కామన్ మ్యాన్ డైరీ: ఆశల రెక్కలు విరిచేసి.. బంధాల గూడును చెరిపేసిన ఆడపిల్లల కథ

by Disha edit |
కామన్ మ్యాన్ డైరీ: ఆశల రెక్కలు విరిచేసి.. బంధాల గూడును చెరిపేసిన ఆడపిల్లల కథ
X

అల్లారు ముద్దుగా పెంచిన పిల్లలు పెద్దోళ్లైపోయారు.. రెక్కలు వచ్చిన పక్షుల్లా ఎగిరిపోయారు. ఇంకా 20 లక్షల రూపాయల అప్పు మిగిలే ఉన్నది. షాపు సరిగా నడవడం లేదు. అప్పులోళ్లు వెంటపడుతున్నారు. వడ్డీలు కట్టడం కూడా కష్టమవుతున్నది. చేసేదేమీ లేక ఉన్న ఇల్లును అమ్మేశారు. 15 లక్షలు వస్తే అప్పుల వాళ్లకు చెల్లించారు. రూ. ఐదు లక్షలు మాత్రమే కట్టాలి. దుకాణం వెనుక ఉన్న రెండు రూములలోనే ఉంటున్నారు. ఉన్నట్టుండి కిషన్ కు హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపు తనువు విడిచాడు. ఎవరూ లేకపోవడంతో వనజే తలకొరివి పెట్టింది. బిడ్డలెవరూ కాంటాక్ట్ లో లేరు.. ఎక్కడున్నారో తెలియదు.

కామారెడ్డి ప్రాంతానికి చెందిన కిషన్, వనజ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. కిషన్ మండల కేంద్రంలో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. వారసత్వంగా వచ్చిన ఎకరం భూమిని కౌలుకు ఇచ్చాడు. వనజ ఇంటి వద్దనే ఉంటున్నది. భర్త సామగ్రి కోసం కామారెడ్డి వెళ్లినప్పుడు షాపు నిర్వహణ కూడా చేస్తున్నది. ఆడపిల్లలు అనే వివక్ష చూపకుండా మంచి స్కూళ్లో చదివిస్తున్నారు. కూతుళ్లు హేమ, రమ్య అంటే తల్లిదండ్రులకు పంచప్రాణాలు. జిల్లా కేంద్రంలోని మంచి ప్రైవేటు పాఠశాలకు పంపుతున్నారు. స్కూలు బస్సు వచ్చి తీసుకెళ్తుంది. సాయంత్రానికి ఇల్లు చేరుకుంటున్నారు. ఆ ఐదారు గంటలు పిల్లలు కనిపించకపోతేనే తల్లడిల్లిపోయేవారు.

హేమ పదో తరగతి పూర్తయింది. టెన్త్‌లో 10 జీపీఏ రావడంతో వారి ఆనందాని అవధుల్లేవ్. ఇంటర్మీడియెట్ కోసం హైదరాబాద్​ పంపేందుకు తల్లిదండ్రుల మనసు ఒప్పలేదు. టీచర్లు, బంధువులు అంతా ఒత్తిడి చేయడంతో ఎట్టకేలకు హైదరాబాద్​ లోని శ్రీ చైతన్య కాలేజీలో చేర్పించారు. హాస్టల్ లో ఉండే బిడ్డకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకొనే వారు. రెండు రోజుల ముందు నుంచే ఆదివారం కోసం ఎదురు చూసేవారు. శనివారం రాత్రే రెడీ అయ్యేవారు ఆదివారం ఉదయం కల్లా హాస్టల్ లో వాలిపోయేవారు. ఇంట్లోంచి పిండివంటలు తీసుకెళ్లేవారు. సాయంత్రం పూట ఇంటి కొచ్చేటప్పుడు నలుగురూ బోరున ఏడ్చేసేవారు. వీళ్ల ఏడుపును చూసిన కాలేజీ సెక్యూరిటీ గార్డు 'ఇంతగా ఏడుస్తున్నావ్.. రేపు బిడ్డ లగ్గం చేయవా?'అనేటోడు.. మీ ప్రేమ చూస్తే నాకే ఏడుపొస్తుంది అనేవాడు.

