- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హార్ముజ్.. ఇరాన్ కొత్త రూల్
హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ప్రతిపాదించిన కొత్త ప్రాంతీయ ప్రోటోకాల్ ప్రపంచ చమురు సరఫరా, యూరప్ ఆర్థిక వ్యవస్థ, అమెరికా-ఇరాన్ సంబంధాలపై భారీ ప్రభావం చూపే అవకాశముంది. ఈ సంక్షోభంపై పూర్తి విశ్లేషణ.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి వంటి హార్ముజ్ జలసంధి. ఇది ఇప్పుడు సరికొత్త దౌత్య యుద్ధానికి వేదికైంది. యుద్ధం అంటే కేవలం క్షిపణుల ప్రయోగమే కాదు, వ్యూహాత్మక ఎత్తుగడల చదరంగం అని ఇరాన్ మరోసారి నిరూపిస్తున్నది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ ప్రతిపాదిం చిన ‘కొత్త ప్రాంతీయ ప్రొటోకాల్’ సహజ సిద్ధమైన జలమార్గాన్ని తన సొంత ఆస్తిగా మార్చుకోవడంతో పాటు అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బకొట్టాలన్న ఇరాన్ దీర్ఘకాలిక ఎత్తుగడగా పరిగణించాలి.
మరోవైపు, ఈ సంక్షోభం అట్లాంటిక్ మహాసముద్రం ఇరువైపులా ఉన్న మిత్ర దేశాల మధ్య ఐక్యతను కుప్పకూల్చుతున్నది. మొత్తానికి హార్ముజ్ చుట్టూ ముదురుతున్న ఈ మంటలు కేవలం చమురు ధరలనే కాదు.. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న అంతర్జాతీయ దౌత్య సమీకర ణాలను కూడా మార్చేలా కనిపిస్తున్నాయి.
అగ్గి రగిల్చిన అరాక్చీ!
ఇరాన్ ఓటమి అంచున ఉన్నది. ఏ క్షణమైనా ముందు బేషరతుగా లొంగిపోవచ్చని అమెరికా చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని.. ఇరాన్ తాజా ప్రతిపాదనలు నిరూ పిస్తున్నాయి. తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ ఒక కీలక ప్రతిపాదన చేశారు. యుద్ధం ముగిసిన తర్వాత హోర్ముజ్ జలసంధిలో ‘కొత్త ప్రాంతీయ ప్రొటోకాల్’ ఉండాలని పశ్చిమ దేశాల నౌకలు ఈ మార్గంలో వెళ్లాలంటే ఇరాన్ విధించే కొత్త షరతులకు తలవొంచాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఓవైపు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ‘హోర్ముజ్ జలసంధిని తెరవడానికి మిత్రదేశాలన్నీ సైన్యాన్ని పంపాలి’ అని పిలుపునిచ్చారు. కానీ యూరప్ స్పందన భిన్నంగా ఉంది. జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు అమెరికా యుద్ధ ప్రయత్నాల్లో నేరుగా చేరడానికి నిరాకరిస్తున్నాయి. అమెరికా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాల వల్ల తాము ఇరాన్ ప్రతీకార దాడులకు లక్ష్యంగా మారకూడదని అవి భావిస్తున్నాయి.
అమెరికాకు దెబ్బ కాదు.. కానీ
అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన ఉత్పత్తిదారు కాబట్టి ఈ చమురు ధరల పెరుగుదల దానికి పెద్ద దెబ్బ కాదు. కానీ యూరప్ ఇంధనం కోసం గల్ఫ్ దేశాలపై ఆధార పడుతుంది. అమెరికా ఆంక్షలతో రష్యా ఇంధనాన్ని కూడా వదులుకోవడంతో గ్యాస్ ధరలు 20% పెరగడం యూరప్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నది. హార్ముజ్ ద్వారా వచ్చే 60% చమురు సరఫరా నిలిచిపోవడంతో భారత్ ఇప్పటికే రష్యా నుండి వచ్చే చమురుపై ఆధారపడటం పెంచింది. ఇరాన్ నుండి రెండు ఇండియన్ ఎల్‌పీజీ ట్యాంకర్లకు మినహాయింపు లభించడం మనకు భారీగా ఊరట లభించింది.
ఇరాన్ షరతులు..
