IPL 2026 : గాయాలు బాబోయ్.. అన్ని జట్లను వేధిస్తున్న గాయాలు

by Harish |   (  Updated:2026-04-17 05:21:51  IST  )

IPL 2026 : గాయాలు బాబోయ్.. అన్ని జట్లను వేధిస్తున్న గాయాలు
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2026లో గాయాల బెడద ఎక్కువగానే ఉన్నాయి. ఒక్క జట్టు, రెండు జట్లు కాదు.. అన్ని టీమ్‌లు గాయాలతో సతమతమవుతున్నాయి. కొందరు ప్లేయర్లు స్వల్ప గాయాలతో కొన్ని మ్యాచ్‌లకు దూరమవుతుంటే మరికొందరు గాయం తీవ్రత కారణంగా లీగ్ నుంచే నిష్ర్కమిస్తున్నారు. టోర్నీని వీడుతున్న ప్లేయర్ల లిస్ట్‌ కూడా ఎక్కువగానే ఉంది. సామ్ కర్రన్(రాజస్థాన్ రాయల్స్), ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా(కోల్‌కతా నైట్ రైడర్స్), నాథన్ ఎల్లీస్(చెన్నయ్ సూపర్ కింగ్స్) లీగ్ ప్రారంభానికి ముందే గాయాల కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యారు. ధోనీ, కమిన్స్, మిచెల్ స్టార్క్(ఢిల్లీ క్యాపిటల్స్) గాయాల కారణంగా ఇంకా ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇటీవల పంత్(లక్నో సూపర్ జెయింట్స్), రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్) గాయపడగా.. వారు తర్వాతి మ్యాచ్‌లు ఆడతారా?లేదా? అన్న దానిపై సందిగ్ధం నెలకొంది.

ఖలీల్ ఔట్

ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న చెన్నయ్ సూపర్ కింగ్స్‌కు ఊహించని షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు బౌలర్ ఖలీల్ అహ్మద మిగతా లీగ్ మొత్తానికి దూరమయ్యాడు. మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖలీల్ గాయపడ్డాడు. 17వ ఓవర్ వేస్తుండగా కుడి కాలు తొడ కండరాలు పట్టేశాయి. చాలా అసౌకర్యంగా కనిపించాడు. గుర్జాప్నీత్ సింగ్ ఆ ఓవర్‌ను పూర్తి చేశాడు. స్కానింగ్‌లో గాయం తీవ్రమైనదని నిర్ధారణ అయ్యింది. దాదాపు 10 నుంచి 12 వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్టు తెలిసింది. దీంతో అతను మిగతా లీగ్‌కు దూరమయ్యాడు. ఈ సీజన్‌లోనూ ఖలీల్ పెద్దగా రాణించలేదు. ఐదు మ్యాచ్‌ల్లో 2 వికెట్లు మాత్రమే తీశాడు.నాథన్ ఎల్లీస్ గాయం కారణంగా టోర్నీకి దూరమవ్వగా.. అతని స్థానంలో వచ్చిన జాన్సెన్ కూడా గాయం కారణంగా ఇంకా జట్టులో చేరలేదు. ధోనీ కూడా ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఈ నెల 18న సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లోనూ అతను ఆడతాడా?లేదా? అన్నది తెలియదు.

సన్‌రైజర్స్‌కు మరో దెబ్బ

ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బ్రైడెన్ కార్సే గాయం కారణంగా లీగ్ నుంచి నిష్ర్కమించిన రెండు రోజుల్లోనే ఎస్‌ఆర్‌హెచ్‌కు మరో దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్‌కే చెందిన డేవిడ్ పేన్ కూడా గాయం కారణంగా మిగతా సీజన్‌కు దూరమయ్యాడు. చీలమండల గాయం కారణంగా అతను లీగ్‌ నుంచి నిష్ర్కమించినట్టు ఎస్‌ఆర్‌హెచ్ తెలిపింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్‌కు రిప్లేస్‌మెంట్‌గా ఎస్‌ఆర్‌హెచ్ పేన్‌ను జట్టులోకి తీసుకుంది. రూ.1.5 కోట్లకు అతను జట్టులో చేరాడు. ఈ సీజన్‌లో రెండు గేములు ఆడిన పేన్ 2 వికెట్లే తీశాడు. కార్సే రిప్లేస్‌మెంట్‌గా శ్రీలంక బౌలర్ దిల్షాన్ మధుశంకను జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పేన్‌ స్థానాన్ని ఇంకా భర్తీ చేయలేదు. మరోవైపు, కెప్టెన్ కమిన్స్ పూర్తిగా కోలుకోవడం సన్‌రైజర్స్‌కు కాస్త ఉపశమనం కలిగించే విషయం.

ముంబైలోకి కొత్త ప్లేయర్

గత మ్యాచ్‌లో గాయపడిన రోహిత్ శర్మపై ఆందోళన నెలకొన్న వేళ ఎంఐకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్పిన్ ఆల్‌రౌండర్ అథర్వ అంకోలెకర్ గాయం కారణంగా ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ముంబై 21 ఏళ్ల పంజాబ్ ఆల్‌రౌండర్ క్రిష్ భగత్‌ను ఎంఐ జట్టులోకి తీసుకుంది. గత రెండు సీజన్లుగా అతను ఎంఐ ట్రయల్స్‌లో పాల్గొంటున్నాడు. ఈ సీజన్‌లోనూ ఆ జట్టుకు అతను నెట్ బౌలర్‌గా వ్యవహరించాడు. అతన్ని రూ.30 లక్షలకు జట్టులోకి తీసుకుంది. పంజాబ్ తరపున భగత్ 7 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు.

‘దోశ, ఇడ్లీ’ పాటపై బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు

Next Story