విభజన హామీలపై తెలంగాణ పోరు.. కేంద్రంపై రేవంత్ సర్కార్ దండయాత్ర!

by Kema Shiva Kumar |

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా కేంద్రం వద్ద 11 శాఖల పరిధిలో 49 తెలంగాణ అంశాలు పెండింగ్‌లోనే ఉన్నాయి.

విభజన హామీలపై తెలంగాణ పోరు.. కేంద్రంపై రేవంత్ సర్కార్ దండయాత్ర!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లయినా నేటివరకు విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. దీనికి తోడు మరిన్ని సమస్యలు రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయి. అయితే, నేటి నుంచి పార్లమెంట్​సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లోనైనా తెలంగాణకు సంబంధించిన కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా? అనే చర్చ మరోసారి మొదలైంది. కేంద్రం వద్ద రాష్ట్రం ప్రతిపాదించిన అనేక అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. పార్లమెంట్​సమావేశాల్లో ఈ అంశాలపై నిలదీయడానికి రాష్ట్రంలోని అఖిలపక్ష ఎంపీలతో సీఎం రేవంత్​ఇప్పటికే సమావేశం నిర్వహించారు. కేంద్రం వద్దనున్న పెండింగ్ అంశాలు, వాటి వివరాలన్నింటినీ ఎంపీలకు వివరించారు. ఇంకేదైనా వివరాలు అందించడానికి ప్రత్యేకంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్రం తరఫున ప్రత్యేక అధికారిని అందుబాటులో ఉంచనున్నట్టు ఇప్పటికే సీఎం ప్రకటించారు. ఇందుమూలంగా గతంలో కంటే ప్రభుత్వ సమాచారం ఎంపీలకు సులువుగా లభ్యం కానుంది. కేంద్రం వద్ద రాష్ట్రానికి సంబంధించి 11 శాఖల పరిధిలో 49 అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని సీఎం.. ఎంపీలకు వివరించారు. అత్యధికంగా విద్యుత్, సింగరేణిలకు సంబంధించిన అంశాలే పెండింగ్‌లో ఉన్నట్టు పేర్కొన్నారు.

మెట్రో సెకండ్ ఫేజ్‌కు అనుమతి?

అలాగే.. మెట్రో రెండోదశకు రావాల్సిన అనుమతి గురించి తెలిపారు. మొదటి దశ అంచనా వ్యయాన్ని పరిశీలించి నివేదిక ఇచ్చిన తరువాత రెండో దశకు ముహూర్తం ఖరారు కానుంది. ఈ పనులు నెమ్మెదిగా జరుగుతున్నాయని ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్​సమావేశాలు పూర్తయ్యేలోగా కమిటీ ఏర్పాటు చేసి అంచనాలను ప్రారంభించాలని కోరుతున్నారు. రెండోదశలో మొత్తం 123 కి.మీ. మేర కేంద్రం అనుమతి ఇవ్వాల్సి ఉంది. మూసీ పునరుజ్జీవానికి కేంద్రం ఇప్పటికే రక్షణశాఖ భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్టు అయ్యే వ్యయంలో 60 శాతం గ్రాంట్​రూపంలో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. హైదరాబాద్​సీవరేజీ ప్రాజెక్టుకు రూ.17,212 కోట్ల సాయం అందించాని కోరింది. సీఎం రేవంత్​ 2024 అక్టోబరు 6న ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు. ఆ తర్వాత ఆర్‌అండ్ బీ, మున్సిపల్, వ్యవసాయం, ఆర్థిఖ శాఖలకు సంబంధించిన అంశాలు సైతం పెండింగులో ఉన్నాయని.. ఎంపీలకు వివరించారు. దీనిలో ప్రధానంగా ఆర్ఆర్ఆర్ 350 కి.మీ. మేర నిర్మాణం చేపట్టాల్సి ఉండగా.. దీనికి అనుమతి రావాల్సి ఉంది. నిర్మాణానికి రూ.34,367 కోట్లు అవసరం అవుతాయని కేంద్రానికి రాష్ట్ర సర్కారు తెలిపింది. ఉత్తరభాగానికి సంబంధించి 1,918 హెక్టార్ల భూమి అవసరం కాగా ఇందులో 1,833 హెక్టార్ల భూమిని ఇప్పటికే సేకరించారు. దక్షణ భాగానికి ఆమోదం లభిస్తే త్వరగా భూసేకరణ పూర్తి చేస్తామని రాష్ట్రం ఇప్పటికే కేంద్రానికి విన్నవించింది.

