ఉన్నది ఉన్నట్టు: దేశంలో ఫెయిర్ ఎలక్షన్స్ సాధ్యమేనా?

by Viswanth |
ఉన్నది ఉన్నట్టు: దేశంలో ఫెయిర్ ఎలక్షన్స్ సాధ్యమేనా?
X

ఇకపైన ఎన్నికలలో వందల కోట్ల ఆస్తులు ఉన్నవారు మాత్రమే పోటీ చేయగలరేమో! కోటీశ్వరుల కొట్లాటలో అందినకాడికి తీసుకోవడం ఓటర్లకు అలవాటైపోయింది. ఐదేళ్ల తలరాత, ప్రజాస్వామ్య స్ఫూర్తి.. ఇవన్నీ ఉత్త ముచ్చట్లే. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, డెమోక్రసీ అనే ఈ ప్రహసనంలో అందరూ అవినీతిపరులే. ఓటుకు నోటు పంచే, రేటు కట్టే పార్టీల మొదలు డిమాండ్ చేసి మరీ తీసుకునే ఓటరు వరకు. ఇప్పుడు జరగాల్సింది ఎన్నికల ప్రక్షాళన. ఏ పార్టీ ఎలాంటిదో ప్రజలకు తెలియందేమీ కాదు. ప్రచార లొల్లి, పథకాల సొల్లు లేకుండా నచ్చిన పార్టీకి, వ్యక్తికి ఓటు వేసే స్వేచ్ఛ ఇస్తే ప్రజలు ఎవరి పక్షం ఉన్నారో తేలిపోతుంది. అభ్యర్థుల వ్యక్తిగత, ఆస్తుల, నేరాల వివరాలను విస్తృతంగా జనాలలోకి తీసుకెళ్లే బాధ్యత కమిషన్ తీసుకుంటే నిర్ణయాన్ని ఓటర్లు వెలువరిస్తారు.

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రహసనం ముగిసిపోయింది. 'ఏం చేసి బతికి బట్టకట్టామో' అన్నది గెలిచిన పార్టీకి తెలుసు. 'ఏం చేయకపోవడంతో సీన్ రివర్స్ అయిందన్నది' ఓడిన పార్టీకి తెలుసు. 'ఏ పార్టీకి ఎందుకు ఓటు వేశామన్నది' ప్రజలకు తెలుసు. గొప్పగా చెప్పుకునే ప్రజాస్వామ్యం 'తిలా పాపం తలా పిడికెడు' తరహాలో అపహస్యం పాలైంది. నడిరోడ్డు మీద బహిరంగంగా ఓటుకు రేటు కడుతున్నా ఎలక్షన్ కమిషన్ తనకేమీ తెలియదన్న తీరులో ప్రేక్షకు పాత్రకు పరిమితమైంది. ఎన్నికల నిర్వహణలో ప్రక్షాళన జరగడం తక్షణావసరంగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక ప్రజాస్వామ్య ప్రక్రియకు అనేక సవాళ్లను విసిరింది. డబ్బులు పంచిపెట్టడం పార్టీల విధానంగానూ, ఓటు వేయాలంటే తీసుకోవడం ఓటర్ల డిమాండ్‌గానూ తెరపైకి వచ్చింది. ఎంత ఎక్కువ ఖర్చు పెడితే విజయం అంత ఖాయం అనేది ఈ ఉప ఎన్నిక నేర్పిన పాఠం.

ఇంతకాలం రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నిక హుజూరాబాద్ అని అనుకున్నాం. కానీ, ఇప్పుడు దాన్ని వెనక్కు నెట్టేసింది మునుగోడు. ఒక పార్టీ ఒక్కో ఓటుకు ఐదు వేలు ఇస్తే మరో పార్టీ మూడు వేలు, నాలుగు వేలు మాత్రమే ఇచ్చిందని ఓటర్లు ఓపెన్‌‌గానే చెప్పారు. దీనికి తగినట్లుగానే గెలిచిన, ఓడిన పార్టీల ప్రముఖులు చేసిన కామెంట్లు కీలకం. 'వంద కోట్లు ఖర్చు పెట్టినా బీజేపీ గెలవలేకపోయిందంటూ' మంత్రిగా బాధ్యతాయుత స్థానంలో ఉన్న కేటీఆర్ కామెంట్ చేశారు. 'వంద కోట్ల అవినీతి సొమ్మును ఖర్చు పెట్టి, అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలిచిందని' బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ఇద్దరూ వంద కోట్లు ఖర్చు పెట్టినట్లు వారి మాటలలోనే వ్యక్తమైంది. ఎన్నికల సంఘం మాత్రం తనకేమీ వినపడడం లేదనే తీరులో సైలెంట్‌గా ఉండిపోయింది.

