మావోయిస్టుల త్యాగాలు వృథా కాకూడదు..

by Ravi |   (  Updated:2026-03-01 10:15:52  IST  )

కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో 2026 ఫిబ్రవరి 24 ఒక చారిత్రాత్మకమైన రోజుగా మిగులుతుంది. ఈ రోజునే సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న తిప్పిరి తిరుపతి లొంగిపోవడంతో ఐదు దశాబ్దాల పైగా ఉనికిలో ఉన్న నక్సలైట్ ఉద్యమం దాదాపు అంతరించినట్లయింది.

మావోయిస్టుల త్యాగాలు వృథా కాకూడదు..
X

కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో 2026 ఫిబ్రవరి 24 ఒక చారిత్రాత్మకమైన రోజుగా మిగులుతుంది. ఈ రోజునే సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న తిప్పిరి తిరుపతి (దేవుజీ), మల్లా రాజిరెడ్డి, సుజాతక్క, నూనె నరసింహారెడ్డి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ (బడే చొక్కారావ్) తదితరులు ఆయుధాలు విసర్జించి లొంగిపోవడంతో దేశంలో ఐదు దశాబ్దాల పైగా ఉనికిలో ఉన్న నక్సలైట్ ఉద్యమం దాదాపు అంతరించినట్లయింది.

మావోయిస్టులు దశాబ్దాల తరబడి అనేక కష్టనష్టాలు భరించారు. ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించారు.. తాము నమ్మిన సిద్ధాంతాల కోసం కృషి చేశారు. అయితే దశాబ్దాల అనుభవాలనుండి తాము అను సరిస్తున్న విధానం వల్ల ఫలితాలు రావని గమనించి బయటకు వస్తున్నారు.. వారి త్యాగాలను వృధా కాని వ్వవద్దు. వారిని స్వాగతిద్దాం. ఆదరిద్దాం. గౌరవిద్దాం.. త్యాగపూరిత జీవితాలు కలిగిన ఈ నాయకులు ప్రజల మధ్యలో ఉండి, ప్రజలను చైతన్యపరిచి రాష్ట్రంలో వామపక్ష ప్రత్యామ్నాయాన్ని పటిష్ట పరచటానికి తోడ్పడతారని ఆశిద్దాం.

జాప్యం తోటే అధిక నష్టాలు..

మావోయిస్టులు ప్రాణాలు పోతాయని భయపడో లేదా అనారోగ్యం వలననో బయటికి వస్తున్నారనేది సరైనది కాదు.. వారు ఇంతకాలం కొనసాగించిన పోరాటాన్ని కొనసాగించలేమని భావించారు. రాజ్యాంగబద్ధంగా పోరాటాలు అవసరమని తమ పంధాని మార్చుకొని బయటికి రావడం ప్రశంసనీయం.. నిజానికి మావోయిస్టు పార్టీ 2024 ఆగస్టులోనే సాయుధ పోరాటాన్ని విసర్జించి, చట్టబద్ధమైన రాజకీయ కార్యకలాపాలకు సిద్ధపడాలని నిర్ణయించుకున్నది. నెలల తరబడి ఆ పార్టీ అంతరంగికంగా చర్చోప చర్చలు చేసి, తాము ఆయుధాలు సహితం వదిలి బయటకు రావటానికి సిద్ధంగా ఉన్నామని 2025 ఏప్రిల్ లోనే మావోయిస్టు పార్టీ నిర్ణయానికి వచ్చింది. నంబాల కేశవరావు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడే ఈ నిర్ణయం జరిగిందని, ఆ పార్టీలోని కొందరి వ్యతిరేకతతో నిర్ణయాన్ని అమలు జరపటంలో జాప్యం జరిగిందని వారి లేఖల ద్వారా తెలుస్తుంది. దానినే ప్రభుత్వం మంచి అవకాశంగా తీసుకొని మావోయిస్టులతో చర్చలు తిరస్కరించింది.

ఎన్నో ప్రాణాలు మిగిలేవి?

