జీరో కాల్షియం స్కోర్ ఉంటే.. హార్ట్ అటాక్ రిస్క్ లేనట్టేనా?

by Javid Pasha |

ధమనుల్లో సాఫ్ట్ ప్లాక్ లేదా నాన్-కాల్షిఫైడ్ ప్లాక్ ఉంటే కూడా కాల్షియం స్కోర్ జీరో వస్తుంది. ఈ సాఫ్ట్ ప్లాక్ సులభంగా చీలిపోయి రక్తం గడ్డకట్టి హార్ట్ అటాక్‌కు దారితీయవచ్చు.

జీరో కాల్షియం స్కోర్ ఉంటే.. హార్ట్ అటాక్ రిస్క్ లేనట్టేనా?
X

దిశ, ఫీచర్స్ : ఇటీవల చాలా మంది ధమనుల్లో బ్లాకేజ్ సమస్యతో బాధపడుతున్నారు. కాల్షియం ప్లాక్ పేరుకుపోవడం వల్ల గుండెకు రక్తం సరిగా సప్లై కాకపోవడం, తీవ్ర కేసుల్లో గుండెపోటు లేదా స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం పెరుగుతుంది. అందుకే శరీరంలో కాల్షియం సమతుల్యంగా ఉండాలని వైద్యులు చెబుతుంటారు. అయితే చాలా మంది కరోనరీ ఆర్టరీ కాల్షియం స్కోర్ జీరో వచ్చిందంటే తమకు ఏమీ కాదని ధీమాతో ఉంటారు. కానీ ఇది పూర్తి నిజం కాదు. అందుకే తగిన జాగ్రత్తలు అవసరం. అవేమిటో చూద్దాం.

జీరో స్కోర్ అంటే ఏమిటి?

ఇది సిటి(CT) స్కాన్ ద్వారా గుండె ధమనుల్లో గట్టిపడిన (కాల్షిఫైడ్) ప్లాక్ మాత్రమే కొలిచే టెస్ట్. జీరో అంటే గట్టి ప్లాక్ లేదని అర్థం. ఇది పది సంవత్సరాల్లో హార్ట్ అటాక్ రిస్క్ చాలా తక్కువగా ఉందని సూచిస్తుంది. కానీ ఇది పూర్తి రక్షణ కాదు.

ప్రమాదం ఎక్కడ ఉంది?

ధమనుల్లో సాఫ్ట్ ప్లాక్ లేదా నాన్-కాల్షిఫైడ్ ప్లాక్ ఉంటే కూడా కాల్షియం స్కోర్ జీరో వస్తుంది. ఈ సాఫ్ట్ ప్లాక్ సులభంగా చీలిపోయి రక్తం గడ్డకట్టి హార్ట్ అటాక్‌కు దారితీయవచ్చు. ముఖ్యంగా ధూమపానం చేసేవారు, డయాబెటిక్ రోగులు, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు, ఊబకాయం ఉన్నవారికి ఈ రిస్క్ ఎక్కువ.

ఏం చేయాలి?

కాల్షియం స్కోర్ ఒక్కటే కాకుండా, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, లైఫ్‌స్టైల్ అన్నీ కలిపి చూడాలంటున్నారు వైద్య నిపుణులు. జీరో స్కోర్ మంచి సంకేతమే, కానీ దాన్ని భరోసాగా తీసుకుని నిర్లక్ష్యం చేయకూడదు. ఇక లక్షణాల విషయానికి వస్తే.. ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి ఇబ్బందులు ఉంటే.. సిటి ఆంజియోగ్రఫీ (CTA) చేయించుకోవాలి. డాక్టర్ల సలహా పాటించాలి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, స్మోకింగ్, ఆల్కహాల్ వంటివి మానేయడం, బరువు నియంత్రణ కూడా చాలా ముఖ్యం.

Next Story