అంతర్జాతీయ చట్టాల ప్రకారం యుద్ధ నౌకలు మినహా మిగిలిన వాణిజ్య నౌకలు ‘ఇన్నోసెంట్ పాసేజ్’ కింద ఎవరి అనుమతి లేకుండానే హార్ముజ్ జలసంధి గుండా వెళ్లవచ్చు. కానీ, ఇరాన్ మాత్రం స్పష్టంగా ఒక మాట చెప్తున్నది. యుద్ధానికి ముందున్న విధానాలు పూర్తిగా మారాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో ఇరాన్ విధించే కొత్త షరతులు ఇలా ఉండే అవకాశం ఉన్నది. హార్ముజ్ గుండా వెళ్లే ప్రతి నౌక 72 గంటల ముందే ఇరాన్ కోస్ట్ గార్డ్‌కు సమాచారం ఇచ్చి, అనుమతి తీసుకోవాలి. దీనివల్ల ఏ నౌకలో ఏముందో నిఘా పెట్టే అధికారం ఇరాన్‌కు వస్తుంది. హార్ముజ్ జలసంధిలో భద్రతను ఇరాన్, ఒమన్ మాత్రమే చూస్తాయి.. కాబట్టి వెళ్లే ప్రతి నౌక కొంత మొత్తాన్ని ‘సెక్యూరిటీ సర్‌చార్జ్’గా చెల్లించాలని కొత్త ప్రతిపాదన తెచ్చే అవకాశం ఉన్నది. గల్ఫ్ ప్రాంతానికి సంబంధం లేని దేశాల యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకలు ఈ జలసంధిలోకి ప్రవేశించకూడదు.. ఒకవేళ రావాల్సి వస్తే ఇరాన్ నేతృత్వంలోని ‘రీజినల్ కౌన్సిల్’ అనుమతి తీసుకోవాల్సి ఉంటుం దనేది అన్ని షరతుల్లో కీలకమైనది.. ఇరాన్ చమురును కొనే దేశాల నౌకలకు మాత్రమే ఈ జలసంధిలో ‘గ్రీన్ చానల్’ కల్పిస్తామని, ఆంక్షలు పాటించే దేశాల నౌకలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది.
సూయజ్.. హార్ముజ్‌కు తేడా
నిజానికి సూయజ్ కాలువ మానవ నిర్మితం. ఇది పూర్తిగా ఈజిప్ట్ భూభాగం గుండా వెళ్తుంది. కాబట్టి, దానిపై ఈజిప్టుకు పూర్తి సార్వభౌమాధికారం ఉంటుంది. ఎవరిని అనుమతించాలి? ఎంత రుసుము వసూలు చేయాలి? అనేది ఈజిప్ట్ ఇష్టం. హార్ముజ్ జలసంధి పూర్తిగా సహజసిద్ధమైన జలమార్గం. పైగా ఇది అంతర్జాతీయ జలసంధి. దీని ఒక వైపు ఇరాన్, మరోవైపు ఒమన్ దేశాలు ఉన్నాయి. దీనిపై ఏ ఒక్క దేశానికీ పూర్తి హక్కు ఉండదు. సముద్ర చట్టాలపై అంతర్జాతీయ ఒప్పందం (United Nations Convention on the Law of the Sea) ప్రకారం అంతర్జాతీయ జలసంధుల గుండా వెళ్లే నౌకలకు ‘నిరంతర, వేగవంతమైన ప్రయాణం’ చేసే హక్కు ఉంటుంది. దీనిని ఏ దేశం అడ్డుకోకూడదు, రుసుము వసూలు చేయకూడదు. ఇరాన్ ఈ ఒప్పందంపై సంతకం చేసినా, దానిని పూర్తిగా ఆమోదించలేదు. అందువల్ల, తమ ప్రాంతీయ జలాల గుండా వెళ్లే నౌకలపై నియంత్రణ మాకు ఉండాలని ఇరాన్ వాదిస్తోంది.
యుద్ధం ముగింపు ఇదేనా?
‘ఇరాన్ పెడుతున్న షరతులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. మేము వీటిని అంగీకరించం. అవసరమైతే బల ప్రయోగం చేస్తాం’ అని అమెరికా అంటోంది. అమెరికా మొండిగా వెళ్తే ఇరాన్ పూర్తిగా జలసంధిని మూసేస్తుంది. ఫలితంగా చమురు, గ్యాస్ సరఫరా ఆగిపోతే యూరప్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. అందుకే ఇరాన్‌తో చర్చలు జరిపి ఏదో ఒక మధ్యేమార్గం చూడాలని ఆ దేశాలు అమె రికాపై ఒత్తిడి తెస్తున్నాయి. మొత్తానికి పరిస్థితి చూస్తే యూరప్ దేశాలు అమెరికాను ఒప్పించి.. ఇరాన్‌పై ఉన్న కొన్ని ఆర్థిక ఆంక్షలను సడలించే అవకాశం ఉంది. దీనికి ప్రతిగా ఇరాన్ ప్రతిపాదిస్తున్న ‘కొత్త ప్రొటోకాల్’ డిమాండ్లలో కొన్ని వెనక్కి తీసుకునేలా ఒప్పందం కూడా కుదిరే అవకాశం ఉన్నది. హార్ముజ్ జలసంధి గొంతుపై ఇరాన్ పెట్టిన కత్తితో యూరప్ సహా ప్రపంచ దేశాలు వణుకుతున్నాయనడంలో సందేహమే లేదు.
-హరీశ్ ఎస్పీ






