మరోకోణం: పొలిటికల్ పంచాంగమ్-2023

by D.Markandeya |
మరోకోణం: పొలిటికల్ పంచాంగమ్-2023
X

2022 వెళ్లిపోయింది. 2023 వచ్చేసింది. కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో పరిశీలించడం ఎవరికైనా ఆసక్తికరమే. గత సంవత్సరమంతా పొలిటికల్ హీట్ హాట్ హాట్‌గా కొనసాగింది. బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్, సడెన్‌గా దూకుడు పెంచిన బీజేపీ మధ్య పూర్తి స్థాయి యుద్ధమే నడిచింది. ఒకవైపు కేసీఆర్, కేటీఆర్, కవిత.. మరోవైపు మోడీ, షా, నడ్డా, బండి సంజయ్‌ కేంద్ర బిందువులుగా మారారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులే సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. విమర్శించుకున్నారు. మునుగోడు వేదికగా ఒక సమరం ముగిసింది. భారీగా బలగాల మోహరింపు జరిగింది. పదివేల ఓట్ల తేడాతో అధికార పార్టీ నెగ్గినా, కమలదళం బలమేమిటో తేటతెల్లమైంది.

కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తానని పదే పదే ప్రకటించిన బండి సంజయ్, అది జరగక ముందే స్వయంగా తాను జైలుకు వెళ్లాల్సి వచ్చింది. చివరాఖరులో సీబీఐ, ఈడీ, ఐటీ రంగప్రవేశం చేసి కేసీఆర్ కుటుంబంపై దృష్టి సారించిన నేపథ్యంలో ఆయన కోరిక నెరవేరే సూచనలు కనిపించాయి. సంవత్సరమంతా ప్రజల, ప్రసార మాధ్యమాల, పరిశీలకుల, వ్యూహకర్తల దృష్టి ఈ రెండు పార్టీల చుట్టూతానే తిరిగింది.

గొడవలు మానకుండా

మూడవ పార్టీ కాంగ్రెస్ మరో రకంగా ఫేమస్ అయింది. తమలోని పోరాట చేవను, వాడిని, వేడిని ప్రత్యర్థులైన బీఆర్ఎస్, బీజేపీ పైన వాడడం మాని అంతర్గత తగాదాలకు ఉపయోగించడం ద్వారా ఆ పార్టీ నేతలు తమ సోయి లేనితనాన్ని నిరూపించుకున్నారు. మునుగోడులో డిపాజిట్ దక్కక బొక్కబోర్లా పడ్డారు. ఏడాది పొడవునా రేవంత్ వర్గానికి, సీనియర్లుగా వ్యవహరించే రేవంత్(revanth reddy)వ్యతిరేక వర్గానికీ మధ్య గొడవలు కొనసాగాయి. ఎడతెగని ఈ ఘర్షణలను నివారించడంలో కాంగ్రెస్ హైకమాండ్ ఘోరంగా విఫలమైంది. చివరకు, ఏఐసీసీ(AICC) రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ (Manickam Tagore) సైతం ఈ రొంపిలో ఇరుక్కున్నారు.

ట్రాక్‌లోకి మళ్లీ సైకిల్

చనిపోయిందనుకున్న టీటీడీపీని(T-TDP) సంవత్సరాంతానికి పొరుగు రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబు(chandrababu naidu) ఆదుకున్నారు. ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహించి జోష్ తెచ్చారు. వచ్చే ఎన్నికలలో కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. వైఎస్ కూతురు, తెలంగాణ కోడలు షర్మిల పెట్టిన వైఎస్సార్‌టీపీ(YSRTP) రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ముద్రా వేయలేకపోయింది. మూడు వేల కి.మీ.ల పాదయాత్ర, కేసీఆర్‌పై ఆమె సంధించిన బాణాలు ప్రతిపక్షాలకే లాభిస్తాయనే టాక్ వచ్చింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(rs praveen kumar) చేరికతో కొత్త జవసత్వాలు సంతరించుకున్న బీఎస్పీ మునుగోడులో తన ఉనికిని చాటడానికి గట్టిగా ప్రయత్నించింది. ఇక, ఎర్రపార్టీలు దాదాపుగా తమ అస్తిత్వాన్ని కోల్పోయాయి. బీజేపీ బూచిని చూపి బీఆర్ఎస్(BRS) వెనక చేరాయి. పవన్ కల్యాణ్(Pavan kalyan) జనసేన కదమ్‌తాల్ ఇంకా ఇక్కడ మొదలుకానేలేదు.

ఎవరి జాతకం ఏమిటో?

