- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మరోకోణం: బీజేపీకి ప్రత్యామ్నాయమేది?
దేశవ్యాప్తంగా ప్రస్తుతం బీజేపీ మంచి దూకుడు మీదుంది. ఇప్పటికే రెండు దఫాలుగా పాలన సాగించిన ప్రధాని నరేంద్ర మోడీ హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్నారు. ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన అనేక విమర్శలున్నా, ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలినా 2019 మే తర్వాత ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలలో ఆయన పార్టీ విజయం సాధిస్తూనే వుంది. చేజారుతుందని భావించిన ఉత్తరప్రదేశ్ 2022లో అనూహ్యంగా భారీ మెజారిటీతో తమ ఖాతాలో పడడం కమలనాథులను సైతం సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది.ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో సైతం ఆ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంది.
2021లో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎలక్షన్ జరగ్గా, అస్సాంలో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఓడిన చోట సైతం తన సీట్లను పెంచుకోగలిగింది. మూడే సీట్లున్న బెంగాల్‌లో 77 సాధించగా, ఒక్కరూ లేని తమిళనాడులో నాలుగు స్థానాలు పొంది ఉనికిని చాటింది. 2020లో సైతం బిహార్‌లో 53 నుంచి 74 స్థానాలకు ఎగబాకి ఆర్జేడీ తేజస్విని అధికారంలోకి రాకుండా ఆపింది. ఢిల్లీలో మరోసారి ఓడిపోయినా, 5 సీట్లను అదనంగా గెలిచింది. వరుసగా జరిగిన ఉపఎన్నికలలో సైతం ప్రభుత్వ వ్యతిరేక పవనాలను అధిగమించి మెజారిటీ స్థానాలను సాధించింది. మొత్తం 28 రాష్ట్రాలకు గాను 16 రాష్ట్రాలలో ఇప్పుడు అధికార బీజేపీ జెండా రెపరెపలాడుతోంది.
హస్తం అయోమయం
మరోవైపున ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్న కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నది. 2019 సాధారణ ఎన్నికలలో ఆ పార్టీ కేవలం 54 ఎంపీ స్థానాలు మాత్రమే సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఆ ఘోర ఓటమి అనంతరం రాహుల్‌గాంధీ రాజీనామా సమర్పించగా, ఎన్నికైన అధ్యక్షుడు లేకుండానే ఈ మూడేళ్లు నిష్క్రియగా, నిస్తేజంగా పార్టీ కార్యకలాపాలు కొనసాగాయి. హైకమాండ్ ఉనికి ప్రశ్నార్థకమైంది. అన్ని పీసీసీలలోనూ అంతర్గత కుమ్ములాటలు సాధారణమయ్యాయి. అగ్రనేతలు సైతం పార్టీ ప్రయోజనాల కంటే తమ సొంత ప్రయోజనాలే మిన్నగా పని చేస్తున్నారు.
ఇటీవలి గెహ్లాట్ రాజస్థాన్ సంక్షోభం ఇందుకు పరాకాష్ఠగా చెప్పవచ్చు. వివిధ రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికలలోనూ పార్టీ కడు దయనీయమైన ఫలితాలను చవిచూసింది. ప్రభుత్వ వ్యతిరేక పవనాలను తనకు అనుకూలంగా ఉపయోగించుకోలేకపోయింది. 2022లో పంజాబ్‌ను ఆప్ చేతిలో పెట్టేసింది. ఉపఎన్నికలలో సైతం అత్తెసరు ఫలితాలే సాధించగలిగింది. ప్రస్తుతం కేవలం రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే పవర్‌లో ఉండి, జాతీయ పార్టీకి తక్కువ.. ప్రాంతీయ పార్టీకి ఎక్కువ.. అన్న పరిస్థితికి చేరింది.
Also read: మరోకోణం: రాహుల్‌జీ.. పహ్‌లే కాంగ్రెస్ జోడో!
ఆప్‌తో అడ్డంకులు
వచ్చే సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలోనూ కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. ప్రత్యేకించి గుజరాత్‌లో ఆ పార్టీ గత ఎన్నికలలో 77 సీట్లు సాధించి, అధికారానికి అతిదగ్గరగా వెళ్లినా, ప్రస్తుతం శ్రేణులలో నిరాశ నిస్పృహలు ఆవరించివున్నాయి. గ్రూపు కొట్లాటలు తారస్థాయికి చేరాయి. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు జగదీశ్ ఠాకూర్, మాజీ అధ్యక్షుడు భరత్ సిన్హ్ సోలంకి వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. గత ఎన్నికలలో కీలకంగా వ్యవహరించిన పాటిదార్ల నేత హార్దిక్ పటేల్ బీజేపీలోకి ఫిరాయించగా, దళిత నేత జిగ్నేశ్ మేవానీ తనపై మోపిన కేసులను ఎదుర్కోవడంలో బిజీగా ఉన్నారు.
మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వేగంగా దూసుకువస్తోంది. అధికారమే పరమావధిగా ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ పావులు కదుపుతున్నారు. ఆప్ గెలుస్తుందో లేదో తెలియదు కానీ, కాంగ్రెస్‌ను గెలువనీయకుండా మాత్రం చేయగలదని పరిశీలకులు అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి పరోక్షంగా బీజేపీకే తోడ్పడగలదని భావిస్తున్నారు. ఇక, భారత్ జోడో యాత్రలో ఉన్న అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతున్న ఆ యాత్ర ఏపీ, తెలంగాణ మీదుగా నవంబర్‌లో మహారాష్ట్రలో, డిసెంబర్‌లో మధ్యప్రదేశ్‌లో ప్రవేశించనుంది. యాత్రను మధ్యలో ఆపేసి ప్రచారానికి వెళ్లే విషయంలో ఇప్పటికైతే ఎలాంటి స్పష్టతా లేదు. గుజరాత్‌ను కోల్పోయిన పక్షంలో కాంగ్రెస్ జాతీయస్థాయిలో బీజేపీకి ఎంతమాత్రం ప్రత్యామ్నాయం కాజాలదు.
Also read: మరోకోణం:అబ్ కీ బార్ ఆప్ కా!?
అందరూ అందరే
కాంగ్రెస్ కాకుండా జాతీయపార్టీలుగా ఈసీ గుర్తింపు పొందిన సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్‌ల పరిస్థితి అందరికీ తెలుసు. సీపీఎం, తృణమూల్‌లు ఒక్కో రాష్ట్రంలో అధికారంలో ఉన్నా, వాటికి దేశవ్యాప్త ఆదరణ ఎంతమాత్రం లేదు. యూపీలో గెలిచి ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన బీఎస్పీ ప్రస్తుతం దీనావస్థలో ఉంది. ఎన్సీపీ మహారాష్ట్రలో తప్ప మరెక్కడా గెలవడం లేదు. ఇక సీపీఐ క్రమంగా కనుమరుగైపోతోంది. మోడీని దించడమే కర్తవ్యంగా కేసీఆర్ ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ సైతం ఈ పార్టీలకు భిన్నంగా ఏమీ ఉండబోదు. మహా అయితే తెలుగు ప్రజలున్న రాష్ట్రాలలో కొన్ని ఓట్లు రాబట్టుకోగలదు.
ఐక్య సంఘటన అనుమానమే!
అలాంటప్పుడు మోడీ పాలనకు, బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ఒకే మార్గం కనిపిస్తున్నది. కాంగ్రెస్ నేతృత్వంలో భావ సారూప్యత కలిగిన జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ ఒకే ఒక ఐక్య సంఘటనగా రూపుదిద్దుకోవడం. థర్డ్ ఫ్రంట్ లాంటి మరో వేదిక ఉనికిలోకి రాకుండా, ఓట్లు, సీట్లు చీలకుండా చూడడం. ఇలా జరిగే అవకాశం ఇప్పటికైతే దాదాపుగా కనిపించడం లేదు. ఎందుకంటే యూపీఏలో భాగంగా ఉన్న డీఎంకే, ఆర్జేడీ, జేడీ (యూ), ఎన్సీపీ, శివసేన (థాకరే), ఐఎన్ఎల్డీ, జేఎంఎం, ఇతర చిన్న పార్టీలు, యూపీఏ బయట ఉన్న సీపీఎం, సీపీఐ తప్ప మరే పార్టీ ఇలాంటి ఐక్య సంఘటన కు సిద్ధంగా లేవు.
ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీ సహా ఎన్డీయే బలం 330 కాగా, ఈ పార్టీలన్నింటికి కలిపి 119 స్థానాలే ఉన్నాయి. 23 సీట్లున్న తృణమూల్ అధినేత్రి మమత, 9 సీట్లున్న కేసీఆర్.. బీజేపీయేతర-కాంగ్రెసేతర ఫ్రంట్‌ను ప్రతిపాదిస్తున్నారు. అఖిలేశ్ ఎస్పీ (2 సీట్లు), మాయావతి బీఎస్పీ (10 సీట్లు) కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేయలేమని గతంలో తేల్చిచెప్పాయి. 12 స్థానాలున్న నవీన్ పట్నాయక్ బీజేడీ అన్ని రకాల అలయెన్స్‌లకు దూరంగా ఉంటోంది.
Also read: మరోకోణం: లౌకికవాదుల డైలమా!?
కొసమెరుపు
ఈ పరిస్థితులలో భారత్ జోడో యాత్ర సూపర్ సక్సెస్ కావాలని, ఏదో అద్భుతం జరిగి గుజరాత్‌లో కాంగ్రెస్ గెలవాలని కాంక్షించడం తప్ప బీజేపీ వ్యతిరేక శక్తులు, లౌకికవాదులు ప్రస్తుతం చేయగలిగింది ఏమీ లేదు. అలా జరిగినప్పుడు మాత్రమే యూపీఏ, ఎన్డీయే బయట ఉన్న చిన్నా పెద్ద పార్టీలు ఎన్నికలకు ముందో, తర్వాతో కాంగ్రెస్ నేతృత్వాన్ని అంగీకరించి ఐక్య సంఘటనలో చేరతాయి. లేదంటే మరోమారు దేశంలో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం, మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టడం ఖాయంగా కనిపిస్తున్నది.