ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. చార్ ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

by Malleboina Mahesh |   (  Updated:2026-07-20 05:38:14  IST  )

వాతావరణంలో మార్పు కారణంగా ఉత్తరాఖండ్‌లో చార్ ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మార్గంలో ఉన్న భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారుల ఆదేశం!

ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. చార్ ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్ లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు రాగల 48 గంటల్లోను భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. దీంతో వాతావరణ పరిస్థితులు క్షీణించడంతో చార్ ధామ్ యాత్ర భక్తుల ముందస్తు రక్ష, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన చార్ ధామ్ యాత్రను (Char Dham Yatra) తాత్కాలికంగా నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రూట్లు సురక్షితంగా లేకపోవడంతో యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు యంత్రాంగం వెల్లడించింది.

సురక్షిత ప్రాంతాల్లో భక్తులకు వసతి..

ఈ మేరకు గర్వాల్ కమిషనర్ (Garhwal Commissioner) సంబంధిత జిల్లాల మేజిస్ట్రేట్లు (District Magistrates), ఇతర ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే యాత్ర మార్గంలో ఉన్న భక్తులను తక్షణమే గుర్తించి, వారిని సురక్షిత ప్రాంతాలలో సురక్షితంగా ఉంచాలని, వారికి అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. రహదారులు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని అధికారికంగా ప్రకటించిన తర్వాతే భక్తులను ముందుకు అనుమతించాలని ఆదేశించారు. యాత్రకు సంబంధించిన ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని, ఖచ్చితమైన వివరాలను మీడియా, ఇతర కమ్యూనికేషన్ ఛానెళ్ల ద్వారా భక్తులకు, సాధారణ ప్రజలకు చేరవేయాలని అధికారులకు సూచించారు.

వాతావరణ పరిస్థితులు మెరుగుపడి, రహదారులు ప్రయాణానికి అనుకూలంగా మారి, సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే చార్ ధామ్ యాత్రను తిరిగి పునరుద్ధరిస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్పటివరకు భక్తులెవరు సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను (Rumours) నమ్మవద్దని, కేవలం అధికారిక యంత్రాంగం విడుదల చేసే అడ్వైజరీలను (Official Advisories) మాత్రమే ఫాలో అవ్వాలని విజ్ఞప్తి చేసింది. వాతావరణం, రూట్ సేఫ్టీ మారేంతవరకు ఆయా జిల్లాల అధికారులు ఇచ్చే సూచనలను కచ్చితంగా పాటించాలని యాత్రికులను కోరింది.

Next Story