- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులు, ప్రజల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో మిషన్ మోడ్‌లో పనిచేయాలని, రైతులు, ప్రజల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి అధికారులను ఆదేశించారు.

దిశ, ఉట్నూర్ : ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో మిషన్ మోడ్‌లో పనిచేయాలని, రైతులు, ప్రజల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన ఎల్-నినో సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ప్రత్యేక అధికారికి జిల్లా కలెక్టర్లు, అధికారులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావాన్ని వ్యవసాయ రంగానికే పరిమితం చేయకుండా తాగునీరు, సాగునీరు, విద్యుత్, పశుసంవర్థక, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, ఉద్యానవనం, భూగర్భ జలాలు, ఇరిగేషన్ తదితర అన్ని రంగాలపై ప్రభావం చూపే పరిస్థితిగా భావించి శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామ గ్రామాన రైతులకు వర్షాభావ పరిస్థితులు, నీటి వినియోగం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్తృత అవగాహన కల్పించాలని, కందులు, పెసర్లు, నువ్వులు, వేరుశనగ, చిరుధాన్యాలు, ఉద్యాన పంటలను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లాల వారీగా జలాశయాల నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితి, తాగునీటి లభ్యత, సాగునీటి పరిస్థితులు, విద్యుత్ సరఫరా, పంటల స్థితిగతులను సమీక్షించారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, ప్రజల్లో నీటి పొదుపుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రస్తుత అంచనాల ప్రకారం 40–45 శాతం వరకు వర్షపాత లోటు నమోదయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రైతులు, ప్రజలను కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని శాఖల సిబ్బంది సమష్టిగా పనిచేస్తే ఎల్-నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలమని ప్రత్యేక అధికారి అన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లు రాజర్షి షా, భవేష్ మిశ్రా హరిత మాట్లాడుతూ, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలను చేరవేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలని, అత్యవసర పరిస్థితులకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, తాగునీరు, సాగునీటి సమస్యల పరిష్కారానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కడెం ప్రాజెక్టు నీటి నిల్వలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పైప్‌లైన్ లీకేజీలను వెంటనే మరమ్మతు చేసి నీటి వృథాను నివారించాలని సూచించారు.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేస్తోందని, పత్తి సాగు దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులు కందులు, పెసర్లు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. నీటి నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపడతామని తెలిపారు. అనంతరం వివిధ శాఖల అధికారులు తమ శాఖల యాక్షన్ ప్లాన్‌లు, కంటింజెన్సీ ప్రణాళికలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఎల్నినో బుక్‌లెట్, తెలంగాణ జలసిరి పోస్టర్లను ప్రత్యేక అధికారి, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీఓ మంద మకరంద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, ఆర్.ఎస్. చిత్రు, బి. వెంకటేశ్వర్లు, పి. చంద్రయ్య, యువరాజ్ మర్మట్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, క్యాతనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ సంధ్యారాణి, చెన్నూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ పి. పద్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.






