బై.. బై… క్రాప్​ హాలిడే దిశగా రైతులు

867

దిశ, తెలంగాణ బ్యూరో : అప్పుడు..
“ 2002 చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో యాసంగికి క్రాప్​ హాలిడే ప్రకటించారు. కారణం.. సాగునీరు లేకపోవడం, విద్యుత్​ కోతలతో పంటలు ఎండటంతో వానాకాలంలోనే రైతులు పంటలకు నిప్పు పెట్టారు. ఇక యాసంగిలో పరిస్థితి మరీ దారుణం కదా.. అందుకే రాష్ట్ర ప్రభుత్వమే క్రాప్​ హాలిడే ప్రకటించింది. అలా 2002, 2003 ఏడాదిల్లో వానాకాలంలో సగం, యాసంగిలో పూర్తిగా క్రాప్​ హాలిడే ప్రకటించారు. అప్పుడు సాగులో ఉన్న భూమిలో వరిసాగు 17 లక్షల ఎకరాలు మాత్రమే.

ఇప్పుడు..
“ చుట్టూ నీళ్లు, చెరువులు, కుంటలు నిండుకుండలు. బోరు, బావుల్లో పుష్కలంగా వాటర్​. లక్షల కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టులు నీళ్లలో కళకళలాడుతున్నాయి. ఏండ్ల తరబడి సాగునీటికి ఏడ్చిన రైతులు.. ఇప్పుడు ఉన్న నీళ్లను చూసి పంటలకు సిద్ధమయ్యే పరిస్థితి. వాస్తవానికి వ్యవసాయ యోగ్యమైన భూమి కోటి ఎకరాలకు చేరింది. వానాకాలంలో అయితే 60 లక్షల ఎకరాలు, యాసంగిలో 40 లక్షల ఎకరాల్లో వరి సాగు. కానీ ఒక్కసారిగా పాత కథే. చుట్టూ నీళ్లున్నా నారు పెట్టుకోలేని స్థితి. అన్నీ ఉన్నా.. ఇప్పుడు కూడా క్రాప్​ హాలిడే తరహాలోనే సాగు భూములను బీళ్లుగా మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వరి వేస్తే ధాన్యం కొనమంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది.

“ వరి వద్దంటే ఏం పండించాలి..”

నిజాం సాగర్ కెనాల్ శివారు మాది. నాకు మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో వరి తప్ప ఏ పంట పండదు. ప్రభుత్వం ఇప్పుడు రైతాంగాన్ని మోసం చేసే విధంగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా నిజాంసాగర్ కెనాల్ నిండుకుండలా ఉంది. కానీ ప్రస్తుత యాసంగిలో వరి వేయవద్ధంటున్నారు. మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. వరి తప్ప ఇతర పంటలపై అవగాహన కూడా తక్కువే. వరి వేయవద్దంటే ఆ మూడెకరాల్లో ఏ పంట వేసి బ్రతకాలి. సన్నకారు రైతులు సాగు చేసేందుకు వరికి మినహాయింపు ఇస్తే బాగుంటుంది- ఈగ శ్రీనివాస్​రెడ్డి, బర్దిపూర్ గ్రామం. డిచ్​పల్లి మండలం.

రాష్ట్రంలో వరిసాగు అయోమయంలో పడింది. ప్రాజెక్టుల కింద ఉన్న భూముల్లో కూడా క్రాప్​ హాలిడే తరహాలో మారింది. యాసంగిలో వరి సాగు వద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించడంతో ఒక్కసారిగా వరి సాగు వద్దంటే ఎలా, రైతుల పరిస్థితి ఏమవుతుంది అన్న ప్రశ్నలు వస్తున్నాయి. నీటి లభ్యత పెరగటంతో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వానాకాలంలో సుమారు కోటిన్నర ఎకరాల్లో పంటలు సాగుచేసే స్థాయికి చేరింది. ఇదే సమయంలో వరి సాగు కూడా భారీగా పెరిగింది. ఏటా రెండు పంటలు కలిపి కోటి ఎకరాలకుపైగా సాగవుతోంది. దిగుబడులు కూడా మెరుగయ్యాయి. దొడ్డురకాలు ఎక్కువ సాగు చేయటంతో అంతర్రాష్ట్ర, విదేశీ ట్రేడర్ల నుంచి.. యాసంగిలో బాయిల్డ్‌ రైస్‌ (ఉప్పుడు బియ్యం) ఉత్పత్తి చేయటం ద్వారా ఎఫ్‌సీఐ నుంచి అడ్డంకులు చెప్పుతూనే ఉన్నారు.