హైవేలు, ఎయిర్‌పోర్టులు..

హైదరాబాద్​ నుంచి బందర్ పోర్ట్​వరకు గ్రీన్​ఫీల్డ్​హైవే‌ను మంజూరు చేయాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ ఇటీవల కోరారు. అందుకోసం ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్లి పలువురు కేంద్రమంత్రులను కలిశారు. సీఎం కోరిన అంశాలకు ప్రాథమిక ఆమోదం లభించింది. కానీ, కేంద్ర కేబినెట్ ఆమోదించాల్సి ఉంది. దాని నిర్మాణానికి రూ.17వేల కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. హైదరాబాద్- విజయవాడ హైవేకు సమాంతరంగా మరొక జాతీయ రహదారి అవసరమని, ఈ నేపథ్యంలో బందర్​వరకు గ్రీన్ ఫీల్డ్​ హైవేను మంజూరు చేయాలని రాష్ట్ర సర్కారు కోరింది. వరంగల్‌, ఆదిలాబాద్‌తో పాటు పాల్వంచ, పెద్దపల్లి జిల్లా బసంత్​నగర్ వద్ద ఎయిర్ పోర్టులు నిర్మించాలని రేవంత్ సర్కార్ కేంద్రానికి ప్రతిపాదనలు చేసింది. త్వరగా వీటిని మంజూరు చేయాలని ఇప్పటికే కోరింది. అలాగే.. రైల్వే లైన్​కనెక్టివిటీని పెంచాలని రిక్వెస్ట్ చేసింది. బోధన్-లాతూరు 128కి.మీ. రైల్వే లైన్‌పై ఇప్పటికే 2025 సెప్టెంబర్ 29న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా ఎన్ని నిధులను భరిస్తుందో తెలపాలని రైల్వేశాఖ 2025 డిసెంబర్‌లో 29న రాష్ట్రాన్ని కోరింది. అందుకు రాష్ట్రం కూడా బదులిచ్చింది. అలాగే.. పటాన్​చెరువు నుంచి ఆదిలాబాద్ వరకు 320 కి.మీ, కాచిగూడ నుంచి జగ్గయ్యపేట వరకు 250 కి.మీ, గద్వాల నుంచి డోర్నకల్ వరకు, కల్వకుర్తి నుంచి మాచర్ల 120 కి.మీ, వికారాబాద్​నుంచి కృష్ణావరకు 122 కిలోమీటర్లు, ఆర్ఆర్ఆర్ చుట్టూ రైల్వే కనెక్టివిటీ కోసం సీఎం రేవంత్ కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించారు. ఆ పనులు త్వరితగతిన ప్రారంభించి పూర్తిచేయాలని ఆయన కోరారు.

ఫండ్స్ పంచాయితీ..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 12 ఏళ్లు గడిచాయి. అయినప్పటికీ రాష్ట్ర విభజన సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదు. రూ. వేల కోట్ల నిధులు బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. వివాదాలు పరిష్కారం అయితే ఈ నిధులను రాష్ట్ర ప్రజలు,ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా వాడుకునే చాన్స్​ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కానీ కేంద్రం చొరవ చూపకపోవడం, ఇరు రాష్ట్రాలు ఎవరికి వారు మొండిగా వ్యవహరిస్తుండటంతో పరిష్కారం దొరకడం లేదు. దీంతో పాటు కేంద్రం విభజన చట్టంలో పేర్కొన్న హామీలను సైతం అమలు చేయడంలేదని రేవంత్ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని సైతం కేంద్రం మంజూరు చేయలేదని, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం భవన శాశ్వత నిర్మాణ పనులు ముందుకుసాగడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేడియల్​రోడ్ల కోసం రూ.45 వేల కోట్లు ఇవ్వాలని మోడీ సర్కారును రాష్ట్ర ప్రభుత్వం కోరింది. గోదావరి మూసీ లింక్ ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో 25 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వ అర్బన్​చాలెజింగ్​ఫండ్​నుంచి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. అలాగే.. రాష్ట్రంలో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఐఐఎం మంజూరు చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. పీఎం ఆవాస్​యోజన కింద 11 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతున్న విషయం తెలిసిందే.

Next Story