ప్రభుత్వం అప్పటికే కొనసాగిస్తున్న ‘ఆపరేషన్ కగార్‌’ను ఉదృత పరిచింది. పౌరసంఘాలు, వామ పక్షాలు 'శాంతి చర్చలు' జరిపి సమస్యను పరిష్కరించాలని ఎంతో ప్రయత్నం చేసినా, ప్రభుత్వం మొండిగా నిరాకరించింది. దండకారణ్యం అంతా క్యాంపులు పెట్టడం ద్వారా, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా రవాణా సౌకర్యాలని అందుబాటులోకి తెచ్చుకొని అడివినంత జల్లడ పట్టింది. చివరికి నిరాయుధులుగా దొరికిన వారిని, లొంగిపోయిన మావోయిస్టులను సైతం బూటకపు ఎన్‌కౌంట్‌ర్‌లో కాల్చి వేసింది. కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ ప్రకటించిన తర్వాత మావోయిస్టు పార్టీ 2025 మే 21న ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుని కోల్పోయింది. ఆ తర్వాత సెంట్రల్ కమిటీ సభ్యులు, ముఖ్య నాయ కులను కోల్పోయింది. దీర్ఘకాలిక సాయుధ పోరాటం ఫలితానివ్వదని అనుభవం నుండి నేర్చుకుని 2025 అక్టోబర్ లోనే సోను, ఆశన్న బయటకు వచ్చారు..

మల్లోజుల లేఖతోనే స్పష్టమైంది!

మల్లోజుల వేణుగోపాల్ రావు తాను విడుదల చేసిన 22 పేజీల లేఖలో తనకున్న సైద్ధాంతిక విభేదాలను వివరిస్తూ అనేక విషయాలు చెప్పాడు.. ఆయనకి ఎంతో కాలం నుండి పార్టీ విధానాల పట్ల వ్యతిరేకత ఉన్నట్లు, అవి పార్టీలో ఎప్పటికప్పుడు చర్చకు పెడుతున్నట్టు అర్థం అవుతుంది. అదే విధంగా తక్కలపల్లి వాసుదేవరావు తాను సుదీర్ఘంగా ఇచ్చిన వీడియోలో దీర్ఘ కాలిక సాయుధ పోరాటానికి దేశ పరిస్థితులు అనుకూలంగా లేవని, మారిన పరిస్థి‌తులను అనుసరించి ప్రస్తుత పంధాను మార్చుకోవాలని, ప్రజల మధ్యలో ఉంటూ ఎన్నికల్లో సైతం పాల్గొనాలని చెప్పారు.. దాదాపు ఇలాంటి అభిప్రాయాలనే తర్వాత ఆయుధాలు విసర్జించి బయటకు వచ్చినవారు చెప్తున్నారు..

వారి త్యాగాలను నిందించకండి..!

సాయుధ పోరాట సమర్థకులుగా ఉన్నామనుకొనే కొంతమంది ఆ విధానం సరిపడక బయటికి వచ్చిన వారిని ద్రోహులుగా ముద్రలు వేసి అవమానపరుస్తూ ప్రచారం చేశారు.. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన దాని బదులు వారిని విమర్శించటం పరిస్థితిని సంక్లిష్టం చేసింది. దశాబ్దాల తరబడి అజ్ఞాతంలో ఉండి బయటకు వస్తున్న వారిని నిందించటం విజ్ఞత అనిపించుకోదు. ఏ అనివార్యమైన పరిస్థితుల్లో బయటికి వస్తున్నారో అర్థం చేసుకోవాలి.. వారి గౌరవానికి భంగం కలిగించే ఏ పని చేయొద్దు. కమ్యూనిష్టు వ్యతిరేక శక్తుల్లాగా వారిని ద్రోహులని, ప్రజా వ్యతిరేకులని ముద్రలు వేయడం అన్యాయం. బాధ్యతారాహిత్యం.

కమ్యూనిస్టుల పునరేకీకరణ తథ్యం!

100 సంవత్సరాల క్రితం పుట్టిన సనాతన సిద్ధాంతం కలిగిన ఆర్ఎస్ఎస్ ఈరోజు అధికారంలోకి రాగలిగింది, కానీ దేశ పురోగతి కోసం, సమాజాభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమం కొరకు నాడే పుట్టిన కమ్యూనిస్టు ఉద్యమం బలహీన పడిపోవటం అభిమానులందరిని కలవరపరుస్తుంది. అందుకే చిన్న చిన్న భిన్నాభిప్రాయాలతో చీలిక పేలికలైన కమ్యూనిస్టులందరూ కలవాలని ఒకే గొడుకు కిందికి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.. తక్షణమే కమ్యూనిస్టుల పునరేకీకరణ జరగకపోయినా ఒక కూటమిగా నైనా ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన మావోయిస్టులందరూ కూడా ఈ విషయాలను సీరియస్‌గా ఆలోచించాలి.. వేలాదిమంది దశాబ్దాల తరబడి చేసిన త్యాగాలు వృధా కాకూడదు. ప్రజలు కోరుకుంటున్న వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటులో మావోయిస్టులు కీలకపాత్ర వహిస్తారని ఆశిద్దాం.

-జి.రాములు,

తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం

94900 98066

మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. వికాస్ సహా 15 మంది సరెండర్

Next Story