నిబంధనలన్నీ హుష్ కాకి

ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి మాగ్జిమమ్ సీలింగ్ రూ. 40 లక్షలే అయినప్పుడు వంద కోట్లు ఖర్చు చేశాయనే కామెంట్లు ఎందుకొస్తున్నాయి? వారిపై ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? తనిఖీలలో కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. ఇక దొడ్డిదారిన తరలిపోయిందెంతో? ఓటర్లను ప్రలోభపెట్టడం ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన అని నిబంధనగా రాసుకున్నా అది బేఖాతర్ అయింది. ఎలక్షన్ కమిషన్ తరఫున ఎంత మంది అబ్జర్వర్లు ఉన్నా జరగాల్సింది జరిగిపోయింది. 'నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు' అన్న తరహాలో అటు పార్టీలు, ఇటు ఎలక్షన్ కమిషన్ వ్యవహరించాయి. నెలవారీ సగటు మద్యం విక్రయాలు ఉప ఎన్నిక కారణంగా రెట్టింపు దాటాయి.కోళ్లు, మేకలు ఇతర జిల్లాల నుంచి దిగుమతి కావాల్సి వచ్చింది. అంటే, ఏ స్థాయిలో ఓటర్లకు వీటిని పార్టీలు ఆఫర్ చేశాయో అర్థం చేసుకోవచ్చు.

ఇవి ప్రలోభాల కిందికి రావా? మేం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మా పార్టీ మీద ఉన్న నమ్మకం, అభిమానమే గెలిపించిందంటూ అధికార పార్టీ గొప్పగా చెప్పుకోవచ్చు. అదే నిజమైతే మద్యం, మాంసం, ఓటుకు రేటు ఇవన్నీ ఎందుకు జరిగినట్లు? ప్రత్యర్థి పార్టీ మూడు వేలు ఇచ్చిందని ప్రజలే చెప్తున్నారు. ఇక ధర్మయుద్ధం అనే మాటకు అర్థమేముంది? రెండు పార్టీలూ ఓటర్లకు నోట్లు కుమ్మరించాయనేది బహిరంగ రహస్యం. సాక్ష్యాలూ, ఆధారాలకు దొరకని నగ్న సత్యం. ఈ రెండూ కాక మరో పార్టీ దాని ఆర్థిక స్థాయికి తగినట్లుగా తక్కువ మొత్తంలో పంచి పెట్టింది. ఇవ్వడం అనివార్యం.. తీసుకోవడం ధర్మం.. అనేది మునుగోడు ఉప ఎన్నిక రుజువు చేసిన సత్యం. డబ్బులు ఇవ్వకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామంటూ కొన్ని గ్రామాల ప్రజలు డిమాండ్ చేయడం కొసమెరుపు.

Also read: ఉన్నది ఉన్నట్టు: మారుతున్న డెమోక్రసీ మీనింగ్! ఇప్పుడిదే నయా ట్రెండ్

ఫ్రీ అండ్ ఫెయిర్, ఓ ట్రాష్

ప్రశాంత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ తమ విధానమంటూ ఎలక్షన్ కమిషన్ వినిపించే నినాదం. నిజమే, గతంలో జరిగినట్లు రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్ లాంటి హింస జరగలేదు. రీ పోలింగ్ అవసరం లేకుండా వ్యవహరించడంలో కమిషన్ సక్సెస్ అయింది. కానీ, ఫెయిర్ ఎన్నికల విషయంలో మాత్రం పిల్లి కళ్లు మూసుకున్న చందంగా ఉండిపోయింది. కోడ్ ఉల్లంఘన జరుగుతున్నా పట్టించుకోలేదు. అధికార దుర్వినియోగం జరుగుతున్నా సైలెంట్‌గా ఉండి పరోక్షంగా సహకరించింది. రాజ్యాంగబద్ధత కలిగిన సంస్థ, స్వతంత్ర వ్యవస్థ అని కమిషన్ గొప్పగా చెప్పుకుంటుంది. కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీ పంజరంలో చిలుకగా మార్చిందంటూ విపక్ష పార్టీలు విమర్శిస్తుంటాయి. అన్ని అధికారాలూ ఉన్నా వినియోగించుకోలేని నిస్సహాయత కమిషన్‌ది. కంటికి కనిపించని రాజకీయ ఒత్తిడి దాన్ని నడిపిస్తున్నది.

ఎన్నికల షెడ్యూలు విడుదల మొదలు ఫలితం వరకు అధికార పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నది. గతంలో పలుమార్లు విమర్శలపాలైంది. ఇప్పటికీ తీరు మారలేదు. ఆ విమర్శలే వస్తున్నాయి. ఇలాంటి ఒత్తిడుల నడుమ ఫెయిర్ ఎలక్షన్స్ సాధ్యమే కాదు. ఒకచోట ఎన్నిక జరుగుతూ ఉంటే అక్కడి ప్రభుత్వ సిబ్బందిని, పోలీసు యంత్రాంగంగానే కమిషన్ వినియోగిస్తున్నది. కేంద్ర బలగాలను పంపినా జిల్లా పోలీసు వ్యవస్థ ఆదేశాల మేరకే పనిచేయాల్సి వస్తున్నది. సహజంగానే రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది అక్కడి అధికార పార్టీకి లాయల్‌గా ఉంటారు. వారు ఆ పార్టీ గెలుపు కోసమే కృతజ్ఞతా భావంతో పని చేస్తారు. ప్రమోషన్ వస్తుందని ఆశిస్తారు. లేకుంటే యాక్షన్ తప్పదనే భయంతో ఉంటారు. ఇలాంటప్పుడు నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యం?

