మరోకోణం: లౌకికవాదుల డైలమా!?

by D.Markandeya |
మరోకోణం: లౌకికవాదుల డైలమా!?
X

మునుగోడు ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ సీపీఐ, సీపీఎం చేసిన ప్రకటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మతోన్మాద, నియంతృత్వ, ఫాసిస్టు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ పార్టీ చేసిన తీర్మానం మేరకు, రాష్ట్ర స్థాయిలో సైతం ఆ పార్టీ వ్యతిరేక వైఖరి తీసుకుంటున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి (అప్పటికి) చాడ వెంకట్‌రెడ్డి ఆగస్టు 20న ప్రకటించారు. బీజేపీని ఓడించగలిగే సత్తా టీఆర్ఎస్‌కు మాత్రమే ఉన్నందున ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సపోర్ట్ మునుగోడుకు మాత్రమే పరిమితం కాదని, భవిష్యత్తులోనూ కొనసాగుతుందని స్పష్టతనిచ్చారు.

దాదాపు ఇదే రకమైన వైఖరిని మరో కమ్యూనిస్టు పార్టీ సీపీఎం కూడా తీసుకుంది.మతోన్మాద శక్తులతో దేశానికి పొంచివున్న ముప్పు రీత్యా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి నడవక తప్పదని ఆ పార్టీ తెలిపింది. అయితే, ఈ రెండు పార్టీలు తప్ప ఇతర వామపక్ష, లౌకికవాద భావజాలం కలిగిన పార్టీలు, ప్రజా సంఘాలు, స్వతంత్ర శక్తులు తమ వైఖరిని ఇంకా స్పష్టం చేయలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కారు గత ఎనిమిదేళ్లుగా అవలంభించిన ప్రజావ్యతిరేక విధానాలు, చర్యలు ఇందుకు ప్రధాన కారణం. ఏడేళ్లకు పైగా మోడీ పాలనను, విధానాలను సమర్థించిన కేసీఆర్, ఇప్పుడు సడెన్‌గా బీజేపీ వ్యతిరేక లైను తీసుకోవడంతో ఏం చేయాలో వాళ్లకు అర్థం కావడం లేదు. పైకి బీజేపీ-టీఆర్ఎస్ వ్యతిరేక వైఖరి కనబర్చినప్పటికీ, మధ్యేవాద పార్టీ కాంగ్రెస్ సైతం ఇదే డోలాయమాన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

చర్చ కొనసాగుతున్నా

మామూలుగా 'శత్రువుకు శత్రువు మిత్రుడు' అన్న ఫార్ములాను గుడ్డిగా అన్వయిస్తే బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కేసీఆర్‌కు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు ఇవ్వాల్సిందే. ఆర్థిక కష్టాలలో ఉన్న సీపీఐ, సీపీఎం ఈ సూత్రాన్ని ఏ మొహమాటమూ లేకుండా ఆన్వయించుకుని బహిరంగంగా అధికార పార్టీ దరిన చేరాయి. మిగతా పార్టీలు, శక్తులు ఆ పని చేయలేకపోతున్నాయి. ముందు నుయ్యి, వెనకాల గొయ్యిలాగా తయారైంది వాటి పరిస్థితి.

ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా విద్యావంతులు, మేధావులలో ఒక చర్చ చాలా సీరియస్‌గా నడుస్తోంది. దేశమంతటా వ్యాపించి ఇప్పుడు తెలంగాణలో పాగా వేయడానికి దూకుడుగా ప్రయత్నిస్తున్న బీజేపీ భావజాలాన్ని వ్యతిరేకించే శక్తుల ప్రస్తుత కర్తవ్యమేమిటన్నది ఈ చర్చలో ప్రధానాంశం.

మరోకోణం: కేసీఆర్ కొత్త పార్టీ... ఫ్రంటా? టెంటా?

దానిని వ్యతిరేకించేందుకే

కమ్యూనిస్టులు తీసుకున్న వైఖరినే అనుసరించక తప్పదని, రాష్ట్రంలో కమలదళం పురోగమనాన్ని ఆపడం కాంగ్రెస్ వల్ల కాదని, అందుకే కేసీఆర్‌ను సమర్థించక తప్పదనేది మొదటి వాదన. బీజేపీపై గులాబీ బాస్ ప్రకటించిన యుద్ధం నిజమైనదేనని ఈ వాదన చేసేవాళ్లు నమ్ముతున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకునే క్రమంలో కేసీఆర్ గతంలో కొన్ని అనైతిక, నియంతృత్వ, ప్రజావ్యతిరేక విధానాలను అనుసరించి వుండవచ్చునని, అంతమాత్రాన ఇప్పుడు ఆయనను దూరం పెట్టడం సరైంది కాదని వీరు భావిస్తున్నారు.

