- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక ‘తెలుగుదేశం’
ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదం నుంచి చంద్రబాబు అభివృద్ధి దిశ, లోకేష్ ఆధునిక నాయకత్వం వరకు తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ల ప్రస్థానం, మహానాడు ప్రాధాన్యం, తెలుగు జాతిపై టీడీపీ ప్రభావం గురించి విశ్లేషణాత్మక కథనం.

తెలుగు ప్రజల మనస్సుల్లో చెరగని చిరునామా నందమూరి తారక రామారావు. ప్రజా శ్రేయస్సును శిరస్సును దాల్చి జాతిహితం కోరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తెలుగు వాడిలో పౌరుషాన్ని రగిలించి, జనాన్ని అదిలించి, కదిలించి కేవలం 9 నెలల్లో అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కారు..
ఐదు దశాబ్దాల సినీ, సామాజిక రంగాల్లో తెలుగు జాతి ఆశలను, ఆలోచనను, ఆశయాలను బాగా ప్రాభావితం చేశారు. ఎన్టీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజా హితమే... అదో సంచలనం. సంక్షేమ రాజ్యాన్ని స్థాపించి, సామాజిక న్యాయాన్ని చిత్తశుద్ధితో అమలుచేసిన ప్రజా నాయకుడిగా దేశ చరిత్రలో నిలిచిపోయారు.
ఢిల్లీ అహంకారంపై తెలుగోడి గర్జన
మే 28 అనేది కేవలం ఎన్టీఆర్ పుట్టినరోజు మాత్రమే కాదు. తెలుగు జాతి ఆత్మగౌరవం మేల్కొన్న రోజు. రాజ కీయాల్లో ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెప్పిన రోజు. ఢిల్లీ అహంకారానికి ఎదురు నిలబడి, చరిత్ర గర్జించిన రోజు. కావున ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడు ఒక సాధారణ పార్టీ సమావేశం మాత్రమే కాదు. ఇది కార్యకర్తల ఆత్మీయ కలయిక. పసుపు జెండా వెనుక ఉన్న కోటిమంది ఆశయాల ప్రతిధ్వని. అందుకే ఆ రోజుకు ప్రత్యేక చారిత్రక ప్రాధాన్యం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు జరుపుకునే ఒక పండుగలా మారింది.
ఆన్‌లైన్‌కి మహానాడు పరిమితం..
మనవడు లోకేష్ తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించడంతో ఈ మహానాడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్, అభి వృద్ధి, అమరావతి, పోలవరం నిర్మాణం, యువతకు ఉపాధి, సంక్షేమం, అభివృద్ధి, సమతుల్యత, పార్టీ భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంటుంది. లోకేష్ చొరవతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలివచ్చాయి. దీనిపై మహానాడులో విస్తృత చర్చ జరగనుంది. ఏటా మే 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. కానీ ఈ ఏడాది పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో పొదుపు చర్యల్లో భాగంగా మహానాడు ఆన్‌లైన్‌కే పరిమితమైంది.
ఒకే ఆశయం, ఒకే లక్ష్యంతో 'వెలుగుదేశం'
ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రభంజనంలా మొదలైన తెలుగుదేశం పార్టీ పాలన ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చింది. తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసింది. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ.. నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో అభివృద్ధి దిశగా విస్తరించింది. ఇప్పుడు యువనేత నారా లోకేష్ కొత్తతరం నాయకత్వంతో మరింత ఆధునిక దిశగా అడుగులు వేస్తోంది. తాత, తండ్రి, మనవడు మూడు తరాల కాలక్రమంలోనూ ఒకే ఆశయం, ఒకే లక్ష్యంతో వెలుగుదేశంగా విరాజిల్లుతోంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ 8 సంవత్సరాలు, చంద్రబాబు 16 ఏండ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు..
