లోన్ యాప్ వలన బలైన మధ్యతరగతి వ్యక్తి కథ ఈ వారం కామన్ మ్యాన్ డైరీలో

by Disha edit |
లోన్ యాప్ వలన బలైన మధ్యతరగతి వ్యక్తి కథ ఈ వారం కామన్ మ్యాన్ డైరీలో
X

అరగంట తర్వాత వాట్సాప్‌కు ఓ ఫొటో వచ్చింది. ఓపెన్ చేసి చూడగానే దిమ్మతిరిగిపోయింది యాదగిరికి. తన భార్య న్యూడ్ ఫొటో అది. ఎక్కడిది అనుకుంటూ టెన్షన్ పడ్డాడు. తన ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేసి చూశాడు. బిడ్డ బర్త్ డే ఫొటోలో నుంచి తీసిన ఫొటోలాగే ఉంది. తల మట్టుకు ఆమెది తీసుకొని బాడీ వేరే వాళ్లది తగిలించారు. కోపం చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ఆ నెంబర్ కు కాల్ చేశాడు. ఫోన్ ఎత్తిన వ్యక్తి 'నువ్వు ఫోన్ చేస్తావని తెలుసురా? చేయాలనే నీ నంబర్‌కు నీ పెళ్లాం ఫొటో పంపిన. 'ఎవరు? అరేయ్ ఎవర్రా? పోలీసులకు కంప్లయింట్ చేస్తా' అంటూ అరిచాడు యాదగిరి. 'మా పైసలు కట్టాక ఎవరికైనా కంప్లయింట్ చేసుకోరా' అంటూ అరిచాడు అవతలి వ్యక్తి. 'సాయంత్రం వరకు 35 వేలు కట్టలేదనుకో, ఇలాంటి ఫొటోలు నా దగ్గర చాలా ఉన్నాయ్. అన్నీ మీ బంధువులందరికీ పంపుతా' అంటూ గద్దించాడు.

'హాయ్, గుడ్ మార్నింగ్, యూ హేవ్ వన్ లాక్ పర్సనల్ లోన్ ఫెసిలిటీ వితౌట్ డాక్యుమెంట్స్, టు కంటిన్యూ ప్రెస్ ద లింక్' అనే మెస్సేజ్ చూసి ఎగిరి గంతేశాడు యాదగిరి. పిల్లల ఫీజులు కట్టేందుకు డబ్బుల్లేని సమయంలో ఆ దేవుడే ఈ మెస్సేజ్ పంపాడనుకొని సంబురపడిపోయాడు. లింక్‌ను క్లిక్ చేశాడు. వివరాలన్నీ ఫిల్ చేయగానే 80 వేల రూపాయలు యాదగిరి అకౌంట్‌లో క్రెడిట్ అయ్యాయి. అదేంటి లక్ష రూపాయలు అన్నారు. 80 వేలే ఇచ్చారనుకొని వెంటనే కాంటాక్ట్ నంబర్‌కు కాల్ చేశాడు.

'లోన్ లక్ష రూపాయలే, ప్రాసెసింగ్ చార్జీలు, కాషన్ డిపాజిట్ పోను మీకు 80 వేలే ఇచ్చాం' అని చెప్పారు. ప్రతి నెలా 25 వేల చొప్పున నాలుగు నెలలలో కట్టేయాలని ఆర్డర్ కూడా వేశారు. తన నెల జీతం 20 వేలైతే, 25 వేలు ఎక్కడి నుంచి కట్టాలి. సంసారం నడిపేదెలా అనుకున్నాడు యాదగిరి. 'సర్, నాకు లోన్ వద్దు వాపస్ తీసేసుకోండి.. నేను అంత కట్టలేనని' ప్రాధేయపడ్డాడు. ప్రాసెస్ అయ్యాక ఏమీ చేయలేమని విసుక్కుంటూ ఫోన్ పెట్టేశాడు లోన్ యాప్‌కు సంబంధించిన అధికారి. దిక్కుతోచని స్థితిలో పడ్డాడు యాదగిరి. ఆ డబ్బులతో పిల్లల ఫీజులైతే కట్టేశాడు.