*

బైపీసీ తీసుకున్న హేమ ఫస్టియర్‌లో మంచి మార్కులతో పాసైంది. అటు రమ్య టెన్త్ పూర్తయింది. రమ్య మ్యాథమెటిక్స్‌లో దిట్ట. ఆమెను ఎంపీసీ చేయించాలనుకున్నాడు. స్కూలు టీచర్లు నారాయణ కాలేజీలో చేర్పించాలని, మ్యాథ్స్ అక్కడ మంచి ఫ్యాకల్టీ ఉందని చెప్పారు. నారాయణ కాలేజీలో చేర్పించారు. మొన్నటి వరకు రమ్య తల్లిదండ్రులతో ఉండేది. ఇప్పుడు రమ్యను కూడా కాలేజీలో చేర్పించారు. రమ్యను పంపించేటప్పుడు చాలా బాధపడ్డారు.

ప్రతి ఆదివారం రైలెక్కి హైదరాబాద్​ వెళ్లడం, పిల్లలను కలుసుకోవడం, వారికి పిండివంటలు, బట్టలు, డబ్బులు ఇవ్వడం చేసేవారు. హేమ ఇంటర్ పూర్తయింది. నీట్ రాసింది. మెడికల్ సీటు వచ్చింది. నలభై లక్షల రూపాయల వరకు కట్టాలి. అంత డబ్బు తన వద్ద లేదు! ఎలా? అనుకున్నారు కిషన్, వనజ. 'పిల్లల భవిష్యత్తు కదా, మన ఊళ్లో ఎవరూ డాక్టర్ చదవలేదు సేటు, చదివించు'అంటూ ఊళ్లోవారు, ఫ్రెండ్స్ సలహా ఇచ్చారు. 'ఏ కష్టమన్న పడు'అంటూ సలహా ఇచ్చారు.

*

also read: కామన్ మ్యాన్ డైరీ:చెప్పలేని హైదరా'బాధ'!

భార్యభర్తలిద్దరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. చెరువు కింద ఉన్న ఎకరం భూమి అమ్మేద్దామని డిసైడ్ అయ్యారు. సర్పంచ్‌ను కలిసి విషయం చెప్పారు. నాకు కొంచం టైం ఇవ్వు పార్టీని చూస్తా అన్నాడు. 30 లక్షల రూపాయలకు ఎకరం భూమిని అమ్మేశారు. మిగతా 10 లక్షల రూపాయలు బంధువుల దగ్గర అప్పు చేసి ఎట్టకేలకు ఎంబీబీఎస్ లో చేర్పించారు. రమ్య ఇంటర్ పూర్తి కాగానే ఇంజినీరింగ్‌లో సీటు వచ్చింది. కౌన్సెలింగ్ సీటు కావడంతో ఏటా 30 వేలు కడితే చాలు పెద్దగా ఇబ్బంది లేదు.

కానీ హాస్టల్ వగైరా ఖర్చులకు కలిపితే లక్షన్నర వరకు అవుతున్నది. అలా మొత్తం ఆరు లక్షలు కావాలి. మరో మారు అప్పు చేశారు. ఈ అప్పులన్నింటినీ తిర్చాల్సింది కేవలం కిషన్ నడుపుతున్న కిరాణా షాపు మీదనే! వేరే మార్గం లేదు. సరే ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాడు కిషన్. ఊళ్లో సొంతిళ్లు ఉన్నా, కిషన్ నడుపుతున్న షాపు అద్దెది. చౌరస్తాలో ఉంటుంది. షాపు వెనకాల రెండు రూములు కూడా అటాచ్ ఉన్నాయి. వాటిని గోదాంగా వినియోగించుకొనేవాడు.

