- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖరీఫ్‌లో ప్రత్యామ్నాయ పంటలు కలే..! ఆ మూడు పంటల సాగుకే రైతుల మొగ్గు
మార్కెటింగ్ లోపం, దళారుల దోపిడీ, కోతుల బెడదతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు తెలంగాణ రైతులు దూరం అవుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఖరీఫ్‌లో రైతులు వరి, పత్తి, మొక్కజొన్న పంటల సాగుకే మొగ్గు చూపారు. వర్షాలు ఆశించిన స్థాయిలో కురిసే పరిస్థితి లేదని, ఆరుతడి పంటలే వేయాలని వ్యవసాయ శాఖ సూచనలు చేసినా రైతులు పట్టించుకోలేదు. పాత పద్ధతిలోనే వరి, పత్తి పంటలనే అధికంగా సాగు చేసినట్టు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ప్రత్యామ్నాయ పంటలైన పండ్లు, కూరగాయలు, పూల తోటలు, ఆయిల్‌పామ్, నూనెగింజలు, పప్పుధాన్యాలు, చిరు ధాన్యాలు, ఇతర వాణిజ్య పంటలే వేయాలని ఊరురా ప్రచారం చేసినా రైతులు కొత్త రకం పంటల సాగుకు వెనకడుగు వేస్తున్నారు. వరి, పత్తి, మొక్కజొన్నను అమ్ముకోవడానికి కేంద్రం మార్కెట్సౌకర్యంతో పాటు మద్దతు ధర ప్రకటించి, కొనుగోలు కేంద్రాలను సైతం ఏర్పాటు చేస్తోంది. కానీ ప్రత్యామ్నాయ పంటలు అమ్ముకోవడానికి సరైన మార్కెట్సౌకర్యం లేదు. దళారుల దోపిడీ, కనీస మద్దతు లేకపోవడం అతిపెద్ద సమస్యగా మారింది. దీంతో ఎలాంటి సమస్య లేకుండా సాఫీగా అమ్మకాలు జరిగే వరి, పత్తి, మక్కల సాగుకే రైతులు ఆసక్తి చూపుతున్నారు.
కేవలం 45 శాతమే..
వ్యవసాయ శాఖ ఈ ఖరీప్‌సీజన్‌లో 132 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అవుతాయని అంచనా వేస్తే ఇప్పటివరకు 59.83 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటల సాగు జరిగింది. అందులో పత్తి పంట అత్యధికంగా 41.12 లక్షల ఎకరాలు వేయగా, 6.40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. జులై నెలాఖరు నాటికి మరో 5 లక్షల ఎకరాల్లో నాట్లు వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. మక్కలు, కందితో పాటు ఇతర పంటను 12 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ శాఖ ఆశించిన దాంట్లో కేవలం 45 శాతం మాత్రమే పంటలు వేశారు.
ప్రచారం పట్టించుకోలే..
కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు మండలాల వారీగా ఆరుతడి పంటల సాగుపై రైతులను చైతన్య పరుస్తున్నారు. అయినా ఆరుతడి పంటలు పండిస్తే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో లేదోనన్న భయం కూడా రైతాంగాన్ని వెంటాడుతున్నది. ఈ సీజన్‌లో వ్యవసాయం చేయకపోయినా పర్వలేదు. ఆలస్యంగానైనా వర్షాలు పడి ప్రాజెక్టుల్లో నీరు ఉంటే యాసంగిలోనైనా పటం సాగు చేసుకోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు అక్కడక్కడా తొలకరి వర్షానికి నాటిన పత్తి మొలకలు వాడిపోతున్నాయి. వీలైనంత త్వరగా వర్షాలు కురిస్తే తప్ప పప్పు ధాన్యాల సాగుకు రైతులు ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఆరుతడి పంటలు వేస్తే మధ్యలో వానలు రాకుంటే పూర్తిగా ఎండిపోతాయని, పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోవాల్సి వస్తోందని భయపడుతున్నారు. ప్రభుత్వం పంట బీమా అమలు చేస్తే పండ్లు, కూరగాయలు, పూల తోటలు వేసేందుకు రైతాంగం ముందుకొచ్చే పరిస్థితి ఉంది. మరోవైపు కోతుల బెడద తెలంగాణలో పెద్ద సమస్యగా మారింది. వాటి భయానికి రైతులు పండ్లు, కూరగాయలను సాగు చేయడానికి భయపడుతున్నారు. వాటిని అదుపు చేసేందుకు పొలం చుట్టూ సోలార్ఫెన్సింగ్వేస్తే సరిపోతుందని, అందుకోసం రాయితీపై పంపిణీ చేస్తామని ఉద్యానశాఖ చెప్పినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు.
గణనీయంగా పెరిగిన వరి..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వరి పంట సాగు గణనీయంగా పెరిగింది. 12 ఏళ్ల క్రితం 49.28 లక్షలు సాగైన వరి.. ప్రస్తుతం రెండు సీజన్‌లలో కలిపి 127 లక్షల ఎకరాలకు పెరిగింది. పత్తి 51 లక్షల ఎకరాల నుంచి 65 లక్షల ఎకరాలు దాటింది. పండ్ల తోటలు 9.11 లక్షల ఎకరాల నుంచి 4.48 లక్షల ఎకరాలకు పడిపోయాయి. కూరగాయల సాగు 5.52 లక్షల నుంచి 1.02 లక్షల ఎకరాలకు తగ్గింది. పూల తోటలు 17,220 నుంచి 6248 ఎకరాలు, పసుపు 1.52 లక్షల ఎకరాల నుంచి 42,246 ఎకరాలు, పప్పు ధాన్యాలు 10.20 లక్షల నుంచి 8.83 లక్షల ఎకరాలు, నూనె గింజలు 12.41 లక్షల ఎకరాల నుంచి 7.13 లక్షల ఎకరాలు, చిరు ధాన్యాలు 19.58 లక్షల నుంచి 18.84 లక్షల ఎకరాలకు చేరింది. ఉద్యాన పంటలు 19.82 లక్షల ఎకరాల నుంచి 12.46లక్షల ఎకరాలకు పడిపోయింది. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం ఆరుతడి పంటలపై ప్రత్యేక దృష్టి సారించి, రైతులకు పలు రకాల రాయితీలు, పంటలపై వ్యవసాయ శాఖ అధికారులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తేనే రైతులు ప్రత్యామ్నాయ పంట వైపు ఆకర్షితులవుతారని రైతు సంఘాలు చెబుతున్నాయి.






