యుద్దాల స్వభావం మారుతోంది : కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

by I. Sairam |

ప్రస్తుతం యుద్దాల స్వభావం మారుతోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

యుద్దాల స్వభావం మారుతోంది : కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో : యుద్ధాల స్వభావం వేగంగా మారుతోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భవిష్యత్తులో యుద్ధాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో జరగవచ్చని, కానీ ఆ పోరులో విజయాన్ని సాధించేది మాత్రం జాతీయ సంకల్పం, సమర్థులైన జవాన్లు, తిరుగులేని మన సైనిక శక్తి మాత్రమే అని ధీమా వ్యక్తం చేశారు. మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అత్యాధునిక యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ మహేంద్రగిరి’ సేవలను శనివారం విశాఖపట్నంలో ఆయన ప్రారంభించారు. దీంతో ఆ యుద్ధ నౌక అధికారికంగా ఇండియన్ నేవీలోకి చేరింది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. డ్రోన్లు, ఏఐ, సైబర్ వార్‌ఫేర్, హైపర్సోనిక్ ఆయుధాలు, మానవరహిత వ్యవస్థల వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలు యుద్ధం విధానాన్ని మార్చినప్పటికీ, అవి సంప్రదాయ యుద్ధ మార్గాల పాత్రను ఏమాత్రం తగ్గించలేదని అన్నారు. కొత్త టెక్నాలజీ, సంప్రదాయ రక్షణ వ్యవస్థలు ఒకదానికొకటి వ్యతిరేకం కావని, అవి ఒకదానికొకటి తోడుగా నిలుస్తాయని అన్నారు.

వైమానిక తయారీ కేంద్రంగా ఏపీ

భారతదేశపు సరికొత్త రక్షణ, వైమానిక తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అలాగే సూరత్ డైమండ్ సిటీగా, బెంగళూరు సిలికాన్ వ్యాలీగా ఎలా ప్రసిద్ధి చెందాయో, కర్నూలు కూడా భారత ‘డ్రోన్ హబ్’గా ఎదగడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి సుమారు 6,670 టన్నుల పూర్తి లోడ్‌ను మోసుకెళ్లగల సామర్థ్యం ఉందని, ఇది గరిష్టంగా 28 నాట్ల (గంటకు 52 కిలోమీటర్లు) వరకు వేగాన్నిఅందుకోగలదని తెలిపారు. మల్టీ మిషన్ స్టెల్త్ ఫ్రిగేట్‌గా శత్రువుల వైమానిక ముప్పులను, నౌకలను, సబ్‌ మెరైన్‌లను ఒకేసారి ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పారు.

Next Story