థియేటర్ లోపల ఊపిరాడక బిత్తరపోయిన ఫ్యాన్స్.. ‘పెద్ది’ షోలో ఏం జరిగిందంటే?

by Jakkula.Mamatha |

దేవరకొండ పట్టణంలో ప్రముఖ నిర్మాణ సంస్థ 'మైత్రి'కి చెందిన వెంకటేశ్వర థియేటర్ యాజమాన్యంపై ప్రేక్షకులు, సినీ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

థియేటర్ లోపల ఊపిరాడక బిత్తరపోయిన ఫ్యాన్స్.. ‘పెద్ది’ షోలో ఏం జరిగిందంటే?
X

దిశ, దేవరకొండ/కొండమల్లేపల్లి: దేవరకొండ పట్టణంలో ప్రముఖ నిర్మాణ సంస్థ 'మైత్రి'కి చెందిన వెంకటేశ్వర థియేటర్ యాజమాన్యంపై ప్రేక్షకులు, సినీ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సరికొత్త చిత్రం ‘పెద్ది’ గురువారం విడుదలైన సందర్భంగా థియేటర్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన హీరో సినిమాను ఎంతో ఇష్టంతో చూసేందుకు ప్రేక్షకులు, అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్‌కు తరలివచ్చారు. సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు థియేటర్ యాజమాన్యం తీవ్ర నిరాశను మిగిల్చింది. థియేటర్ లోపల కనీసం ఫ్యాన్లు, ఏసీలు కూడా సరిగ్గా పని చేయకపోవడంతో లోపల ఉన్న ప్రేక్షకులంతా తీవ్రమైన ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉక్కపోతను తట్టుకోలేక ఊపిరాడక బిత్తరపోవడం ప్రేక్షకుల వంతయింది.

థియేటర్ నిర్వాహకుల నిర్లక్ష్య వైఖరి పై ఇంటర్వెల్ సమయంలో ప్రేక్షకుల సహనం నశించింది. థియేటర్ లోపల కనీస వసతులు కల్పించకుండా.. కూల్ డ్రింక్స్, పాప్ కార్న్ లతో పాటు బైక్, కార్ పార్కింగ్ ల పేరుతో విపరీతంగా పైసలు దోచుకుంటున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున యాజమాన్యంపైకి దూసుకెళ్లి గొడవకు దిగారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు చేయి చేసుకునే పరిస్థితి రాగా, తోటి అభిమానులు జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగించారు. టికెట్ల పేరుతో, తినుబండారాల పేరుతో దండిగా వసూళ్లు చేస్తున్న యాజమాన్యం.. ప్రేక్షకులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి, థియేటర్ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రేక్షకులను ఇలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా చూడాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story