*

చదువులకు అన్నీ కలిపి 25 లక్షల వరకు అప్పు అయ్యింది. వడ్డీలు కడుతూ బతుకుబండిని లాక్కొస్తున్నాడు. హేమ ఎంబీబీఎస్ పూర్తయింది. ఎండీ చేస్తేనే భవిష్యత్ లేకుంటే ఎంబీబీఎస్ ను ఎవరూ పట్టించుకోవడం లేదు. తాను ఎండీ చదువుతానని పట్టుబట్టింది హేమ. కొంత ఖర్చయినా సరే అనుకొని మరికొంత అప్పు చేశారు. హేమ ఎండీ పూర్తి చేసింది. ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యింది. నెలకు 50 వేల వరకు జీతం వస్తున్నది. మరో వైపు రమ్య ఇంజినీరింగ్ పూర్తయింది. ప్లేస్‌మెంట్స్ కోసం ఇంటర్వ్యూలు అటెండ్ చేస్తున్నది.

విద్యుత్ శాఖలో జాబ్ నోటిఫికేషన్ పడింది. తాను చదివింది ట్రిపుల్ ఈ కావడంతో దరఖాస్తు చేసుకున్నది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో రాణించి ఎట్టకేలకు ఉద్యోగం సంపాదించింది. ఆమెకు కరీంనగర్ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. బిడ్డ అక్కడ ఉండటం ఇబ్బందవుతుందనుకున్న కిషన్ రోజు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న రమ్య ఆఫీసుకు తన బైక్ పై తీసుకెళ్లి, అక్కడే ఉండి.. జాబ్ అయిపోగానే తీసుకొచ్చేవాడు.

*

డబ్బులు వస్తుండటంతో ఏడాదిలో దాదాపు రూ. 10 లక్షల వరకు అప్పులు తీర్చేశారు. హైదరాబాద్‌లోని కార్పొరేట్ హాస్పిటల్‌లో పనిచేస్తున్నహేమ దసరా పండుగకు ఇంటికి వచ్చింది. తన క్లాస్‌మేట్‌ను ప్రేమించానని, అతడినే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పింది. తనది మన కులం కాదని, కులం చెబితే మీరు వద్దంటారని అన్నది. కిషన్ వద్దన్నాడు. రెక్కలు ముక్కలు చేసుకొని చదివించాం.. (తన చెల్లెలి కొడుకు) బావకు ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాం. ఇప్పుడు ఇదేంటి అంటూ గద్దించాడు.

కిషన్ చెల్లెలు కొడుకు శివ బీటెక్ పూర్తి చేశాడు. ప్రస్తుతం యూకేలో ఉంటున్నాడు. అక్కడే ఉద్యోగం. చిన్నప్పటి నుంచి రెండు కుటుంబాల వాళ్లు అలాగే అనుకున్నారు. హేమ చెప్పిన మాటలు తేడాగా ఉన్నాయి. 'నాకు బావంటే ఇష్టం లేదు. మీరు అనుకున్నారేమో' నేను మాత్రం చేసుకోను అన్నది. తల్లిదండ్రులిద్దరూ బతిమాలారు.. ప్రేమించిన అబ్బాయిని మర్చిపోవాలని నచ్చజెప్పారు. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు.

కానీ హేమ వెనక్కు తగ్గలేదు. మరుసటి రోజు ఉదయమే హైదరాబాద్ వెళ్లిపోయింది. వారం తర్వాత ఫోన్ చేసింది. తాను తన క్లాస్ మేట్ నితీశ్ ను పెళ్లి చేసుకున్నానని చెప్పింది. ఇంటికి వస్తున్నానని అన్నది.. ఇంటికి రావద్దని తాము ఇంట్లో లేమని చెప్పారు. వేరే కులం పిలగాన్ని పెళ్లి చేసుకొని ఊళ్లెకు వస్తె మన పరువు ఉంటదా..? అంటూ బాధపడ్డారు.

నితీశ్​ కు ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చింది. నితీశ్​, హేమ ఇద్దరూ ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. వెళ్లే మందు హేమ మరోమారు తండ్రికి కాల్ చేసింది. తాము ఆస్ట్రేలియా వెళ్తున్నామని ఉదయం 4 గంటలకు ఫ్లయిట్ ఉందని, ఓ సారి రావాలని కోరింది. కానీ కోపం మీద ఉన్న కిషన్.. నా పరువు గంగల కలిపి ఫోన్ చేస్తున్నవా.. నీ ముఖం చూడను అంటూ గద్దించాడు. విషయాన్ని భార్యకూ చెప్పాడు. ఇద్దరు బోరున ఏడ్చారు.

