నేటికీ పారిశుధ్యమే బతుకుదెరువా?

by Disha edit |
నేటికీ పారిశుధ్యమే బతుకుదెరువా?
X

పేదల ఆశలే పెద్దోళ్ల రాజకీయానికి అయుధమవుతున్నాయి. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశంలో దళితులు ఇంకా అణచివేతకు, ఆకలి కేకల్లో మగ్గిపోతూనే ఉన్నారు. అయినప్పటికీ వారి బతుకుల్లో మార్పు తెచ్చే సంస్కరణలను మాత్రం ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో తేలేకపోతున్నాయి. పేదల చుట్టూ అందమైన మేనిఫెస్టోలు పెట్టి.. అధికారంలోకి రావడం సులువు అవుతుంది. ఈ తంతు కేంద్రంలో, రాష్ట్రాల్లోనూ సర్వసాధారణమైపోయింది. వాస్తవానికి ఒకసారి మోసపోయినా .. ఇంకోసారైనా తమ ఆకాంక్షలు నెరవేరుతాయని ఓపికతో దళితులు ఎదురు చూస్తున్నప్పటికీ వారి బతుకుల్లో మాత్రం మార్పు కన్పించడం లేదు. తాత్కాలిక అవసరాలే తప్పా... దళితులకు గుణాత్మకమైన పథకాలు తెచ్చి వారి బతుకులకు స్వేచ్ఛ కల్పించలేకపోతున్నారు.

హామీలు అమలు చేయరు..

అధికారంలోకి రావడానికి దళితుల ఓట్లను మూటగట్టుకోవడానికి అనేక హామీలు ఇవ్వడం.. సంవత్సరాల తరబడి ఆ హామీలు నెరవేరకపోవడం చేసేదేమీ లేక చాలీచాలని బతుకులను వెళ్లదీస్తున్నారు. దళితుల సంక్షేమానికి న్యాయంగా ఖర్చు చేయాల్సిన నిధులను కూడా ఖర్చు చేయకపోవడం అంటేనే నిజంగా దళితుల దుర్భర జీవితాలను ప్రోత్సహించడమో లేకుంటే దళితులపై అంతులేని నిర్లక్ష్యమో అని చెప్పవచ్చు. దళితుల అభివృద్ధి కోసం కేటాయించే ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేయకపోవడం నిజంగా బాధాకరం. కేవలం ఈ ఏడాదిలోనే 13,961 కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నప్పటికీ ఖర్చు చేయకపోవడం వల్ల కేటాయించిన నిధులు రద్దు కావడం ఎంత దురదృష్టకరం. దాదాపు ఈ ఐదేళ్లలో 71 వేల కోట్లు మరుగునపడడం నిజంగా దళిత సమాజాన్ని మరింత వెనక్కి నెట్టడమే. దీనిని ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథ్వాలే అధికారికంగా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన పదేళ్లలో వాస్తవానికి దళితులు దేశవ్యాప్తంగా ఆశించినంత ప్రగతి సాధించలేకపోయారు. ఇప్పటికీ దళితులకు పారిశుధ్య రంగమే దిక్కైంది. గత పార్లమెంటు సమావేశాల్లో తెలిపిన వివరాల ప్రకారం దాదాపు దేశ వ్యాప్తంగా 73 శాతానికి పైగా ఈ రంగంలోనే దళితులు ఆధారపడాల్సిన దుస్థితి ఉంది. మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్న అంశం. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఎన్సీఆర్‌బీ లెక్కల ప్రకారం దళితులపై దాడుల్లో ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉండడం. దేశవ్యాప్తంగా దళితుల పట్ల ఆయా ప్రభుత్వాలు పట్టీ పట్టనట్లుగానే వ్యవహరించడం నిజంగా దళితుల అణచివేతకు కారణమనే చెప్పవచ్చు.

వర్గీకరణకు అతీగతీ లేదు

దళితుల్లో గుణాత్మక మార్పు తీసుకురావాల్సిన పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరం. ఈ మధ్య నరేంద్ర మోడీ దళితుల్లో ఉన్న అసమానతలు తొలగించేందుకు ఎస్సీ వర్గీకరణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పినా ఈ పదేళ్లలో చేయకపోగా, మరోమారు ఈ హామీనే ఇవ్వడం దళితులను మరోసారి మభ్య పెట్టడమే అవుతుంది. దళితులకు సంబంధించిన ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఇంతలా దుర్వినియోగం అవుతున్నప్పటికీ కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీ స్పందించకపోవడం చూస్తే వారు కూడా దళితుల పట్ల చిన్న చూపు దోరణితోనే ఉన్నారనేది అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పార్లమెంటుకు ఎన్నికైన దళిత ఎంపీల నిస్సహాయత కూడా స్పష్టంగా కన్పిస్తుంది.

వేల కోట్ల బడ్జెట్ నిరుపయోగం

ఐదేళ్లలో ఖర్చు చేయాల్సిన ఈ నిధులు ఆయా రాష్ట్రాలకు కేటాయిస్తే కనీసం ఎంతో కొంత దళిత వాడలు, వారి బతుకుల్లో మార్పు వచ్చే అవకాశం ఉండేది. అటువంటిది వేల కోట్లు ఖర్చుకు నోచుకోకుండా.. రద్దు కావడం అంటే... దళితుల జీవితాల్లో మార్పునకు జాప్యం పెంచినట్లే. అధికార పక్షం నిర్లక్ష్యం వహిస్తే... ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం కూడా కనీసం దళితుల అంశం మీద మాట్లాడకుండా ఉండటం కూడా లోపమే. బడ్జెట్ కేటాయించడం, అంకెల్లో చూపినంత మాత్రాన దళితుల జీవితాల్లో మార్పు రాదు. కేటాయించిన బడ్జెట్ సంపూర్ణంగా జనాభా నిష్పత్తి మేరకు ఆయా రాష్ట్రాలకు ఉపయోగపడితేనే దళితుల బతుకుల్లో మార్పు వస్తుంది. వాస్తవానికి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఐదేళ్లలో ఖర్చు చేయకుండా రద్దు అయ్యేలా నిర్లక్ష్యం చేయడంలో కేంద్ర ప్రభుత్వానిదైతే.. పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలు, దళిత ఎంపీలదని కూడా చెప్పవచ్చు. ఇప్పటికైనా దళితులకు కేటాయించే బడ్జెట్‌ని సంపూర్ణంగా వినియోగించేలా..‌ దళితుల బతుకుల్లో గుణాత్మక మార్పు తెచ్చేలా బాద్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే వేల కోట్ల బడ్జెట్ నిరుపయోగమైపోయింది. మున్ముందు ఇటువంటి తప్పిదాలు లేకుండా అప్రమత్తంగా ఉండి దళితుల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో పాటు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది.

సంపత్ గడ్డం

78933 03516

Next Story