సమాజాన్ని మత ప్రాతిపదికన విభజించే బీజేపీ రూపంలో ఇప్పుడు దేశానికి, రాష్ట్రానికి పెను ప్రమాదం పొంచి వుందని, ఆ పార్టీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కాకపోతే ముప్పు తప్పదని విశ్వసిస్తున్నారు. ఇప్పుడు అధికార పార్టీ అండన చేరడం తప్పు కాదంటున్న వీరు భవిష్యత్తులో కాంగ్రెస్‌ను సైతం కలుపుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు.

కమలం దారిలో గులాబీ దళం

కేంద్రంలో బీజేపీ ఏ విధానాలనైతే అవలంభిస్తున్నదో అచ్చం అవే విధానాలను రాష్ట్రంలో టీఆర్ఎస్ అనుసరిస్తోందని, ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందన్నది రెండవ వాదన. ఏడేళ్ల పాటు మోడీ పాలనను ప్రశంసిస్తూ వచ్చిన కేసీఆర్, పది నెలల క్రితం అకస్మాత్తుగా వైఖరి మార్చడాన్ని వీరు అనుమానిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను నామరూపాల్లేకుండా చేయడానికే మోడీ-షా ద్వయం, కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే నాలుగైదు రాష్ట్రాలలో తప్ప ఎక్కడా బలమైన ఉనికి లేని కాంగ్రెస్‌, తెలంగాణలో అధికారంలోకి రావడానికి చాన్సుందని గుర్తించిన కమలనాథులు ఈ వ్యూహాన్ని రచించారని భావిస్తున్నారు.

టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా వచ్చే ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ నష్టపోతుందనే అంచనాతోనే ఈ ఉత్తుత్తి యుద్ధానికి తెర లేపారని చెబుతున్నారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ఇంత కాలం ఎంఐఎంతో అంటకాగిన కేసీఆర్, రేపు ఎన్డీయే కూటమిలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. జాతీయపార్టీ నాటకం కూడా ఇందులో భాగమేనని శంకిస్తున్నారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయ శక్తి పేరిట చివరకు యూపీఏను వీక్ చేయడమే ఆయన కొత్త పార్టీ లక్ష్యమని విమర్శిస్తున్నారు. అలాంటి కేసీఆర్‌తో జతకట్టడమంటే ఆత్మహత్యా సదృశమేనని స్పష్టం చేస్తున్నారు.

ఆయనను దించాలనే

స్వల్ప సంఖ్యలోనే ఉన్నా కొన్ని వర్గాలలో మూడవ వాదన కూడా ఉంది. బంగారు తెలంగాణ చేస్తానంటూ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చిన కేసీఆర్‌ను గద్దె దించడానికి సిద్ధాంతాలను సైతం పక్కన పెట్టినా తప్పు లేదని వీరు భావిస్తున్నారు. ఆ మాటకొస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్ తదితర పార్టీలు అనుసరించేది కూడా లౌకికవాదం ముసుగులో కుల, మత ప్రాతిపదికన రాజకీయాలేనని ఆరోపిస్తున్నారు.

కేంద్రంలో, రాష్ట్రంలో నిర్వీర్యమైన స్థితిలో ఉన్న కాంగ్రెస్‌కు అధికార టీఆర్ఎస్‌ను ఢీకొనే శక్తి లేదని, ఈ పరిస్థితులలో కేసీఆర్‌ను పడగొట్టాలంటే బీజేపీని బలపర్చడమే ఏకైక మార్గమని వీరు నమ్ముతున్నారు. ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బొడిగె శోభ తదితరులు కమలదళంలో చేరడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. ఇది పైకి అవకాశవాదంగా కనిపించినా కేసీఆర్ నిరంకుశ ప్రభుత్వాన్ని సాగనంపడానికి మరో దారి లేదని సమర్థించుకుంటున్నారు.

మరోకోణం: గజం మిథ్య...పలాయనం మిథ్య!

