ఉన్నది ఉన్నట్టు: ఈసీ సాక్షిగా నోటు దూకుడు

by Viswanth |
ఉన్నది ఉన్నట్టు: ఈసీ సాక్షిగా నోటు దూకుడు
X

పార్టీల అనైతిక చర్యలతో ఓటర్లలోనూ నోటు తీసుకోవడం తప్పేమీ కాదనే భావన ఏర్పడింది. చివరకు అది డిమాండ్ చేసే పరిస్థితికి దారితీసింది. నోట్ల ప్రవాహం ఉంటుందనే ఉద్దేశంతోనే ఎలక్షన్ కమిషన్ సైతం చెక్‌పోస్టులు, వాహనాల తనిఖీలు, ఫ్లయింగ్ స్క్వాడ్ లాంటి నిర్ణయాలు తీసుకున్నది. ఇవేవీ అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. ఉప ఎన్నికల ఖర్చులో ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికలో జరిగిన ఖర్చును చూసి మేధావులు దిగ్భ్రాంతికి గురయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక దాన్ని కొన్ని పదుల రెట్లు మించిపోయింది. ఓటు ధర పది వేల దాకా పలికింది. గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లకు కవర్లలో చేరిపోయింది. నాగార్జునసాగర్ బైపోల్ సైతం ఇదే తీరులో నడిచింది. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక వాటన్నింటి స్థాయిని దాటి పోయింది.

వరూ చూడటం లేదనుకుంటూ పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగిందట' ఈ నానుడి మనకు నిత్య జీవితంలో అనేక సందర్భాలలో ఎదురవుతుంది. ఇప్పుడు మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ ఇది గుర్తుకొస్తున్నది. అక్రమాలను నియంత్రించాల్సిన ఎలక్షన్ కమిషన్ ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. ఎన్ని సంస్కరణలు తెచ్చినా, ఎన్ని ఆంక్షలు విధించినా బేఖాతర్. నిబంధనల ఉల్లంఘన కళ్ల ముందు కనిపిస్తున్నా చూసీ చూడనట్లుగా పోతున్నది. పటిష్ట యంత్రాంగం ఉన్నా నిష్ఫలంగా మారింది. రాజకీయ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు, పార్టీల ఉద్దేశపూర్వక చేష్టలు కమిషన్‌కు కనిపించడంలేదు. స్వతంత్ర వ్యవస్థగా స్పష్టమైన అధికారం ఉన్నా చర్యలు శూన్యం.

మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన రాజకీయ పార్టీలు 'నువ్వా నేనా' అన్నట్టుగా పోటీపడుతున్నాయి. గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నాయి. 'తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచిందన్న' చందంగా రాజకీయ పార్టీలు ప్రజలను, ఓటర్లను చెడగొట్టాయి. ఉప ఎన్నికల ప్రక్రియ ఒక ఉపాధి హామీ పథకంగా మారిపోయింది. 'ఎంత ఇస్తావ్? ఎంత కావాలి?' అన్నది కామన్ అయిపోయింది. రాజకీయ పార్టీలు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాయి. అనైతిక చర్యలకు పాల్పడుతున్నాయి. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా కమిషన్ యంత్రాంగం మాత్రం 'నిమ్మకు నీరెత్తినట్లుగానే' ఉన్నది. 'సబ్ ఠీక్ హై' అని సరిపెట్టుకుంటున్నది.

రోజుకు కోటి ఖర్చు

గెలుపు కోసం ఒక్కో పార్టీ ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. నియోజకవర్గాన్ని యూనిట్లుగా విభజించుకున్నాయి. ఒక్కో యూనిట్‌కు ఒక ప్రజా ప్రతినిధిని బాధ్యుడిగా నియమించాయి. ప్రస్తుతం 84 యూనిట్లకు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇన్‌చార్జులుగా ఉన్నారు. అన్ని జిల్లాలకు చెందిన నేతలు మునుగోడులో మోహరించారు. వెంట మందీ మార్బలాన్నీ కూడా తెచ్చుకున్నారు. వారికయ్యే తిండి, బస, రోజువారీ ఖర్చులను ఇన్‌చార్జీలు స్వంతంగానే పెట్టుకుంటున్నారు. ఒక్కొక్కరు సగటున 150 మందిని స్వంత నియోజకవర్గాల నుంచి తెప్పించుకుని ప్రచారం చేస్తున్నారు. రోజువారీ ఖర్చు లక్షలలోనే.

ఆత్మీయ సమ్మేళనాల పేరుతో లక్షల రూపాయలు వెదజల్లుతున్నారు. ఓటర్లకు గిఫ్టులు, సరదాల కోసం నజరానాల పేరుతో అదనంగా ఖర్చు చేస్తున్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలు, వీటికి అవసరమైన జనసమీకరణ కోసం చెల్లించే రోజు కూలీ సరేసరి. యూత్‌కు బైక్‌లు, కార్లకు పెట్రోలు, డీజిల్ ఖర్చు, రాత్రిపూట మద్యం. ఇవన్నీ అడిషనల్. ఎంతలేదన్నా కనీసంగా ఒక్కక్క ఇన్‌చార్జి ప్రతిరోజూ నాలుగైదు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒక్క పార్టీ తరఫున రోజుకు రెండు కోట్లకు పైగా ఖర్చవుతున్నది. నెల రోజుల వ్యవధిలో ఒక్క పార్టీ చేసే ఖర్చు కోట్లలోనే.

Also read: ఎన్నికల ముందే 'బంధు'లా! ఇవి కొనసాగేనా?