పక్కవాళ్లకు అన్నం పెట్టి మాకేమో సున్నం పెడుతవా..? పెద్దసారుపై తీవ్ర అసంతృప్తి

ఇక యాసంగిలో క్రాప్​ హాలిడే..?

వరి సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెరపైకి తీసుకువచ్చాయి. ఇప్పుడు తప్పు మీదంటే మీదే అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికే ఉప్పుడు బియ్యం ఉత్పత్తిని తగ్గించి, పచ్చి బియ్యం (అదికూడా సన్న బియ్యం) ఉత్పత్తిని పెంచడం, యాసంగిలో వరిసాగుకు విరామం (క్రాప్‌ హాలిడే) ప్రకటించి, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడమనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. వాస్తవానికి యాసంగి సాగుపైనే రైతులు చాలా ఆశలు పెట్టుకుంటారు. రైతులు చెప్పుతున్నట్టుగా వానాకాలం వరి సాగులో పెట్టుబడులు, ఖర్చులు పోతాయని, యాసంగి సాగుతోనే నాలుగు రాళ్లు వెనకేసుకుంటామంటున్నారు. కానీ ఇప్పుడు యాసంగిలో వరికి క్రాప్​ హాలిడే తప్పేలా కనిపించడం లేదు.

భారీగా వరిసాగు

కొన్నేళ్లుగా రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా వానాకాలంలో భారీగా సాగు జరుగుతోంది. గత ఏడాది వానాకాలంలో 53.84 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. యాసంగిలోనూ ఏకంగా 52.79 లక్షల ఎకరాల్లో వరి వేశారు. ఈ ఏడాది వానాకాలం సాగు 60 లక్షల ఎకరాలకు చేరింది. రెండు సీజన్లలో కలిపి కోటి ఎకరాలకుపైగా వరి సాగు చేయగా.. ఒక్క ఏడాదిలోనే రెండున్నర కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. వానాకాలం సీజన్‌లో ఉత్పత్తి అవుతున్న సుమారు కోటీ 25 లక్షల టన్నుల ధాన్యంతోనే మన రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల అవసరాలు తీరుతాయి. యాసంగిలో ఉత్పత్తయ్యే మరో కోటీ 25 లక్షల టన్నుల ధాన్యం అదనంగా ఉంటోంది. దీంతో యాసంగిలో ఆ ధాన్యాన్ని ఎవరు కొనాలనే సమస్య ఎదురవుతోంది.

రైతులు వినే పరిస్థితి ఉండదు!

ప్రభుత్వం చెప్పగానే రైతులు వరి వేయడాన్ని మానుకోరని, తమకు అనుకూలమైన నిర్ణయమే తీసుకుంటారని వ్యవసాయ శాఖ నివేదికల్లో వెల్లడించింది. గతంలో పత్తి సాగు చేయవద్దని ప్రభుత్వం పిలుపునివ్వడంతో కాస్త సాగు తగ్గిందని.. కానీ ఆ ఏడాది పత్తికి మంచి రేటు రావడంతో తర్వాతి ఏడాది మళ్లీ పత్తిసాగు భారీగా పెరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు వరి సాగు విషయంలోనూ రైతులెవరూ వినే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు.