*

యాదగిరి స్వస్థలం బీబీనగర్. పదేండ్ల క్రితం నగరానికి వలసొచ్చాడు. సంతోష్‌నగర్‌లోని ఓ అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. ఇద్దరు పిల్లలు. భార్య లత డిగ్రీ వరకు చదువుకున్నది. ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నది. అక్కడ ఏడో తరగతి వరకే ఉంది. అందుకే పిల్లలను సమీపంలోని ఓ కార్పొరేట్ స్కూలులో జాయిన్ చేశారు. యాదగిరి ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్. నెలకు రూ.20 వేల జీతం.. లతకు రూ. 10 వేల వరకు వస్తుంది. ఈ సంవత్సరమే పెద్దమ్మాయి ఎనిమిదవ తరగతిలో జాయిన్ అయ్యింది. ఏడో తరగతి చదువుతున్న చిన్న కూతురును కూడా ఆ స్కూల్‌లోనే జాయిన్ చేశారు. ఇంటి వద్ద ఆస్తులేమీ లేవు. ఉన్నది ఓ పాత ఇల్లు.. దసరా పండుగకు వెళ్లడం తప్ప అక్కడ ఉన్నది లేదు. తల్లిదండ్రులు కాలం చేశాక ఆ ఊరికి ప్రత్యేకంగా అవసరమైతే తప్ప వెళ్లడం లేదు యాదగిరి దంపతులు.

*

సోమవారం ఉదయం ఎనిమిది గంటలు. పిల్లలు, లత స్కూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. యాదగిరి స్నానం చేస్తున్నాడు. ఫోన్ ఏకధాటిగా మోగుతున్నది. ఆఫీసు నుంచేమో అనుకున్న లత ఫోన్ ఎత్తడం లేదు. 'ఎవరో ఒకసారి చూడు' అన్న భర్త అరుపు విన్న లత ఫోన్ లిఫ్ట్ చేసి 'హలో' అన్నది. అంతే, అవతలి వైపు నుంచి బూతుపురాణం మొదలైంది. 'ఏం రా పైసలు తీసుకున్నవ్, కట్టవారా' తో స్టార్టయిన సంభాషణ ఎక్కడెక్కడికో వెళ్లిపోయింది. లతకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వడం లేదు అవతలి వ్యక్తి. అంతలోనే యాదగిరి బాత్రూం నుంచి బయటకి వచ్చాడు. 'ఎవరు.. ఎవరు' అంటూ ఫోన్ తీసుకున్నాడు. 'హలో' అనగానే 'ఫోన్ పెళ్లానికి ఇచ్చి మాట్లాడిపిస్తున్నవారా? వాయిదా దాటి వారమైంది. పైసల్ కట్టలేదు' 'సర్, ఒక్క నిమిషం' 'పైసల్ కట్టనోంతోని ఏం మాటలు బే' అంటూ దబాయిస్తున్నాడు అవతలి వ్యక్తి. లత టెన్షన్ పడుతున్నది. స్కూలుకు రెడీ అవుతున్న పిల్లలు ఒక్క సారిగా సైలెంటై పోయారు. అందరూ యాదగిరినే చూస్తున్నారు. ఫోన్‌లో అవతలి వ్యక్తి తిట్టే తిట్లు స్పష్టంగా వినిపిస్తున్నాయి. 'సర్, రెండు రోజులలో పే చేస్తాను' అంటూ ఫోన్ కట్ చేశాడు యాదగిరి.

*

'ఎవరు వాళ్లు? ఎంత తీసుకున్నావ్? ఆ బూతులేంటి ? ఇప్పటి వరకు ఎవరితోనూ మాటపడలేదు. నోటికొచ్చినట్టు వాగుతున్నడు' అంటూ కన్నీరు పెట్టుకుంది లత. ఎందుకు తీసుకున్నవ్? పిల్లల ఫీజులకు పైసలంటే అదంతా నేను చూసుకుంటా అన్నవ్, అందుకోసమే లోన్ తీసుకున్నవా? చెప్పు చెప్పు' అంటూ నిలదీసింది లత. ఔనంటూ తలూపాడు యాదగిరి. పిల్లలిద్దరూ తండ్రి ముఖాన్నే తదేకంగా చూస్తున్నారు. యాదగిరి ముఖంలో ఎప్పుడూ లేనంత ఆందోళన కనిపిస్తోంది. మీరైతే స్కూలుకు వెళ్లండి అంటూ వాళ్లను పంపించేశాడు. ఎలాగోలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయమే ఫోన్ మోగింది. స్పామ్ కాల్ అని ట్రూ కాలర్ లో రావడంతో ఫోన్ ఎత్తలేదు యాదగిరి.

