- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మ ఒంటరి అవుతుందన్న ఆవేదన.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలవన్మరణం
తాను పెళ్లి చేసుకుంటే ఎక్కడ తన తల్లి ఒంటరిదైపోతుంది.. తనను చూసుకునేవారెవరనే అమాయకపు ఆలోచన ఓ ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువతిని బలితీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తాను పెళ్లి చేసుకుంటే ఎక్కడ తన తల్లి ఒంటరిదైపోతుంది.. తనను చూసుకునేవారెవరనే అమాయకపు ఆలోచన ఓ ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువతిని బలితీసుకుంది. హుస్సేన్ సాగర్ (Hussain Sagar)లో దూకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయలక్ష్మి (Vijaya Lakshmi) ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే... ఆదిలాబాద్ జిల్లా భైంసా (Bhainsa)కు చెందిన విజయలక్ష్మి (26) తన తల్లితో కలిసి కూకట్‌పల్లిలోని మోతినగర్ (Motinagar)లో నివాసం ఉంటోంది. తండ్రి మరణించడంతో తల్లికి తానై సర్వస్వంగా ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో రూ.లక్ష జీతంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. తల్లి అనారోగ్యంతో ఉండటంతో విజయలక్ష్మి ఆమెను కంటికిరెప్పలా చూసుకునేది. ఈ క్రమంలో బంధువులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అయితే వచ్చిన వారికి వివాహం అయ్యాక తల్లి కూడా తనతో పాటే ఉంటుందని కండీషన్ పెట్టడంతో ఒక్క సంబంధం కూడా ఖాయం కావడం లేదు.
గూగుల్ సెర్చ్ హిస్టరీ చూసి పోలీసులు షాక్..
తాను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే అనారోగ్యంతో ఉన్న తల్లి ఒంటరై పోతుందని విజయలక్ష్మి తీవ్ర మనస్తాపానికి గురైంది. గత కొన్ని రోజులుగా ఈ విషయంపై ఆమె తీవ్రంగా మదనపడేదని బంధువులు తెలిపారు. ఆ ఆందోళనలోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. పోలీసులు ఆమె ల్యాప్‌టాప్‌ను పరిశీలించగా ఆత్మహత్య ఎలా చేసుకోవాలని గూగుల్ (Google)లో సెర్చ్ చేసినట్లుగా తేలింది. ఈ మేరకు గత నెల 31న విజయలక్ష్మి ఓ ర్యాపిడో బైక్‌ను బుక్ చేసుకుని ట్యాంక్‌బండ్ చేరుకుంది. అక్కడ అన్నమయ్య విగ్రహం వద్ద దిగి ఎవరూ గమనించని సమయంలో హుస్సేన్‌సాగర్‌లో దూకేసింది. అప్పటి నుంచి ఆమె కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తాజాగా హుస్సేన్ సాగర్‌లో ఓ మృతదేహం లభ్యమైంది. బంధువుల సాయంతో అది విజయలక్ష్మిదేనని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.