*

also read: లోన్ యాప్ వలన బలైన మధ్యతరగతి వ్యక్తి కథ ఈ వారం కామన్ మ్యాన్ డైరీలో

కిషన్ ఎప్పటిలాగే చిన్న కూతురు రమ్యను ఆఫీసుకు తీసుకెళ్తున్నాడు. ఓ రోజు తండ్రిని ఆఫీసుకు రావద్దని, తానే వెళ్తానని, తనకు కరీంనగర్‌లో ట్రైనింగ్ ఉందని చెప్పింది. సరే అన్నాడు. రమ్య బస్సులో వెళ్లిపోయింది. ఆ రోజు తిరిగి రాలేదు. మరుసటి రోజు మరో వ్యక్తిని తీసుకొని ఇంటికి వచ్చింది. తన పేరు రహీం అని తన క్లాస్‌మేట్ అంటూ పరిచయం చేసింది.

తామిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పడంతో కిషన్ గుండె ఆగినంత పనైంది. వనజ నోరెళ్ల బెట్టింది. రెక్కలు ముక్కలు చేసుకొని చదివించినందుకు, మీ మీద ప్రేమను పెంచుకున్నందుకు తనకు తగిన శాస్తే జరిగిందంటూ బోరున ఏడ్చాడు కిషన్. తన ముందు మళ్లీ కనిపించొద్దంటూ పంపించేశాడు. రమ్య, రహీం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. రహీం దుబాయ్‌లో ఇంజినీర్. భార్య రమ్యకూ అక్కడే ఉద్యోగం వెతికాడు. ఇద్దరూ కలిసి దుబాయ్ వెళ్లిపోయారు.

*

కిషన్, వనజ ఇద్దరే ఇంటి వద్ద ఉంటున్నారు. అల్లారు ముద్దుగా పెంచిన పిల్లలు పెద్దోళ్లైపోయారు.. రెక్కలు వచ్చిన పక్షుల్లా ఎగిరిపోయారు. ఇంకా 20 లక్షల రూపాయల అప్పు మిగిలే ఉన్నది. షాపు సరిగా నడవడం లేదు. అప్పులోళ్లు వెంటపడుతున్నారు. వడ్డీలు కట్టడం కూడా కష్టమవుతున్నది. చేసేదేమీ లేక ఉన్న ఇల్లును అమ్మేశారు. 15 లక్షలు వస్తే అప్పుల వాళ్లకు చెల్లించారు. రూ. ఐదు లక్షలు మాత్రమే కట్టాలి. దుకాణం వెనుక ఉన్న రెండు రూములలోనే ఉంటున్నారు. ఉన్నట్టుండి కిషన్ కు హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపు తనువు విడిచాడు.

ఎవరూ లేకపోవడంతో వనజే తలకొరివి పెట్టింది. బిడ్డలెవరూ కాంటాక్ట్ లో లేరు.. ఎక్కడున్నారో తెలియదు. అంత్యక్రియలు పూర్తయ్యాయి. కంటనీరు కాలువలయ్యేలా ఏడుస్తున్నది వనజ. తనెలా బతకాలనే ఆవేదన, ఆందోళన ఎక్కువైంది. నాలుగు రోజులకే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది వనజ. బంధువులు, చుట్టుపక్కల వాళ్లు అంత్యక్రియలు నిర్వహించారు. బిడ్డల బాగుకోసం కిషన్, దంపతులు పడ్డ టెన్షన్.. వారిని ఉన్నత స్థానాలకు చేర్చేందుకు, ఉద్యోగం వస్తే బిడ్డ క్షేమంగా వస్తుందో.. రాదోనన్న అతృత.. బైక్ పై తీసుకెళ్లి డ్యూటీ అయిపోయే వరకు ఆఫీసు బయట వెయిట్ చేసిన సందర్భాలను యాది చేసుకుంటున్నారు ఆ ఊరోళ్లు.. ఆ కష్టం పగోడికి కూడా రావద్దనుకుంటున్నరు.

ఎంఎస్ఎన్ చారి

79950 47580


Next Story

Most Viewed