అరగంట తర్వాత వాట్సాప్‌కు ఓ ఫొటో వచ్చింది. ఓపెన్ చేసి చూడగానే దిమ్మతిరిగిపోయింది యాదగిరికి. తన భార్య న్యూడ్ ఫొటో అది. ఎక్కడిది అనుకుంటూ టెన్షన్ పడ్డాడు. తన ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేసి చూశాడు. బిడ్డ బర్త్ డే ఫొటోలో నుంచి తీసిన ఫొటోలాగే ఉంది. తల మట్టుకు ఆమెది తీసుకొని బాడీ వేరే వాళ్లది తగిలించారు. కోపం చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ఆ నెంబర్ కు కాల్ చేశాడు. ఫోన్ ఎత్తిన వ్యక్తి 'నువ్వు ఫోన్ చేస్తావని తెలుసురా? చేయాలనే నీ నంబర్‌కు నీ పెళ్లాం ఫొటో పంపిన. 'ఎవరు? అరేయ్ ఎవర్రా? పోలీసులకు కంప్లయింట్ చేస్తా' అంటూ అరిచాడు యాదగిరి. 'మా పైసలు కట్టాక ఎవరికైనా కంప్లయింట్ చేసుకోరా' అంటూ అరిచాడు అవతలి వ్యక్తి. 'సాయంత్రం వరకు 35 వేలు కట్టలేదనుకో, ఇలాంటి ఫొటోలు నా దగ్గర చాలా ఉన్నాయ్. అన్నీ మీ బంధువులందరికీ పంపుతా' అంటూ గద్దించాడు.

*

'నేను కట్టాల్సింది 25 వేలే కదా?' అన్నాడు యాదగిరి. 'అది పది రోజుల ముందు. ఇప్పుడు రోజుకు వెయ్యి రూపాయలు ఫైన్ వేశాం. అందుకే 35 వేలు కట్టాలి. రేపటి నుంచి రూ. రెండు వేల ఫైన్ వేస్తాం. ఈ ఫొటోలను అందరికీ పంపుతాం. సోషల్ మీడియాలోనూ అప్‌లోడ్ చేస్తాం' అంటూ బెదిరించసాగాడు. 'విషయం బయటకు తెలిస్తే తన పరువు బజారున పడుతుంది. ఫొటోను తన భార్య చూస్తే ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడుతుందో' అంటూ టెన్షన్ పడుతున్నాడు యాదగిరి. తను బయటకు వచ్చినందున ఎవరితో మాట్లాడారనేది ఇంట్లో వాళ్లకు తెలియలేదు.

పిల్లలు, లత స్కూలుకు వెళ్లిపోయారు. యాదగిరి గుండెలలో రైళ్లు పరిగెడుతున్నాయి. క్షణాలు మంచుగడ్డలా కరిగిపోతున్నాయి. ఆఫీసుకు బయల్దేరాడు. వేగంగా బండి నడుపుతున్నాడు. ట్రాఫిక్ సిగ్నల్ పడింది. ఆలోచనలో పడి గమనించ లేదు. కుడి పక్క నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొని యాదగిరి అక్కడిక్కడే చనిపోయాడు. బైక్ రెండు ముక్కలైంది. మొబైల్ ఆధారంగా పోలీసులు విషయాన్ని లతకు చెప్పారు. స్కూల్ స్టాఫ్‌తో కలిసి ఆస్పత్రికి చేరుకుంది లత. పిల్లలు, తల్లి బోరున రోదిస్తున్నారు. అక్కడికి వచ్చిన ఎస్‌ఐ కాళ్ల మీద పడి ఏడ్చింది లత.' పిల్లల ఫీజుల కోసం అదేదో లోన్ యాప్‌ల 80 వేలు తీసుకున్నడు సార్, వాళ్ల వేధింపులే నా భర్త ప్రాణం తీశాయి. మీరే వాళ్ల సంగతి చూడాలి' అంటూ ప్రాధేయపడింది. పోస్టుమార్టం చేసి శవాన్ని అప్పగించారు. లత నుంచి కంప్లయింట్ తీసుకొని లోన్ యాప్‌పై కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎంఎస్ఎన్ చారి

79950 47580


Next Story

Most Viewed