Also read: ఉన్నది ఉన్నట్టు: ఈసీ సాక్షిగా నోటు దూకుడు

సొంత సిబ్బంది కావాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సిబ్బంది సహకారం లేకుండా మరో రాష్ట్రం నుంచి పోలింగ్ డ్యూటీలకు సిబ్బందిని నియమించుకోవడమే దీనికి పరిష్కారం. భాషాపరమైన సమస్యలను అధిగమించడానికి నిర్దిష్ట మెకానిజం ఏర్పాటు చేసుకోవాలి. జనరల్ అబ్జర్వర్ల మొదలు మైక్రో అబ్జర్వర్ల వరకు ఎంత మందిని నియమించుకున్నా మునుగోడు లాంటి ఎన్నికలలో ఫలితమేముంది? కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటే వీరు ఏం చేస్తున్నారు? కమిషన్ మెకానిజమంతా మొక్కుబడి ప్రహసనం మాత్రమే. ఫలితాన్ని నిర్ణయించేది డబ్బు మాత్రమేననేది స్పష్టమైంది. ఎక్కువ ఇచ్చిన పార్టీ గెలుస్తుంది. తక్కువ ఇస్తే ఓడిపోతుంది. ఇది ఒక జనరల్ ఫినామినాగా మారిపోయింది. పార్టీలూ దీన్నే నమ్ముతున్నాయి. ఓటర్లూ ఫిక్స్ అయిపోయారు. ఇక ఎన్నికల ప్రచారమెందుకు? సంక్షేమ పథకాలు అంటూ ఏకరువు పెట్టేదెందుకు? ర్యాలీలు, రోడ్‌షోలు, ప్రచార రథాలు, మైకుల హోరు.. ఇవన్నీ దండగ. ప్రచారమే చేయకుండా ప్రతీ ఓటరుకు ఇంత.. అంటూ కవర్‌లో పెట్టి డోర్ డెలివరీ చేస్తే సరిపోదా అనే సెటైర్లు వినిపిస్తున్నాయి.

గెలిచే అభ్యర్థి నిజాయితీ, సింప్లిసిటీ, ప్రజలకు అందుబాటులో ఉండడం.. ఇవన్నీ ఒకప్పటి స్టాండర్డ్స్. కానీ ఇప్పుడు పనికిరాని మాటలైపోయాయి. ఇప్పటి ట్రెండే వేరు.. ఎన్నికలొచ్చాయా.. చేతి ఖర్చుకు డబ్బులు వస్తాయా.. నాలుగు రోజులు ఎంజాయ్ చేశామా.. ఇదే ఓటర్లలో ఫిక్స్ అయింది. మునుగోడులో గెలుపుకోసం ఒక్కో ఓటరుకు ఇచ్చినట్లుగానే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థాయిలో పార్టీలు ఖర్చు చేస్తాయా? ఒకవేళ పార్టీలు ఇంత ఇవ్వకుంటే ఓటర్లు ఊరుకుంటారా? మేం మునుగోడు ఓటర్లకంటే తక్కువా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయేమో! ఇకపైన ఎన్నికల్లో వందల కోట్ల ఆస్తులు ఉన్నవారు మాత్రమే పోటీ చేయగలరేమో! కోటీశ్వరుల కొట్లాటలో అందినకాడికి తీసుకోవడం ఓటర్లకు అలవాటైపోయింది. ఐదేళ్ళ తలరాత, ప్రజాస్వామ్య స్ఫూర్తి.. ఇవన్నీ ఉత్త ముచ్చట్లే.

చివరగా

ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, డెమోక్రసీ అనే ఈ ప్రహసనంలో అందరూ అవినీతిపరులే. ఓటుకు నోటు పంచే, రేటు కట్టే పార్టీల మొదలు డిమాండ్ చేసి మరీ తీసుకునే ఓటరు వరకు. ఇప్పుడు జరగాల్సింది ఎన్నికల ప్రక్షాళన. ఏ పార్టీ ఎలాంటిదో ప్రజలకు తెలియందేమీ కాదు. ప్రచార లొల్లి, పథకాల సొల్లు లేకుండా నచ్చిన పార్టీకి, వ్యక్తికి ఓటు వేసే స్వేచ్ఛ ఇస్తే ప్రజలు ఎవరి పక్షం ఉన్నారో తేలిపోతుంది. అభ్యర్థుల వ్యక్తిగత, ఆస్తుల, నేరాల వివరాలను విస్తృతంగా జనాలలోకి తీసుకెళ్లే బాధ్యత కమిషన్ తీసుకుంటే నిర్ణయాన్ని ఓటర్లు వెలువరిస్తారు.


ఎన్. విశ్వనాథ్

99714 82403


Next Story

Most Viewed