చలికాలంలో షుగర్ ఎందుకు పెరుగుతుంది.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..?

by Taduka Kalyani |   (  Updated:2025-12-26 06:36:12  IST  )

చలికాలం వచ్చిందంటే మధుమేహ (డయాబెటిస్) బాధితులకు సమస్యలు ఎక్కువవుతాయి

చలికాలంలో షుగర్ ఎందుకు పెరుగుతుంది.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..?
X

దిశ, వెబ్ సైట్: చలికాలం వచ్చిందంటే మధుమేహ (డయాబెటిస్) బాధితులకు సమస్యలు ఎక్కువవుతాయి. వేసవితో పోలిస్తే చలిలో రక్తంలో షుగర్ స్థాయిలు అదుపు తప్పే అవకాశాలు అధికంగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చలి ప్రభావంతో శారీరక చలనం తగ్గడం, ఆహార అలవాట్లు మారడం, హార్మోన్లలో మార్పులు రావడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

చలికాలంలో షుగర్ ఎందుకు పెరుగుతుంది?

చలికాలంలో శరీరం వేడిని కాపాడుకునేందుకు స్ట్రెస్ హార్మోన్లు (కార్టిసోల్) ఎక్కువగా విడుదలవుతాయి. ఇవి ఇన్సులిన్ పనితీరును తగ్గిస్తాయి. ఫలితంగా రక్తంలో షుగర్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే బయట వ్యాయామం తగ్గడం, అధికంగా తినడం కూడా షుగర్ కంట్రోల్ తప్పడానికి కారణమవుతుంది.

షూగర్ కంట్రోల్‌లో ఉండాలంటే ఏం చేయాలి?

*వైద్యుల సూచనల ప్రకారం చలికాలంలో మధుమేహ బాధితులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

*ప్రతిరోజూ షుగర్ లెవెల్స్ పరీక్షించుకోవాలి.

*చలికాలం అయినా సరే నడక, యోగా వంటి వ్యాయామాలు తప్పనిసరి.

*తీపి పదార్థాలు, బేకరీ ఐటమ్స్‌కు దూరంగా ఉండాలి.

*ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు వంటి ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి.

*వేడి నీరు తాగడం, సమయానికి భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి.

ఆహారంలో మార్పులు కీలకం

చలికాలంలో వేడి, నూనె ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకునే అలవాటు పెరుగుతుంది. ఇది షూగర్‌ను మరింత పెంచుతుంది. బియ్యం పరిమితం చేసి, మిల్లెట్స్, బ్రౌన్ రైస్, రాగి వంటి వాటిని ఆహారంలో చేర్చాలని వైద్యులు సూచిస్తున్నారు.

నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే

చలిలో షుగర్ కంట్రోల్ తప్పితే గుండె సమస్యలు, కిడ్నీ, నరాల సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే సీజన్ మారినా మందులు, ఆహారం, వ్యాయామం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు.

Read More..

చలికాలంలో సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు.. ఇలాంటి వారిలోనే అధికం!

Next Story