ఎవరు ఎవరితో కలుస్తారు

మొదటి వాదన చేస్తున్నవాళ్లలో సీపీఐ, సీపీఎం ఇప్పటికే కేసీఆర్ వైపు వెళ్లగా, మిగతా కొన్ని శక్తులు సాకును వెతుక్కునే పనిలో ఉన్నాయి. రెండవ వాదన చేస్తున్నవాళ్లు రాష్ట్రంలో బీజేపీయేతర, టీఆర్ఎస్‌యేతర కూటమిని ప్రతిపాదిస్తున్నారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలోని మరే పార్టీ ఈ వాదనను సీరియస్‌ ఎజెండాగా తీసుకోవడం లేదు. చొరవ చూపించి, నాయకత్వం వహించాల్సిన పీసీసీ, తీవ్ర అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయి చేష్టలుడిగిన స్థితిలో ఉంది. మిగిలింది టీడీపీ, బీఎస్పీ, టీజేఎస్, వైఎస్సార్ టీపీ వగైరా చిన్నపార్టీలు. వీటిలో టీడీపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే ఉంది. పైగా అది చంద్రబాబు పార్టీ కనుక ఇక్కడి ప్రజలలో పరాయి భావన ఉంది. షర్మిల నేతగా ఉన్న వైఎస్సార్ టీపీ ఇప్పటివరకు అన్ని పార్టీలనూ దుమ్మెత్తి పోసే వైఖరితోనే ఉంది. ఆ పార్టీ అటు టీఆర్ఎస్‌తోనూ, ఇటు బీజేపీ, కాంగ్రెస్‌లతోనూ కలువకుండా ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉంది. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి సిద్ధాంతరీత్యా ఈ వాదనను బలపరిచే అవకాశముంది. ఈ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమవుతుందని పలుమార్లు వార్తలు వచ్చినా, వాటిని ప్రొఫెసర్ ఖండించారు. కాంగ్రెస్ నేతలు చొరవ తీసుకుంటే తెలంగాణ ఇంటి పార్టీలాగే ఇది కూడా అందులో కలవడం ఖాయమని సమాచారం.

ఏనుగు ఘీంకరించేనా?

ఇక, ఐపీఎస్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ చేరికతో చురుగ్గా మారిన బీఎస్పీ రాష్ట్రంలో రోజురోజుకు పుంజుకుంటోంది. ఆయన చేస్తున్న బహుజన రాజ్యాధికార యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. 40 లక్షలకు పైగా స్వేరోల సపోర్ట్ ఉన్న ఆర్ఎస్పీని వచ్చే ఎన్నికలలో తక్కువ అంచనా వేస్తే తప్పులో కాలేసినట్లేనని పరిశీలకుల అంచనా.

సరైన ఎన్నికల వ్యూహాన్ని అనుసరించి, అభ్యర్థుల ఎంపికపై, పోల్ మేనేజ్‌మెంట్‌పై శ్రద్ధ చూపితే ఈసారి ఆ పార్టీకి మంచి ఫలితాలే రావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఇప్పటివరకు ఈ పార్టీ టీఆర్ఎస్, బీజేపీకి సమదూరం పాటిస్తోంది. ఇరుపార్టీల విధానాలనూ వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్‌ను శత్రువుగా భావించకున్నా, ఆ పార్టీతోనూ కలిసే అవకాశం కనిపించడం లేదు.

కొసమెరుపు

ఈ పరిస్థితులలో రాబోయే కాలం చాలా కీలకమైనదని చెప్పవచ్చు. ఎన్నికలు సమీపించేలోగా రాష్ట్ర ప్రజల మదిలో ఏ భావన బలపడుతుందో, ఏ పార్టీకి దగ్గరవుతారో ఇప్పుడే చెప్పడం కష్టం. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా తీరని తమ వెతలకు కారణం రెండు దఫాలు పాలించిన కేసీఆరేనని ఛీ కొడతారా? లేక సరిగ్గా సహకరించక, నిధులివ్వక సామాన్యులపై ధరాభారం వేసిన మోడీ సర్కార్‌ను నిందిస్తారా? లేదంటే ఆ రెండు పార్టీలూ కారణమని భావిస్తారా?

కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజలలో వ్యతిరేక పవనాలు వీస్తే, ఆ ఓట్లు కమలానికి పడతాయా? కాంగ్రెస్‌కు పడతాయా? ఒకవేళ మోడీ వ్యతిరేక సెంటిమెంటు పండితే, ఆ ఓట్లన్నీ కారు గుర్తు పైనే పడతాయా? కాంగ్రెస్ చీల్చుతుందా? ఈ ఇరుపార్టీలనూ గద్దె దించాలని అనుకుంటే, ఆ ఓట్లను రాబట్టుకునే స్థితికి కాంగ్రెస్ చేరుతుందా? ఇవన్నీ ఇప్పుడే జవాబు దొరకని ప్రశ్నలు.

డి. మార్కండేయ

[email protected]

ఇవి కూడా చదవండి :

మరోకోణం: కేసీఆర్ కొత్త పార్టీ.. ఫ్రంటా? టెంటా?

మరోకోణం:గజం మిథ్య.. పలాయనం మిథ్య!


Next Story

Most Viewed