తెలుగుజాతి చరిత్రను తిరగరాసిన పార్టీ
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 ఏళ్లే కావచ్చు.. కానీ ఆ పార్టీ తెలుగుజాతి చరిత్రను తిరగరాసింది. 24 ఏళ్లు అధికారపక్షంలో, 20 ఏళ్లు ప్రతిపక్షంలో ఉంది. ఏ పక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేసింది. కేంద్రంలో కనీసం ఆరు ప్రభుత్వాలు ఏర్పడటానికి, మనగలగడానికి కారణం అయింది. జాతీయ స్థాయిలో వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని ఢీకొని దేశ రాజకీయాలను, ఢిల్లీ పీఠాన్ని కుదిపేసింది. ఒక ప్రాంతీయ పార్టీని పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిపిన ఘనత కూడా తెలుగుదేశానిదే. ఎన్టీఆర్ సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అనే మూల సిద్దాంతంతో ప్రారంభించిన తెలుగుదేశం ప్రయాణం.. నాలుగున్నర దశాబ్దాల తర్వాత కూడా తెలుగు రాజకీయాల్లో ఒక ధృవతారగా వెలుగుతూనే ఉంది. తెలుగుదేశం కేవలం రాజకీయ పార్టీ కాదు.. ఒక ప్రజా విశ్వాసం. రైతు నుంచి విద్యార్థి వరకు, మహిళల నుంచి వృద్ధుల వరకు ప్రతి వర్గానికీ చేరువై తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది.
సంక్షేమ రాజ్య పునాదికి నాంది ఎన్టీఆర్!
సంక్షేమ రాజ్యానికి బలమైన పునాదులు వేసి పేదల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన దేవుడు ఎన్టీఆర్. పాలనా సంస్కరణల్లో కొత్త ఒరవడి తెచ్చి అభివృద్ధికి బాటలు వేసిన దార్శనికుడు. పార్టీ పెట్టిన సందర్భంలో కొందరు మీ సిద్ధాంతం ఏమిటని అడిగితే.. పేదవాడికి పట్టెడన్నం పెట్టడం, నిలువనీడ కల్పించడం, ఒంటి నిండా బట్టకప్పుకొని ఆత్మ గౌరవంతో జీవించే పరిస్థితులు కల్పించడమే నా సిద్ధాంతం అన్నారు. రాజకీయాలు కొన్ని వర్గాలకు, కుటుంబాలకు పరిమితమైన రోజుల్లో బడగు, బలహీనవర్గాలకు రాజకీయ భాగస్వామ్యం కల్పించారు. వారిని చట్టసభలకు పంపి రాష్ట్రంలో రాజకీయ, ఆర్ధిక, సామాజిక విప్లవం తెచ్చారు.
తెలుగు ప్రజల ఆశల ప్రతిరూపం..
ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదం ఈ నాటికీ తెలుగు ప్రజల గుండెల్లో జాతీయ గీతంలా మారుమోగుతూనే ఉంది. రెండో తరంలో చంద్రబాబు.. ఎన్టీఆర్ వేసిన పునాదిపై అభివృద్ధి అనే మహాసౌధాన్ని నిర్మించారు. తన దార్శనికతతో ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పటంలో నిల బెట్టారు. తెలుగుదేశంలో మూడో తరం నాయకత్వం తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెట్టగలడన్న నమ్మకాన్ని నారా లోకేష్ కలిగించారు. ఆధునిక ప్రపంచంలో సాంకేతికతను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు తండ్రి బాటలో పయనిస్తున్నారు. పార్టీలో కోటి మంది సభ్యులను చేర్చి వారికి బీమా సౌకర్యం కల్పించారు. వినూత్న కార్యక్రమాలతో కార్య కర్తలకు చేరువయ్యారు.
ప్రజలతో మమేకమై అజేయమైన శక్తి!
అభివృద్ధి, సంక్షేమ రాజ్యాలతో ప్రగతి పథంలో నడిపించడంతో తెలుగుదేశం ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో, ఎన్నెన్నో ఆటుపోట్లు, మరెన్నో సంక్షోభాలు, కుట్రలు, కుతంత్రాలు తట్టుకుని సమున్నతంగా నిలబడింది. మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతూ, అభివృద్ధి లక్ష్యాన్ని మరువకుండా ఎన్టీఆర్ సిద్ధాంతాలు, ఆశయాలను కొనసాగిస్తూనే ఉంది. ప్రజలతో మమేకమై అజేయమైన శక్తిగా ఎదుగుతూనే ఉంది.
(నేటి నుంచి టీడీపీ వర్చువల్ మహానాడు జరుగుతున్న సందర్భంగా)
- మన్నవ సుబ్బారావు
గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్
99497 77727






