సంగారెడ్డి జిల్లాలో ఘోరం: ASIపైకి దూసుకెళ్లిన పోలీసు వాహనం

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-14 03:16:16  IST  )

పోలీసు శాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పీఎస్ ఎదుటే ఏఎస్‌ఐ గోవింద్ నాయక్‌పైకి దూసుకెళ్లిన పోలీసు వాహనం దూసుకెళ్లగా ఆయన అక్కడికక్కడే మృతిచెందారు.

సంగారెడ్డి జిల్లాలో ఘోరం: ASIపైకి దూసుకెళ్లిన పోలీసు వాహనం
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి (Sanga Reddy) జిల్లాలోని మానూర్ (Manoor) పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఏఎస్‌ఐ గోవింద్ నాయక్‌ (ASI Govind Nayak)ను పోలీసు వాహనమే బలితీసుకుంది. స్టేషన్ ముందు ఆయన నిలబడి ఉన్న సమయంలో పోలీసు వాహనం ఒక్కసారిగా ఆయనపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం మానూర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఏఎస్‌ఐ గోవింద్ నాయక్ తన విధుల్లో భాగంగా ఉండగా, హోంగార్డు రామారావు (Rama Rao) నడుపుతున్న పోలీసు వాహనం నియంత్రణ కోల్పోయి నేరుగా ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోవింద్ నాయక్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే తోటి సిబ్బంది ఆయనను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

పరారీలో హోంగార్డు రామారావు..

ప్రమాదం జరిగిన వెంటనే వాహనం నడుపుతున్న హోంగార్డు రామారావు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే, ఇది కేవలం ప్రమాదం కాదని, పాత కక్షల నేపథ్యంలోనే హోంగార్డు రామారావు కావాలని ఏఎస్‌ఐ (ASI)పైకి వాహనాన్ని ఎక్కించాడని బాధితుడి కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. హోంగార్డు కావాలనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత శాఖలోనే ఒక అధికారి ఇలా మృతి చెందడం స్థానిక పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలంలోనే ప్రాథమిక విచారణ చేపడుతున్నారు. పరారీలో ఉన్న హోంగార్డు రామారావు కోసం గాలింపును ప్రారంభించారు.

జార్ఖండ్‌లో ఎక్సైజ్ కానిస్టేబుల్ పేపర్ లీక్.. భారీ కుట్రను ఛేదించిన పోలీసులు

Next Story