ఓవరాల్‌గా 2022లో జరిగిన రాజకీయ పరిణామాలు ఇవి. మరి 2023లో వివిధ రాజకీయ పార్టీల జాతకం ఎలా ఉండనుంది? మొదట అధికార టీఆర్ఎస్‌నే తీసుకుందాం. భారత్ రాష్ట్ర సమితిగా(Bharat Rashtra Samithi) మారడంతో ఆ పార్టీకి గత రెండు ఎన్నికలలోనూ ప్రధానాస్త్రంగా నిలిచిన తెలంగాణ సెంటిమెంటును వాడుకునే అవకాశాన్ని ఈసారి కోల్పోయింది. షర్మిల(Ys sharmila) ఇక్కడ తిష్ట వేసినా, చంద్రబాబు ఊరూరా తిరిగినా, ఆంధ్రా పార్టీలంటూ విరుచుకుపడే అవకాశాన్ని కేసీఆర్(kcr) కోల్పోయారు. ఇప్పటికే 'బంగారు తెలంగాణ'గా మారడం వల్లనూ, ఈ మోడల్‌ను దేశమంతటా అమలు చేస్తామంటున్నారు కనుకనూ 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్'(APP KI BAR Kisan Sarkar) నినాదం ఇక్కడ పనికిరాదు. మరేదో కొత్త అస్త్రాన్ని వెదుక్కోవాలి. రెండేళ్ల కిందట కొండపోచమ్మ సభలో కేసీఆర్ ప్రకటించినట్లు భారతదేశం అబ్బురపడే పథకం ఏదైనా తెస్తారేమో చూడాలి.

గెలుపు గుర్రాల వేట

ఈసారి కూడా సిట్టింగులకే సీట్లు అంటూ గులాబీ బాస్ సూచనప్రాయంగా తెలిపినా అలా జరిగే అవకాశం కనిపించడం లేదు. ఆయా నియోజకవర్గాలలో వరస సర్వేలు నిర్వహిస్తూ గెలిచే అవకాశం ఎక్కువ ఉన్న అభ్యర్థుల గురించి ఆయన ఆరా తీస్తున్నారు. బహుశా అలాంటి గెలుపు గుర్రాలు కాంగ్రెస్, బీజేపీ సహా ఏ పార్టీలో ఉన్నా వారికే గులాబీ బీ ఫాం ఇచ్చే ఎత్తుగడలను కేసీఆర్ అనుసరించవచ్చు. అది ఆచరణలో సాధ్యం కాకపోతే ప్రతిపక్షం నుంచే పోటీ చేయించి తను ఫండింగ్ చేయవచ్చు. గెలిచిన తర్వాత తమ పార్టీలోకి ఫిరాయింపజేసుకోవచ్చు.

కేసులు కొలిక్కి వస్తాయా?

లిక్కర్, ఫాంహౌస్, క్యాసినో కేసులు 2023లోనూ ఒక కొలిక్కి రాకపోవచ్చు. పొలిటికల్ హైడ్రామాలు అసెంబ్లీ ఎన్నికల తదుపరి వచ్చే పార్లమెంటు ఎన్నికల వరకూ కొనసాగవచ్చు. ఈ పరిణామాల ఆధారంగా ఓటర్లను ఆకట్టుకోవడానికి టీఆర్ఎస్, బీజేపీ రెండూ ప్రయత్నించవచ్చు. ఈ పాచికలాటలో లాభనష్టాల కోణంలో చివరకు కొందరు ప్రముఖ నేతలు జైలు వెళ్లవచ్చు. అయితే, అది సానుభూతికి దారితీసే అవకాశముంటే మాత్రం సాగదీతను కొనసాగించవచ్చు. వచ్చే ఎన్నికలలో కేసీఆర్ కుటుంబ అవినీతి ప్రతిపక్షాలకు ప్రధాన ప్రచారాస్త్రంగా మారడం మాత్రం ఖాయం.

ఆయనే బీజేపీకి తురుపు ముక్క

హుజూరాబాద్, మునుగోడు తర్వాత రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రధాన ప్రత్యామ్నాయంగా మారిన బీజేపీ జోరు కొత్త సంవత్సరంలోనూ కొనసాగుతుంది. మోడీ-షా(modi-sha) ద్వయం పర్యవేక్షణలో ఆ పార్టీ తన వ్యూహం-ఎత్తుగడలను ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. కాంగ్రెస్‌ను చావుదెబ్బ తీయడం, టీఆర్ఎస్‌కు గెలుపు దక్కకుండా చేయడంపైనే కేంద్రీకరిస్తుంది. 2022లో పాదయాత్రలు చేసి ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న బండి సంజయ్‌ను(bandi sanjay) పార్టీ తురుపు ముక్కగా వాడుకుంటుంది. కేసీఆర్ కుటుంబంపై ఆయన మరింత తీవ్రంగా విరుచుకుపడతారు. ఇప్పటిదాకా ఇక్కడ అధికారంలో లేకపోవడం, బీఆర్ఎస్‌పై ఉండే ప్రభుత్వ వ్యతిరేకత, అంతర్గత తగాదాల నుంచి కోలుకోని కాంగ్రెస్, కమలనాథులకు అనుకూలించే అంశాలు. నియోజకవర్గస్థాయిలో ప్రజాదరణ ఉన్న అభ్యర్థులు లేకపోవడం, ముస్లిం, దళిత, వామపక్ష సెక్షన్లలో ఆదరణ లేమి వ్యతిరేకాంశాలుగా పనిచేస్తాయి.

