కామన్ మ్యాన్ డైరీ:చెప్పలేని హైదరా'బాధ'!

by Disha edit |
కామన్ మ్యాన్ డైరీ:చెప్పలేని హైదరాబాధ!
X

వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన రమేశ్ 15 ఏండ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. ఊరిలో ఉన్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేయలేక, కుటుంబంతో భాగ్యనగరం నీడకు చేరుకున్నాడు. సహజంగా జనగామ ప్రాంతంవాళ్లు జగద్గిరిగుట్టలో ఠికాణా పెడుతారు. అందరిలాగే రమేశ్ కూడా గుట్టలో వాలిపోయాడు. ఇద్దరు పిల్లలు, భార్యాభర్తలు ఉండేందుకు భూదేవి కాలనీలో ఓ సింగిల్ బెడ్ రూం ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. నెలకు రూ. 1500 అద్దె. ఎంకామ్ వరకు చదువుకున్న రమేశ్ ఇక్కడే​ఏదో ఒక ఉద్యోగం చేసుకుందామని అనుకున్నాడు. మిత్రుల సహకారంతో ఓ ఫార్మా కంపెనీలో అకౌంటెంట్‌గా చేరిపోయాడు. 8 వేల రూపాయల జీతం. బాలానగర్‌లో ఉద్యోగం. సిటీ బస్సెక్కి రోజూ డ్యూటీకి వెళ్లొచ్చేవాడు. ఆయన భార్య జ్యోతి గృహిణి. ఇంట్లో పిల్లల బాగోగులు చూసుకునేది. పెద్దమ్మాయిని రెడీ చేసి వీధిలోని స్కూలుకు పంపేది.

ఎలాంటి బాదరబందీ లేకుండా కుటుంబం సాగింది. వచ్చిన జీతంలో రమేశ్​తన తల్లిదండ్రులకు రూ. వెయ్యి పంపేవాడు. వాళ్లు మనుమడు, మనుమరాలిని చూసేందుకు నెలకోసారి గుట్టకు వచ్చిపోయేవారు. పిల్లలు పెరుగుతున్నారు. ఇద్దరు స్కూలుకు వెళ్లడం ప్రారంభించడంతో ఆర్థికంగా కొంచం ఇబ్బందైనా సర్దుకుంటున్నారు. నాలుగేండ్లు పూర్తయ్యాక రమేశ్‌కు అసిస్టెంట్ మేనేజర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. ఐదు వేలు జీతం పెంచడంతో రూ. 13 వేలకు చేరింది. పెర్ఫార్మెన్స్ నచ్చడంతో మరో ఐదు వేలు పెంచారు. మొత్తానికి 13 ఏండ్లు సర్వీసు పూర్తయ్యే నాటికి రూ.20 వేల మార్కు జీతానికి చేరుకున్నాడు.

*

అసలే పట్నం కదా? ఖర్చులు మాత్రం తడిసిమోపెడవుతున్నాయి. అమ్మానాన్నకు డబ్బులు పంపడం ఇబ్బందికరంగా మారింది. అంతలోనే కరోనా మహమ్మారి దూసుకు వచ్చింది. ఇంటి పట్టునే ఉంటున్న జ్యోతికి వైరస్ అటాక్ అయింది. హెల్త్ కార్డు లేదు. జీతం 20 వేలకు చేరినందున ఈఎస్ఐ కట్ చేసింది యాజమాన్యం. లక్ష రూపాయల చిట్టీ ఉందనే భరోసాతో తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేసి కార్పొరేట్ దవాఖానలో వైద్యం చేయించాడు. డబ్బులు చాల్లేదు. జ్యోతి నగలన్నీ అమ్మేశాడు. ఎట్టకేలకు మహమ్మారిని వదిలించుకునే సరికి మూడు లక్షల రూపాయలు ఖర్చయింది. ఇప్పుడు చేతిలో డబ్బుల్లేవ్.

జీతం వస్తేనే పూటగడిచేది. ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతినెలా కిరాణ సరుకులకు మూడు వేలు సరిపోయేవి. ఇప్పుడు ఐదు వేలు ఖర్చవుతున్నవి. దీనికి తోడు స్కూలు ఫీజులూ పెరిగాయి. పెట్రోలు రేట్లు పెరగడంతో నెలకు ఆరు వేల వరకు బైక్‌కే ఖర్చవుతున్నాయి. వచ్చే 20వేల జీతం ఏ మూలకూ చాలడం లేదు. పైగా ప్రతి నెలా కనీసం ఐదు వేల అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. డబ్బుల కోసం ఇంట్లో ప్రతి రోజూ గొడవలు జరుగుతున్నాయి. పిల్లల ఫీజులు కట్టలేదు. దీంతో వారు ఆన్‌లైన్ పాఠాలకు కూడా అనుమతించలేదు. జ్యోతి ఆరోగ్యం పూర్తిగా కుదుటపడలేదు. నగరం విడిచి ఊరెళ్లలేక, సిటీలో ఉండలేక నానా పాట్లూ పడుతున్నారు. బంధువులు, ఊరోళ్ల ముందు చులకనవుతామేమోననే భావన వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది.

