- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాలీవుడ్ కి గుర్తింపు తెచ్చిన విలేజ్ రాక్ స్టార్స్
జాలీవుడ్ కి గుర్తింపు తెచ్చిన విలేజ్ రాక్ స్టార్స్... with Rima Das' Village Rockstars movie jollywood industry recognised

ఏదైనా కళారూపానికి అవార్డులు రావడం రాకపోవడం అన్నది అంతా ప్రధానమైంది కాదు. ఉత్తమ కళారూపమేదయినా కేవలం వినోదం కోసం కాదు. మనుషుల సెన్సిబిలిటీని స్పృశించి మానవ విలువల్ని ఉద్దీపన చేసేదిగా వుంటుంది. అర్థవంతమైన సినిమా కూడా అంతే. ఈశాన్య భారతం నుండి ఎదిగిన సినిమా స్వల్పమే కానీ అన్ని విషయాల్లోలాగే అక్కడి సినిమాకు కూడా ప్రోత్సాహం కరువై పరాయిదిగానే వుండి పోయింది. కానీ అస్సాం నుంచి వెలువడిన ”విలేజ్ రాక్ స్టార్స్” ఈ ఏటి జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచి ఆ ప్రాంత విలక్షణతను నిరూపించుకుంది. ఇప్పుడే కాదు ఇటీవల నవంబర్‌లో హైదరబాద్‌లో జరిగిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో ఏసియన్ పనోరమా విభాగంలో ఉత్తమ చిత్రంగానూ, దర్శకురాలు రీమా సేన్‌కు ఏసియన్ ఉత్తమ దర్శకురాలిగానూ, ప్రధాన పాత్ర పోషించిన బన్నూ దాస్ ప్రత్యేక బహుమతిని గెలుచుకున్నారు. ఆనాడు ఏసియన్ జ్యూరీలో సభ్యుడిగా వుండి ఎంపికలో ప్రధాన పాత్ర పోషించినందుకు, ఇవ్వాళ అదే చిత్రం భారత జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమాగా నిలిచినందుకు నాకు ఆనందంగా వుంది. అంతే కాదు జాతీయ ఎంపిక కమిటీ బాలల చిత్రం అని చూడకుండా ప్రధాన స్రవంతిలో ఎంపిక చేసినందుకు చైర్మన్ శేఖర్ కపూర్, ఇతర సభ్యుల్ని అభినందించాల్సిందే.
ఎన్నో అవార్డులు సాధించి
ప్రకృతి సిద్దమయి నదీ నదాలూ, పర్వతాలతో స్వచ్చమయిన వాతావరణంతో తులతూగే ఈశాన్య భారతంలో ప్రధాన రాష్ట్రం అస్సాం. అక్కడినుంచి వచ్చిన సాహిత్యం, సంగీతం, సినిమా మొదలు అన్ని కళలూ అత్యంత ప్రాంతీయమై ఆసలయిన కళారూపాలుగా వుంటాయి.
అస్సామీ సినిమా జాలీవుడ్ (JOLLYWOOD)గా పిలవబడుతున్నది. 1935లో జ్యోతి ప్రసాద్ అగర్వాల్ నిర్మించిన “జోయ్ మతి” సినిమాతో అస్సామీ సినిమా ప్రారంభమయింది. కానీ అనేక కారణాల రీత్యా అక్కడ సినిమా విస్తారంగా ఎదగలేదు. చాలా కాలం కలకత్తా కేంద్రంగానే అస్సామీ సినిమాల నిర్మాణం జరిగింది. కానీ వచ్చిన సినిమాలు మాత్రం చాలావరకు మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. అట్లా ఇటీవల దర్శకురాలు రీమాదాస్ రచించి, దర్శకత్వం వహించిన సినిమా ‘విలేజ్ రాక్ స్టార్స్’. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో ఆసియా విభాగంలో దర్శకత్వ అవార్డుతో పాటు మరో రెండు అవార్డులు కూడా గెలుచుకుంది.
''విలేజ్ రాక్ స్టార్స్” సహజంగానూ, గ్రామీణ వాతావరణ నేపథ్యంలోనూ చిత్రించబడి ఆసామ్ జనజీవన సజీవ దృశ్యంలా సాగుతుంది. ఈ సినిమాను దర్శకురాలు తమ గ్రామం చాహాయి గాంవ్‌కు అంకితం చేస్తుంది.
మహిళల్లో ముఖ్యంగా అమ్మాయిల్లో స్వంతకాళ్ళపై నిలబడడం, వ్యక్తిత్వ నిర్మాణం రూపొందించుకోవడం, తన కలల్ని సాకారం చేసుకోవడం అనే అంశాలపై ఈ సినిమా సాగుతుంది. విజువల్‌గా చాలా అద్భుతంగా వుండి అబ్బురపరుస్తుంది.
