వాయువేగం.. నడుస్తూనే మంటలార్పే సత్తా.. కేరళలో అత్యాధునిక అగ్నిమాపక వాహనాల ఎంట్రీ!

by Ramesh Naini |

ప్రమాదాల సమయంలో ప్రాణనష్టాన్ని నివారించి, మంటలను అత్యంత వేగంగా అదుపు చేసేందుకు కేరళలోనే తొలిసారిగా ‘రోసెన్‌బాయర్ పాంథర్ క్రాష్ ఫైర్ టెండర్’ అనే అత్యాధునిక అగ్నిమాపక వాహనాన్ని తమ రక్షణ విధుల్లోకి చేర్చింది.

వాయువేగం.. నడుస్తూనే మంటలార్పే సత్తా.. కేరళలో అత్యాధునిక అగ్నిమాపక వాహనాల ఎంట్రీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం భద్రతా ప్రమాణాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. విమాన ప్రమాదాల సమయంలో ప్రాణనష్టాన్ని నివారించి, మంటలను అత్యంత వేగంగా అదుపు చేసేందుకు కేరళలోనే తొలిసారిగా ‘రోసెన్‌బాయర్ పాంథర్ క్రాష్ ఫైర్ టెండర్’ (Rosenbauer Panther crash fire tender) అనే అత్యాధునిక అగ్నిమాపక వాహనాన్ని తమ రక్షణ విధుల్లోకి చేర్చింది. ఆస్ట్రియా నుంచి దిగుమతి చేసుకున్న ఈ భారీ వాహనం అత్యవసర సమయాల్లో ప్రయాణికులకు ప్రాణదాతగా నిలవనుంది.

విమానాన్ని చీల్చే సాంకేతికత..

ఇందులో ఉన్న ‘హై-రీచ్ ఎక్స్‌టెండబుల్ టరెట్’ సిస్టమ్ 16.5 మీటర్ల (సుమారు 5 అంతస్తుల భవనం) ఎత్తు వరకు చేరుకోగలదు. మండుతున్న విమానం బాడీని పగులగొట్టి, నేరుగా ప్యాసింజర్ క్యాబిన్ లేదా కార్గోలోకి 85 మీటర్ల దూరం వరకు నీటిని, ఫోమ్‌ను అత్యంత వేగంగా చిమ్మగలదు. దట్టంగా పొగ కమ్ముకున్న విమానం లోపల మంటలు ఎక్కడ ఉన్నాయో, ప్రయాణికులు ఎక్కడ చిక్కుకున్నారో బయట నుంచే పసిగట్టేందుకు థర్మల్ ఇమేజింగ్ కెమెరా అనే స్మార్ట్ కెమెరా సిస్టమ్ ఉంది.

వాయువేగం - భారీ సామర్థ్యం

700 హార్స్‌పవర్ వోల్వో ఇంజిన్‌తో పనిచేసే ఈ వాహనం.. కేవలం 30 సెకన్లలోనే గంటకు 80 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్లు. ఇందులో ఒకేసారి 11,300 లీటర్ల నీరు, 1,300 లీటర్ల ఫోమ్, 250 కిలోల డ్రై కెమికల్ పౌడర్‌ (DCP)ను నిల్వ చేయవచ్చు.

నడుస్తూనే మంటలార్పే సత్తా..

దీనిలో ఉన్న ‘పంప్ అండ్ రోల్’ ఫీచర్ ద్వారా వాహనం కదులుతూనే మంటలను ఆర్పవచ్చు. ట్రక్కు కింద భాగంలో ఉండే నాజిల్స్ నేలపై వ్యాపించిన మంటల నుంచి వాహనానికి రక్షణ కల్పిస్తాయి. ప్రస్తుతం ఏడాదికి 4.5 మిలియన్ల ప్రయాణికులను చేరవేస్తున్న తిరువనంతపురం విమానాశ్రయం.. భవిష్యత్తులో ఆ సామర్థ్యాన్ని 27 మిలియన్లకు పెంచేలా విస్తరణ పనులు చేపడుతోంది. ఈ క్రమంలో ప్రయాణికులు, ఎయిర్‌లైన్స్ భద్రత విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించేందుకే ఈ అధునాతన అగ్నిమాపక వాహనాన్ని ప్రవేశపెట్టినట్లు విమానాశ్రయ అధికారులు (TRV) వెల్లడించారు.

Next Story