లో నివసించే కాలంలో ఇది జీవరక్షణకు ఉపయోగపడింది. కానీ ప్రస్తుతం కొన్నిసార్లు మానసిక ఆందోళనకు దారితీస్తున్నది. “ఒకవేళ ఇలా అయితే?” అనే లూప్‌లో ఇరికిస్తుంది. నెగటివిటీ బయాస్ వల్ల చిన్న ప్రమాదాన్ని భారీగా చూపి, పాజిటివ్ అవకాశాలను మరుగుపరుస్తుంది. ఆందోళన చెందడంవల్ల “నేను సమస్యను ముందుగానే ఆలోచిస్తున్నాను కదా” అనే నియంత్రణ భ్రమ(Illusion of control) కలుగుతుంది. కానీ అది నిజంగా ఒత్తిడి హార్మోన్లను విడుదల చేసి, శరీరాన్ని అలసటకు గురిచేస్తుంది. అయినా ప్రమాదకరమేమీ కాదు. కాస్త తార్కికంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే ఇలాంటి అనవసర భయాలు, ఆందోళనలు తగ్గిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు.

ఆ సమస్యతో ఇప్పటికే 5 ఆపరేషన్లు..! పెళ్లి చేసుకోవాలా.. వద్దా ?

ఒక్క సిగరెట్‌ తాగినా.. బట్టతల + ముసలితనం త్వరగా రావడం గ్యారంటీ!

Next Story