కథేంటంటే
సినిమా కథా కథనానికి వస్తే ఓ మారు మూల గ్రామంలో ధును అనే ఓ పదేళ్ళ అమ్మాయి విధవరాలైన తన తల్లి, బద్దకస్థుడు అయిన అన్నతో కలిసి జీవిస్తుంటుంది. తల్లి చేసిన తినుబండారాలను అమ్ముకు రావడానికి జాతరకు వెళ్ళిన ధును అక్కడ ఒక బాండ్ ప్రదర్శన చూసి అబ్బురపడుతుంది. అంతే కాదు ఒక కార్టూన్ పుస్తకం చూసి ప్రభావితమయి తానూ ఒక గిటారిస్ట్ కావాలని, తానూ ఒక బాండ్‌ను రూపొందించుకోవాలని కలలుకంటుంది. ఒక పాత పేపర్లో పాజిటివ్‌గా వుండడం వల్ల కలలు సాకారమవుతాయని దాంతో దేన్నయినా సాధించుకోవచ్చునని అర్థం చేసుకుంటుంది. కానీ తమ పేదరికం అసహాయత అడ్డుపడుతుండగా మొక్కవోని దీక్షతో ఒక్కో రూపాయి కూడబెట్టడం ఆరంభిస్తుంది. అప్పుడే ధును రజస్వల అవుతుంది. మొత్తం ఆచారాల ప్రకారం తంతు నిర్వహిస్తారు. అప్పటినుంచి ఆమెపైన ఆంక్షలు ఆరంభమవుతాయి. చీరె కట్టాలని, మగపిల్లలతో కలిసి తిరగొద్దని కట్టుబాట్లు చెబుతారు. కానీ ధును తల్లి అందుకు భిన్నంగా తన బిడ్డకు పూర్తి స్వాతంత్య్రాన్ని ఇస్తుంది.
వరదలు, ప్రకృతి భీభత్శాలకు వాళ్ళకున్న కొద్ది భూమిలో పంట కూడా కొట్టుకుపోతుంది. ప్రతి ఏటా వరదలకు కొట్టుకుపోయే ఈ వ్యవసాయం ఎందుకు చేయాలని ధును తల్లిని అడుగుతుంది. తమకు తెలిసిన వృత్తీ, యాగం ఇదే అని తల్లి బదులిస్తుంది. మునిగిపోతుందని ఏమీ చేయకుండా వుండలేము కదా అంటుంది. రూపాయి రూపాయి కూడబెట్టి ధును తన గిటార్ కలను నెరవేర్చుకుంటుంది.
ఇక్కడ గిటార్ సాధించడం కేవలం ఒక సింబాలిక్ మాత్రమే, మొత్తం సినిమాలో ధును తన ఉత్సాహం, సొంతంగా సాధించాలనే తత్వం చాలా సహజంగా చూపిస్తుంది దర్శకురాలు.
వర్తమాన కాలంలో ఆడపిల్లలకు మగపిల్లలకు నడుమ వుండే ఒక ప్రధానమైన తేడాను ‘విలేజ్ రాక్ స్టార్స్’ వివరిస్తుంది. ధును అత్యంత ఉత్సాహవంతురాలిగా బాధ్యత కలిగిన అమ్మాయిలా వుంటే ఆమె అన్న బద్దకంగానూ చిన్న అవకాశం దొరికితే చాలు బడి ఎగ్గొట్టే రకంగానూ వుంటాడు. ఇక ధును తండ్రి ఈత నేర్చుకోవడానికి భయపడి నీళ్లలో మునిగి చనిపోతాడు. ఇట్లా ఆడపిల్లల స్వావలంబనను ఆవిష్కరిస్తూ ‘విలేజ్ రాక్ స్టార్స్’ కొనసాగుతుంది. ఇందులో నీలోత్పల్ బోరా సంగీతం అదనపు మూడ్‌ను కలిగిస్తుంది. కెమెరా బాధ్యతలను కూడా రీమాదాస్ నిర్వహించారు.
పిల్లల్ని చైతన్యవంతులను చేసే దిశలో సాగే ఈ సినిమాకు ధును పాత్రధారి భాంటియా దాస్ సహజ నటన ప్రధాన ఆకర్షణ. పేదరికానికి, ప్రకృతి వైపరీత్యాలకూ ఎదురొడ్డి తన కలల్ని సాకారం చేసుకునే పాత్రలో భాంటియా, ఆమె తల్లి పాత్రలో బసన్తీ దాస్‌తో పాటు ఎవరు కూడా వృత్తి కళాకారులు కాదు అందరూ గ్రామంలోంచి ఎన్నుకోబడ్డవారే కావడం గమనార్హం.‘ విలేజ్ రాక్ స్టార్స్’ ప్రపంచ వ్యాప్తంగా అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో బహుమతులు గెలుచుకుంటూనే వుంది.
పిల్లలు ప్రధానంగా చూడాల్సిన అసలయిన ప్రకృతి సిద్ధమైన మంచి సినిమా ‘విలేజ్ రాక్ స్టార్స్’.
ఇవి కూడా చదవండి: అల్లరి నరేష్ 'ఉగ్రం'.. థియేట్రికల్ ట్రైలర్ విడుదల
వారాల ఆనంద్
94405 01281






