నగదు బదిలీపై టీఆర్ఎస్ పక్కా స్కెచ్...

by Dishanational1 |
నగదు బదిలీపై టీఆర్ఎస్ పక్కా స్కెచ్...
X

దిశ, తెలంగాణ బ్యూరో: యాదవ సోదరులు నాకో మెసేజ్ పంపారు... రెండో విడత గొర్రెల పంపిణీకి బ్యాంకుల్లో డబ్బులు పడ్డాయి.. కానీ ఎందుకో ప్రీజింగ్ పెట్టారు. వాపస్ పోతాయని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. వాళ్లు లంగలు నమ్మకుర్రి.. వాళ్లకు ఇచ్చే ముఖం లేదు... ఇచ్చే తెలివి లేదు... ఎవరికన్న పైసలు ఇచ్చి వాపస్ తీసుకుంటుందా ప్రభుత్వం. ఎందుకు ఇచ్చి ప్రిజ్ పెట్టామంటే ఒకటే కారణం... మీరు వెటర్నరీ డాక్టర్ దగ్గరకు పోయి... గొర్లు కొనుక్కోవాలి లేకపోతే ఎలక్షన్ వచ్చిందని ఆయింతా దావతులు చేసుకుంటాపోతే డబ్బులు అయిపోతాయని ప్రీజ్ చేశాం తప్ప.. మీకు పైసలు ఇచ్చి వాపస్ తీసుకునేంత సంస్కారం లేని ప్రభుత్వం కాదు.. బారాబర్ మా యాదవ సోదరులందరికీ ఇస్తాం. వేరే ఉద్దేశం లేదు.

-ఈ నెల 13న కూసుకుంట్ల నామినేషన్ సందర్భంగా మంత్రి కేటీఆర్

గొర్రెల యూనిట్లకు బదులు నేరుగా లబ్దిదారుల ఖాతాలో ప్రభుత్వం నగదు జమ చేస్తే బీజేపీ నేతలు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేసి అడ్డుకున్నారు. బీజేపీ నేతలు చేసిన ఫిర్యాదు తోనే ఎన్నికల సంఘం కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని ఆదేశించింది. లబ్ధిదారులు అదైర్యపడొద్దని, ప్రభుత్వం ఎన్నికలు ముగిసిన తర్వాత యథావిథిగా కొనసాగిస్తుంది. బీజేపీ నేతలు కేవలం ఎన్నికలు ముగిసేవరకు మాత్రమే అడ్డుకోగలరని, ఆ తర్వాత ఏం చేయలేరు.

-తెలంగాణ భవన్ లో బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమంత్రులే. అంతే కాదు ఇక మంత్రి యాదవ సంఘానికి ప్రతినిధి కూడా. వారిద్దరూ గొల్లకురుమలకు గొర్రెల యూనిట్ల నగదు బదిలీపై వేరువేరు వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ప్రభుత్వంలో లబ్దిదారుల ఖాతాల్లో నగదును జమ చేసిందా? చేస్తే ఎన్నికల సమయంలో ఏదో ఒక రాజకీయ పార్టీ అడ్డుకుంటుందని ముందే తెలుసే జమ చేసిందా అనేది సగటు వ్యక్తిలో మెదలాడుతున్న ప్రశ్న. యాదవుల అకౌంట్లలో నగదు జమ చేస్తే బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతోనే నిలిపి వేసిందని తలసాని పేర్కొనగా, ఎన్నికల సమయంలో ఆ డబ్బును వృథా చేస్తామనే అకౌంటర్ ప్రీజ్ చేశామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇద్దరు వ్యాఖ్యలతో గొల్లకురుమలు డైలమాలో పడ్డారు.