ఇలాగైతే రైతులు అప్పుల పాలే- (బద్దం తిరుపతి, ఉప్లూరు, కమ్మర్​పల్లి మండలం)

“ వరి పండించడం మా తాతల తరం నుంచి వస్తుంది. ఆ పంట తప్పితే ఏ పంట వేయాలనేది రైతులకు తెలియదు. గతంలో మొక్కజోన్న వేయవద్దని అన్నారు.. ఇప్పుడు వరి వద్ధంటున్నారు. మరి రైతులు ఏం సాగు చేయాలి. వ్యవసాయ అధికారులు మాకేం చెప్పడం లేదు. వ్యవసాయం అంటేనే భయం వేసే పరిస్థితి ఉంది. ”

సాగర్​ నీళ్లున్నాయి.. ఏం చేయాలే -( బుచ్చయ్య, కొత్తపల్లి గ్రామం)

సాగర్ కాలువ ఉండడంతో ఎక్కువగా వరి సాగు చేస్తున్నాం. ఈ భుముల్లో వరి తప్ప ఇంకో పంటే పండదు. ఎందుకంటే కాలువలో నీళ్లు వచ్చినప్పుడు జాలూరుతుంది. వరి తప్ప ఏ పంట వేసిన నీళ్ళతడికి పండవు. ప్రస్తుతం కాలువలో నీళ్లు వస్తున్నాయి. రైతులందరూ వరి తుకాలు పోసుకున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయం అనుకున్నపుడు కాలువను బంద్ చేయమనండి. ఎవరూ తూకాలు పోసుకోరు. వరి పండించిన తర్వాత ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే దళారుల చేతిలో రైతులు మోసపోవడం ఖాయం.

ధాన్యం కొనాల్సిందే -(నారాయణరెడ్డి, రాముడు గ్రామం.)

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. అనుముల, రామడుగు గ్రామాల్లో వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. మా చిన్నతనం నుండి వరి తప్ప మాకు వేరే ఆధారం లేదు. ఇక్కడి భూములు పూర్తిగా చౌడు నేలలు. సాగర్ కాలువ ద్వారా వచ్చే నీటితో సాగు చేస్తున్నాం. వరి వద్దంటే సాగర్ కాలువను బంద్ పెట్టండి. లేదంటే వరి పండించడం మానుకోరు.

క్రాప్​ హాలిడే చేస్తాం.. మాకు రైతుబంధుతో పాటు అదనంగా ఇవ్వండి

ఇటీవల నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం మూసీ ప్రాజెక్టు ఆయకట్టు గ్రామంగా ఉన్న కాసనగోడు రైతులు ఏకగ్రీవంగా తీర్మానించారు. రైతులు యాసంగిలో ప్రభుత్వం వరి పంట సాగు చేయవద్దంటున్న విషయమై చర్చించి పలువురు రైతులు మూసీ ఆయకట్టు మొదటి జోన్‌లో ఉన్న కాసనగోడు భూములు రెండు సీజన్లలోనూ వరి మినహా ఇతర పంటల సాగుకు అనుకూలించవన్నారు. ఇప్పుడు వరి వద్దంటే క్రాప్‌ హాలిడే తప్ప తమకు మరో మార్గం లేదని అభిప్రాయపడ్డారు. యాసంగి సీజన్‌కు ఇచ్చే ఎకరాకు రూ.5వేల రైతుబంధుతో పాటుగా ప్రభుత్వం భరిస్తున్న ఎరువులు, విత్తనాల సబ్సిడీ, పండించిన ధాన్యం కొనుగోలు, రవాణా ఖర్చులను లెక్కకట్టి తమకు ఇస్తే తాము స్వచ్చందంగా యాసంగి సీజన్‌కు క్రాప్‌ హాలిడే పాటిస్తామని రైతులు అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ మేరకు రైతుల అభిప్రాయాలతో కూడిన తీర్మానం కాపీని మండల వ్యవసాయాధికారికి ఇచ్చారు.