ఏదీ లెక్కలోకి రాదు

ఇక పోలింగ్ సమయానికి ఓటుకు నోటు రూపంలో చేసే ఖర్చు అంచనాకు కూడా అందదు. ఇదంతా పార్టీ అభ్యర్థి కోసం చేస్తున్న ఖర్చే అయినా ఆయన లెక్కలోకి వెళ్ళదు. పార్టీ లెక్కలోకీ రాదు. ఎప్పటికీ లెక్కలోకి రాని వ్యవహారంగానే మిగిలిపోతుంది. ఎలక్షన్ కమిషన్ రూపొందించిన నిబంధనల ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థి చేసే ఖర్చు సీలింగ్ రూ. 28 లక్షలు మాత్రమే. కానీ, రోజుకు రెండు కోట్లకు పైగా ఖర్చవుతున్నా ఇది ఎవరికీ చెందనిదిగానే మిగిలిపోతున్నది. ఎలక్షన్ కమిషన్ తరఫున ఎంత మంది అబ్జర్వర్లు ఉన్నా, పకడ్బందీ యంత్రాంగం ఉన్నా వృథా ప్రయాసగానే మారింది.

అన్ని పార్టీల లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఒక ఉప ఎన్నిక ఖర్చు ఏ స్థాయిలో ఉంటుందో బేరీజు వేసుకోవచ్చు. వినాయక చవితి పండుగ సందర్భంగా గణేశ్ మండపాల కోసం అభ్యర్థులు లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. దసరా పండుగ సరదాలకూ ఖర్చు చేశారు. త్వరలో దీపావళి టపాసులకూ ఇస్తారనే ఆశ ఓటర్లలో కనిపిస్తున్నది. అభ్యర్థుల ఆర్థిక స్థోమతలో తేడా ఉండొచ్చు. మరో పార్టీతో ఖర్చు విషయంలో పోటీ పడలేకపోవచ్చు. ఇలాంటి ఉల్లంఘనలలో అన్ని ప్రధాన పార్టీలదీ అదే దారి.

ప్రసంగాలపైనా నో యాక్షన్

'డబ్బులిస్తే తీసుకోండి. కానీ, ఓటు మాకే వేయండి' అని కామెంట్లు వచ్చినా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోదు. ఓటర్లకు తాయిలాలు ప్రకటించినా సైలెంటే. కులం, మతం ప్రస్తావన తెచ్చినా, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, విద్వేషపు కామెంట్లు చేసినా ప్రేక్షకపాత్రే. ఓటుకు నోటు ఇవ్వడం, తీసుకోవడం చాలా కామన్ అనే మెసేజ్ జనంలోకి వెళ్లి పోయింది. పార్టీల అనైతిక చర్యలతో ఓటర్లలోనూ నోటు తీసుకోవడం తప్పేమీ కాదనే భావన ఏర్పడింది. చివరకు అది డిమాండ్ చేసే పరిస్థితికి దారితీసింది. నోట్ల ప్రవాహం ఉంటుందనే ఉద్దేశంతోనే ఎలక్షన్ కమిషన్ సైతం చెక్‌పోస్టులు, వాహనాల తనిఖీలు, ఫ్లయింగ్ స్క్వాడ్ లాంటి నిర్ణయాలు తీసుకున్నది. ఇవేవీ అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి.

ఉప ఎన్నికల ఖర్చులో ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికలో జరిగిన ఖర్చును చూసి మేధావులు దిగ్భ్రాంతికి గురయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక దాన్ని కొన్ని పదుల రెట్లు మించిపోయింది. ఓటు ధర పది వేల దాకా పలికింది. గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లకు కవర్లలో చేరిపోయింది. నాగార్జునసాగర్ బైపోల్ సైతం ఇదే తీరులో నడిచింది. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక వాటన్నింటి స్థాయిని దాటి పోయింది. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా రికార్డు సృష్టిస్తున్నది. బహుశా దేశంలోనే మోస్ట్ కాస్ట్‌లీ ఎలక్షన్‌ అవుతుందేమో!

Also read: ఉన్నది ఉన్నట్టు: అక్కడ డబ్బులు ఊరికే ఎందుకు వస్తున్నాయి?

అంతా తూచ్

పేరుకే అభ్యర్థి ఖర్చుపై సీలింగ్. ఆచరణలో అంతా తూచ్. టీ, టిఫిన్, మీల్స్, వాటర్ బాటిల్, కరపత్రం, వాల్ పోస్టర్, ఫ్లెక్సీ, పబ్లిక్ మీటింగ్, టెంట్ ఇలా అన్నింటికీ ఎంతెంత అవుతుందో కమిషన్ లెక్కలు వేసి చార్ట్ రూపొందించింది. ప్రాక్టికల్‌గా ఇవేవీ వర్కవుట్ అయ్యేవి కావు. 'నేను కొట్టినట్లు చేస్తా.. నువ్వు ఏడ్చినట్లు చేయ్' తరహాలో పోలింగ్ తర్వాత అభ్యర్థులు లెక్కలు సమర్పించడం, వాటికి కమిషన్ ఆమోద ముద్ర వేయడం ఒక ప్రహసనం మాత్రమే. చట్టాలు రూపొందించిన నేతలే వాటిని ఉల్లంఘిస్తున్నారు. కంచే చేను మేస్తుంటే ఇక ఎన్ని రూల్స్ పెట్టుకుంటే మాత్రం ఏ ప్రయోజనం? దీనికి ముగింపు ఎన్నడు? కట్టడి చేసేదెవరు?

ఇవి కూడా చదవండి : నగదు బదిలీపై టీఆర్ఎస్ పక్కా స్కెచ్...


ఎన్. విశ్వనాథ్

99714 82403

Next Story