బైపోల్ వేళ గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ కాకుండా నగదు బదిలీ చేసింది. అది సాధ్యం కాదని తెలుసు. అయినా ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం మునుగోడు నియోజకవర్గ పరిధిలోని గొల్లకుర్మలకు వారి అకౌంట్లలో డబ్బులు వేసింది. ఎన్నికల సమయంలో ఇది ఎన్నికల నిబంధన ఉల్లంఘననే తెలుసు. అయితే దీనిని ఖచ్చితంగా బీజేపీ అడ్డుకుంటుందని భావించినట్లే జరిగింది. బీజేపీ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కలిసి ఉప ఎన్నికల్లో గొల్లకురుమల ఓట్లను లబ్దిపొందేందుకే నగదు బదిలీ అని పేర్కొనడంతో ఈసీ స్పందించింది. లబ్దిదారులు డబ్బు తీసుకోకుండా అకౌంట్లను ప్రీజ్ చేయాలని ప్రభుత్వానికి బుధవారం ఆదేశాలు ఇచ్చింది. ఇదే అదునుగా భావించిన టీఆర్ఎస్ బైపోల్ లో ఎన్నికల అస్త్రంగా చేసుకుంది. బీజేపీ ఫిర్యాదుతోనే లబ్దిదారుల అకౌంట్లు ప్రీజ్ అయ్యాయని ప్రచారం ముమ్మరం చేసింది. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం పైసా సాయం చేయదు... రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంటే అడ్డుకుంటుందని విమర్శలు చేస్తున్నారు. యాదవుల ఓట్లు సుమారు 33వేల వరకు ఉండటంతో ఆ ఓట్లపై ఫోకస్ పెట్టిన టీఆర్ఎస్ ... అకౌంట్ల ప్రీజ్ అంశంతోనే ముందుకెళ్లేలాల ప్రణాళికలు సిద్ధం చేసి వారి వద్దకు వెళ్తోంది. వివరించే ప్లాన్ ను ముమ్మరం చేయడంతో యాదవ కమ్యూనిటీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతిధులు, నేతలతో సమావేశాలు నిర్వహించి వివరిస్తున్నారు. అయితే వారు ఏ విధంగా స్వీకరిస్తారో చూడాలి.

రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంను గొర్రెల పథకం కింద నగదు బదిలీ చేసేందుకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. నియోజకవర్గంలోని 5765 మంది లబ్దిదారులకు లక్షా 58 వేల చొప్పున నగదును అకౌంట్లలో 93.78 కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు పశుసంవర్థక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే అకౌంట్లు మాత్రం ప్రీజ్ అయ్యాయి. ప్రభుత్వ ఆదేశాలతోనే అకౌంట్లను ప్రిజ్ అయ్యాయని స్వయంగా మంత్రి కేటీఆర్ పేర్కొనడం గమనార్హం. ఎన్నికల సమయంలో డబ్బు వృథాకాకుండా ఉండేందుకే ప్రిజ్ చేశామని తెలిపారు.

ఇద్దరు మంత్రులు... వేర్వేరు వ్యాఖ్యలు...

మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఇద్దరు గొల్లకురుమల అకౌంట్లకు సంబంధించిన ప్రీజ్ పై మాట్లాడారు. ఇద్దరు కేబినెట్ మంత్రులే. అయితే ఒకరు ప్రభుత్వం ప్రీజ్ చేసిందని.. ఎన్నికల సమయంలో ఖర్చు అవుతాయనే ప్రీజ్ చేశామని కేటీఆర్ మునుగోడులో నిర్వహించిన సభలోనే వ్యాఖ్యానించారు. తాజాగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాత్రం బీజేపీ నేతలు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడంతోనే అకౌంట్లు ప్రీజ్ అయ్యాయని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇద్దరు పొంతలేని వ్యాఖ్యలు చేయడంతో యాదవులు సైతం డైలమాలో పడ్డారు. ఇంతకు ప్రభుత్వం డబ్బులు నిజంగానే వేసిందా? లేకుంటే మునుగోడు బైపోల్ లో ఓట్ల కోసం అకౌంట్ ప్రీజ్ అనే అంశాన్ని తెరమీదకు తెచ్చిందా? అనే సందిగ్ధంలో పడ్డారు. ప్రభుత్వ వ్యాఖ్యలను ఎలా నమ్మాలో తెలియక సతమతమవుతున్నట్లు ఓ యాదవ సంఘం నేత పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి : ఓటింగ్ తక్కువ నమోదైతే టికెట్ క్యాన్సిలా..? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మునుగోడు ఫీవర్

Next Story

Most Viewed