వారు మారతారా?

కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశం పైనే బీఆర్ఎస్, బీజేపీ భవిష్యత్తు, ఎన్నికలలో గెలుపోటములు, పొందే స్థానాలు, ప్రభుత్వ ఏర్పాటు వంటి విషయాలు ఆధారపడివుంటాయి. కాంగ్రెస్(congress) తన తీరును మార్చుకోకుండా, ఎండ్రికాయల కొట్లాటను కంటిన్యూ చేస్తే బీజేపీ భారీగా లాభపడుతుంది. హస్తం గుర్తుకు పడే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ దాదాపుగా కమలానికి పడే అవకాశముంటుంది. హుజూరాబాద్‌లో లాగా దళిత, వామపక్ష ఓటుబ్యాంకు కూడా ఆ పార్టీకే మళ్లవచ్చు. ఒకవేళ, అంతర్గత గొడవల నుంచి బయటపడి ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ ఐక్యంగా పనిచేస్తే మాత్రం ఓట్లు చీలి అధికార పార్టీకి లాభించడం ఖాయం.

వీరు ఉనికిని చాటుకోవడమే

ఎన్ని స్థానాలలో పోటీ చేసినా టీటీడీపీ, వైఎస్సార్‌టీపీ, బీఎస్పీ, వామపక్షాలు, జనసేన.. ప్రధాన పార్టీల ఓట్లను చీల్చడం తప్ప గెలిచే అవకాశాలు తక్కువేనని చెప్పవచ్చు. అన్నీ కలిపి సింగిల్ డిజిట్ కూడా దాటకపోవచ్చు. టీడీపీ గ్రేటర్ హైదరాబాద్‌లో, షర్మిల పార్టీ ఖమ్మంలో, ఎర్ర పార్టీలు నల్లగొండ, ఖమ్మంలలో ఒకటో రెండో సీట్లు గెలిచే అవకాశముంది. బీఎస్పీ(BSP) ఎక్కడా గెలువకపోయినా, రిజర్వుడ్ స్థానాలలో తన ఉనికిని చాటి ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకునే చాన్స్ ఉంది. జనసేన(Janasena) ప్రభావం ఏమీ ఉండకపోవచ్చు.

ఫైనల్‌గా, కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిణామాలపైనే 2023లో రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడనుందనే అంశం ఆధారపడి వుంటుందని పక్కాగా చెప్పవచ్చు. ఆ పార్టీ సెట్ రైట్ అయి గట్టి పోటీ ఇస్తే, బీఆర్ఎస్‌కే అధికారం దక్కవచ్చు. సొంతంగా మెజారిటీ రాకున్నా ఎంఐఎం(MIM) సపోర్టుతో గట్టెక్కవచ్చు. అదీ సరిపోలేదంటే కాంగ్రెస్‌తోనో లేదంటే బీజేపీతోనో కలిసి సంకీర్ణ సర్కారు ఏర్పాటుచేసే స్వేచ్ఛ కేసీఆర్‌కు ఉండనే ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరంలో ఉండడమనే ఆయన వైఖరి ఇందుకు అవకాశం కల్పిస్తుంది. శత్రువుకు శత్రువు మిత్రుడనే కోణంలో అప్పటి పరిస్థితులను బట్టి ఆ రెండు జాతీయపార్టీలలో ఏదో ఒకటి ఆయన దరి చేరకతప్పదు.

కొసమెరుపు

మారకపోవడం జన్మహక్కులా భావించే హస్తం పార్టీ ఎప్పటిలాగే అస్తవ్యస్తంగా పోటీలో దిగితే మాత్రం కాషాయపార్టీకి లాభించవచ్చు. కాంగ్రెస్ సీన్‌లో లేని ద్విముఖపోరులో కేసీఆర్ కుటుంబ అవినీతి అస్త్రం పనిచేసి, జనంలో బీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తే అధికారం కూడా దక్కవచ్చు.

డి మార్కండేయ

[email protected]

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Next Story