పక్కవాళ్లకు అన్నం పెట్టి మాకేమో సున్నం పెడుతవా..? పెద్దసారుపై తీవ్ర అసంతృప్తి

by  |
cm-kcr-sad-photos1
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: యవుసం దండుగ కాదు.. పండుగ చేస్తానంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రాష్ట్ర ఏర్పాటు నాటి నుంచి చెబుతూ వచ్చారు. అందులో భాగంగానే ఎక్కడా లేనివిధంగా రైతు సంక్షేమ పథకాలను తెరపైకి తీసుకొచ్చారు. రైతు బంధు.. భీమా అంటూ దేశాన్నే ఆశ్చర్యానికి గురిచేసినంత పని చేశారు. యావత్ తెలంగాణ రైతాంగమంతా రెండుసార్లు వరి సాగు చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును రూ.వందల కోట్లు ఖర్చు చేసి నిర్మించారు. కానీ, సరిగ్గా ఏడేండ్లు గడవకముందే పరిస్థితి అంతా తలకిందులయ్యింది. యవుసం పండుగ అవ్వడం సంగతేమో గానీ అసలు ఎందుకు పనికిరాని స్థితికి తీసుకొచ్చినట్టయ్యింది. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ.. ఒక్క తెలంగాణలోనే వరి పంట సాగు ఇంత దారుణ స్థితికి చేరుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమా.. అన్న అనుమానాలు రైతాంగంలో లేకపోలేదు.

భారీగా సాగు పెరగడమే కారణం..

తెలంగాణలో గత ఏడేండ్ల కాలంలో వరి సాగు పెరగడం వల్లే ప్రస్తుతం రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడింది. కనీసం ఒక్కో ఎకరం వరి సాగు చేసే పరిస్థితులు లేకుండా పోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడమే కారణమని మేధావులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో కేవలం 30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పంట సాగయ్యేది. కానీ ప్రస్తుతం ఏకంగా కోటి 10 లక్షల ఎకరాల్లో వరిపంటను సాగు చేస్తున్నారు. దీంతో వరి ధాన్యం నిల్వలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయి. ఎఫ్‌సీఐ గోదాములతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని మిల్లులు, గోదాములు వరి ధాన్యం బస్తాలతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా వరిసాగు పెరగడానికి కారణం.. భారీగా నీటి వసతి అందుబాటులోకి రావడమే. నీళ్లు అందుబాటులో ఉండడంతో వరిసాగుకు పెట్టుబడి వ్యయం కొంత ఎక్కువ అయినా వరి సాగుకే రైతాంగం మొగ్గుచూపింది. రాష్ట్ర ప్రభుత్వం సాగు నీటి ప్రాజెక్టుల ద్వారా నీటిని అందుబాటులోకి తెచ్చిన సమయంలోనే నీటి వసతితో సాగు చేసే ఇతర పంటల వైపు రైతాంగాన్ని తీసుకెళితే.. ప్రస్తుతం పరిస్థితి మరోలా ఉండేది. కానీ ఆ దిశగా రైతుల్ని తీసుకెళ్లడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందనే చెప్పాలి.

బై.. బై… క్రాప్​ హాలిడే దిశగా రైతులు

yasangi-1

పక్క రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితే ఉందా..?

నిజానికి వరి సాగు అనేది ఒక్క తెలంగాణ రాష్ట్ర సమస్యే కాదు. ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నా.. రాజకీయంగా అంత హైప్ కాలేదు. పంజాబ్, హర్యానాలోనూ వరి ధాన్యం కొనబోమని కేంద్రం చెప్పింది. కానీ రైతులంతా ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కడంతో కేంద్రం వరి సేకరణ మొదలుపెట్టింది. దాదాపుగా అక్కడ 90 శాతానికి పైగా వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసింది. మరీ తెలంగాణలో మాత్రం అందుకు పరిస్థితి పూర్తి విరుద్ధంగా మారింది. తెలంగాణ మినహా ఒడిశా, పంజాబ్, హర్యానా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో ఇంతటి ఉద్రిక్త పరిస్థితులు లేవు. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పరిస్థితులు చూస్తుంటే.. రైతాంగానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. నీటి పారుదల సామర్థ్యాన్ని అనవసరంగా పెంచడం వల్లే ఇంతటి సంక్షోభం ఏర్పడిందా..? లేదా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ సమస్యలే కారణమా అన్నది అంతుచిక్కడం లేదు.

పక్క రాష్ట్రం రైతులకు పరిహారమా..

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కాలంలో కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల రద్దు కోసం పోరాడి అమరులైన ఇతర రాష్ట్రాల రైతులకు ఆర్థిక సాయం ప్రకటించారు. కానీ సొంత రాష్ర్టంలో అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనేందుకు మాత్రం కేసీఆర్ సిద్ధంగా లేకపోవడం రైతాంగాన్ని అయోమయంలో పడేసింది. కేంద్రం మెడలు వంచి అన్నదాతలకు అండగా నిలుస్తామన్న కేసీఆర్ ప్రస్తుత ధోరణి రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ధాన్యం కొనుగోళ్ల కోసం ఏకంగా ధర్నా చౌక్‌లో సీఎం కేసీఆర్ నిరసన దీక్ష చేపట్టి సంచలనం సృష్టించారు. అనంతరం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతోనూ భేటీ అయ్యారు. కానీ రాష్ట్రానికి తిరిగొచ్చి రైతులకు ధాన్యం విషయంలో ఏ ప్రకటన చేయలేకపోయారు. కానీ సోమవారం సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి కేంద్రం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయడం లేదని, అందుకే యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోదని స్పష్టం చేశారు. దీంతో సీఎం కేసీఆర్ తీరుపై యావత్ తెలంగాణ రైతాంగం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.

వరి నారుమడులు సిద్ధం చేసుకున్న రైతాంగం..

యాసంగిలో వరి సాగు వద్దని మౌఖికంగా చెబుతున్న అధికారికంగా రైతులకు వరి సాగుపై క్లారిటీ లేదు. అయితే సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ కంటే ముందుగానే వ్యవసాయ శాఖ వరి సాగు చేయోద్దంటూ ప్లెక్సీల ద్వారా చెబుతూ వచ్చింది. ఓ పక్క టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో కొట్లాడుతుంటే.. సీఎం కేసీఆర్ ఏలాగైనా కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయిస్తారనే ధీమాతో ఇప్పటికే చాలామంది రైతులు వరి నాడుమడులను సిద్ధం చేసుకున్నారు. మరికొంతమంది వరి నారు సైతం పోసుకున్నారు. కానీ ఊహించని విధంగా కేసీఆర్ సోమవారం సాయంత్రం ట్విస్ట్ ఇచ్చారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వమూ.. అటు వ్యవసాయ శాఖ వరికి ప్రత్యామ్నాయం పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించలేదు. ఇప్పటికిప్పుడు వరి వద్దని చెబితే ఎలా అంటూ సీఎం కేసీఆర్‌పై రైతులు అసంత‌ృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాలం కలిసిరాక రైతులు తీవ్ర అప్పుల్లో కూరుకుపోయారు. యాసంగి సీజన్‌లో భూములను పడావు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాగైతే మరింతగా అన్నదాతలు అప్పుల్లోకి వెళ్లే దుస్థితి దాపురించింది.


Next Story

Most Viewed