*

భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకొని ఓ అంగీరానికి వచ్చారు. తాను ఏదైనా పనిచేస్తేనే గానీ సంసార సాగరాన్ని ఈదలేమని డిసైడ్ అయ్యింది జ్యోతి. డిగ్రీ వరకు చదువుకున్న ఆమె ఉద్యోగాల వేట మొదలు పెట్టింది. టీచింగ్ అనుభవం లేని కారణంగా స్కూళ్లలో తీసుకోలేదు. ప్రైవేటు ఆఫీసులు తిరిగారు. ఫలితం కలుగలేదు. ఎట్టకేలకు కూకట్ పల్లిలోని ఓ షాపింగ్ మాల్‌లో సేల్స్ గర్ల్‌గా చేరింది జ్యోతి జీతం ఏడు వేల రూపాయలు. అద్దె ఖర్చయినా వెళ్లిపోతుందనుకున్నారు. ఒక రోజు సిటీకి వచ్చిన రమేశ్​పెదనాన్న అదే షాపింగ్ మాల్‌లో ఏదో కొనేందుకు వెళ్లారు. అక్కడే పనిచేస్తున్న జ్యోతి తనను చూడకుండా జాగ్రత్త పడుతున్నది. కానీ, సరిగ్గా ఆమె ఉండే విభాగం వద్దకే ఆయన వస్తున్నాడు. మెల్లిగా అక్కడి నుంచి జారుకునేందుకు యత్నించింది. కోడలును దూరం నుంచి చూసిన ఆయన అక్కడికి రాకుండానే వెనుదిరిగాడు. హమ్మయ్యా, పెద్ద మామయ్య చూడలేదనుకున్నది జ్యోతి. విధులు ముగించుకొని ఇల్లు చేరిన జ్యోతికి సిటీకి వచ్చిన పెద్దమామయ్య దర్శనమిచ్చాడు. షాపింగ్‌కు వెళ్లాను మామయ్య, అందరూ బాగున్నారా? అని పలకరిస్తూ ఇంట్లోకి వెళ్లింది జ్యోతి. అంతలోనే రమేశ్​డ్యూటీ నుంచి ఇల్లు చేరాడు. ఆ పాటికే పిల్లలు వచ్చేశారు.

*

రమేశ్​పెద్దనాన్న రాజేందర్‌కు సంతానం లేదు. భార్యాభర్తలిద్దరే ఇంటి వద్ద ఉంటున్నారు. మూడెకరాల పొలం ఉంది. దానిని కౌలుకు ఇచ్చారు. వచ్చిన దాంతో వార్ధక్యపు జీవన నౌకను సాగిస్తున్నారు. అందరూ భోజనానికి కూర్చున్నారు. 'మీరు ఇక్కడ ఉండి ఏం సంపాదించార్రా?' అడిగాడు రాజేందర్. 'ఏంటి పెద్దనాన్న అలా అడుగుతున్నావ్?' అన్నాడు రమేశ్. 'లేదు బిడ్డా 15 ఏండ్లైతుంది. పట్నం వచ్చి జాగనో, ఇల్లో కొనుకున్నరా?' అన్నాడు రాజేందర్. 'నీకు చెప్పకుండా ఎలా కొంటాం?' రమేశ్ జవాబిచ్చాడు. 'ఊరెళ్లిపోదాం.. ఇక్కడ బతకడం మన వల్లకాదు' అన్నాడు రాజేందర్. 'మాకేమైంది పెద్దనాన్న నేను ఓ ఫేమస్ ఫార్మా కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌ను. మేం బాగానే ఉన్నాం' అన్నాడు రమేశ్. 'నాకన్నీ తెలుసురా, నాకా పిల్లలు లేరు. సిటీ సిటీ అంటూ వచ్చి మీరు పడుతున్న ఇబ్బందులన్నీచూసిన. కోడలును కూడా షాపింగ్ మాల్‌లో చూసిన. తనను ఆ యూనిఫాంలో చూస్తే గుండె తరుక్కుపోయింది. అందుకే అటువైపు వెళ్లలేదు. 'ఘర్ మే లడాయ్.. బాహర్ బడాయ్' అన్నట్టుగా 'ఊళ్లో మోతుబరిగిరీ' చేస్తూ ఇట్ల సిటీల బతుకుడు మంచిగ లేదు. బిడ్డా.. పోదాం పాండ్రి.. తమ్ముడు, మర్దలు కూడా మీరు లేక బిక్కుబిక్కు మంటూ బతుకుతుండ్రు.. మనుమడు, మనుమరాండ్లను చూసుకుంటం.. మనకేం తక్కువున్నది' అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు.

*

పెద‌నాన్న ముందు మ‌రోసారి అబ‌ద్ధం ఆడేందుకు. ఆయ‌న‌ను మాట‌ల‌తో మ‌భ్యట్టేందుకు ధైర్యం చాల‌లేదు ర‌మేశ్‌కు. ఈ ప‌దిహేనేండ్ల వ‌ల‌స జీవితంలో తానేమి కాల్పోయాడో మ‌న‌సుకు అర్థమైంది. ఈ చాలీచాల‌ని జీతాల‌తో, రోజూ చ‌స్తూ బ‌త‌క‌డం కంటే ఈ జంజాటాన్ని వ‌దిలించుకోవాల‌ని మ‌న‌సులోనే అనుకున్నాడు రమేశ్. ఊరెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాడు.

ఎమ్ఎస్ఎన్ చారి

79950 47580

Next Story

Most Viewed