లిక్కర్ స్కామ్‌లో హాట్‌టాపిక్‌గా సికింద్రాబాద్.. కథ అంతా నడిచేది ఆ కాంప్లెక్స్‌లోనే!

by Disha Web Desk 2 |
లిక్కర్ స్కామ్‌లో హాట్‌టాపిక్‌గా సికింద్రాబాద్.. కథ అంతా నడిచేది ఆ కాంప్లెక్స్‌లోనే!
X

సికింద్రాబాద్‌లోని నవకేతన్ కాంప్లెక్స్.. షాప్ నంబర్ 120‌‌–128 ఈ ఒక్క అడ్రస్‌తో నాలుగు కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. బ్యూటీ పార్లర్ మొదలు లిక్కర్, మైనింగ్ దాకా అన్నింటికీ ఇదే కేరాఫ్..! ఈ కంపెనీలన్నింటిలోనూ డైరెక్టర్లు, భాగస్వాములుగా ఉన్నవారంతా ఒక్కటే! ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు దర్యాప్తు రాష్ట్రంలో మరోమారు కాకరేపింది. ఈ కేసులో ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాని బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అధికారులు అరెస్టు చేయడం, మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకోవడంతో ఇంకా ఎవరెవరి పేర్లు తెరమీదకు వస్తాయో..? అన్న గుబులు నిందితుల్లో మొదలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఊహకు అందని రీతిలో కొత్త వ్యక్తుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. సీబీఐ ఎఫ్ఐఆర్‌లో పేర్లు నమోదుకాని బోయినపల్లి అభిషేక్‌ను అరెస్టు చేయడం కలకలం రేపింది. ఎఫ్ఐఆర్‌లో పేరు లేకపోయినా సీబీఐ కస్టడీకి తీసుకోవడంతో ఈ కంపెనీలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్నవారికి టెన్షన్ పట్టుకున్నది. తదుపరి టార్గెట్ ఎవరనే చర్చ రాష్ట్రంలో మొదలైంది. సికింద్రాబాద్‌లోని నవకేతన్ కాంప్లెక్స్ అడ్రస్‌తో రిజిస్టర్ అయిన పలు కంపెనీలకు అభిషేక్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఒకే అడ్రస్ మీద పలు కంపెనీలు రిజిస్టర్ కావడం ఈడీ దర్యాప్తు బృందాలకు విస్మయం కలిగించింది. బ్యూటీ పార్లర్ తరహా కంపెనీల మొదలు లిక్కర్, శాండ్, మైనింగ్, రియల్ ఎస్టేట్.. ఇలాంటివన్నీ ఒకే అడ్రస్‌తో రిజిస్టర్ కావడం గమనార్హం. ఇలాంటి కొన్ని కంపెనీల్లో డైరెక్టర్లూ, వ్యాపార భాగస్వాములూ వారే ఉండటం విశేషం.

కేరాఫ్ నవకేతన్ కాంప్లెక్స్!

మద్యం కుంభకోణంలో 14వ నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్ ని తొలుత ఈడీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. తాజాగా బోయిన్‌పల్లి అభిషేక్‌ను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ ప్రస్తుతం విచారిస్తున్నది. సికింద్రాబాద్‌లోని నవకేతన్ కాంప్లెక్స్ లోని షాప్ నెం. 120-128 అడ్రస్‌తో నాలుగు కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. అనూస్ ఎలక్ట్రోలైసిస్ అండ్ ఒబెసిటీ ప్రైవేట్ లిమిటెడ్, అగస్తి వెంచర్స్ ఎల్ఎల్‌పీ, మాస్టర్ శాండ్ ఎల్ఎల్‌పీ, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్‌పీ ఈ అడ్రస్‌తోనే రిజిస్టర్ అయ్యాయి. ఈ నాలుగింటిలోనూ బోయిన్‌పల్లి అభిషేక్ డైరెక్టర్‌గా, వ్యాపార భాగస్వామిగా ఉన్నారు. 1993 ఆగస్టులో అనూస్ ఎలక్ర్టోలైసిస్ అండ్ ఒబెసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఈ అడ్రస్‌తోనే చేప్యాల అనురాధ, పొల్సాని అన్నపూర్ణ, తకళ్లపల్లి అనుపమ రిజిస్టర్ చేశారు. 1999 నవంబరు నుంచి వీరు డైరెక్టర్లుగా ఉన్నారు. రెండు దశాబ్దాలకు పైగా కంపెనీని నడిపిన ముగ్గురు సిస్టర్స్ 2020 జూన్‌లో ఒకేసారి తప్పుకున్నారు. వారి స్థానంలో బోయిన్‌పల్లి అభిషేక్, తక్కళ్లపల్లి లుపిన్ డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం వీరిద్దరే ఆ కంపెనీలో డైరెక్టర్లుగా కంటిన్యూ అవుతున్నారు.

సికింద్రాబాద్‌లోని నవకేతన్ కాంప్లెక్స్ అడ్రస్‌తో రాబిన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ ఏడాది జూలై 12న రిజిస్టర్ అయింది. ఇందులో అభిషేక్, అరుణ్ రామచంద్రన్ పిళ్ళై డైరెక్టర్లు. ఇదే అడ్రస్‌తో రిజిస్టర్ అయిన మాస్టర్ శాండ్ కంపెనీలో అభిషేక్‌తో పాటు కొల్లి అభినయ్ రెడ్డి, బోయిన్‌పల్లి అనూష, రోహన్ సుభాష్ దేశ్‌ముఖ్‌ డైరెక్టర్లు. అగస్తి వెంచర్స్ కంపెనీలో అభిషేక్, అభినయ్‌రెడ్డి, తక్కళ్ళపల్లి లుపిన్ డైరెక్టర్‌లు. అనూస్ ఎలక్ట్రోలైసిస్ కంపెనీలోనూ అభిషేక్, లుపిన్‌లే డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ ఐదారుగురు వ్యక్తులే నవకేతన్ కాంప్లెక్స్ అడ్రస్‌తో రిజిస్టర్ అయిన కంపెనీలను నిర్వహిస్తున్నారు. కొత్తగా ఇంకెన్ని కంపెనీలు ప్రాసెస్‌లో ఉన్నాయో, గతంలో రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకుని 'స్ట్రైక్ ఆఫ్' అయ్యాయో ఈడీ ఆరా తీస్తున్నది. ఒకే స్కామ్‌‌కు సంబంధించి నెల రోజుల వ్యవధిలో నాలుగుసార్లు ఈడీ టీమ్‌లు సోదాలు చేసింది. విచారణకు పిలిచి ప్రశ్నల వర్షం కురిపించింది. ఆఫీసులు-ఇండ్ల నుంచి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నది. వారి మొబైల్, లాప్‌టాప్, హార్డ్ డిస్కు లాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లోని సమాచారాన్ని సేకరించింది. ఏకకాలంలో సీబీఐ, ఈడీ దర్యాప్తు ముమ్మరంగా జరుగుతున్నది.

వ్యాపార బంధం బలపడిందిలా..

బోయిన్‌పల్లి అభిషేక్, తక్కళ్లపల్లి లుపిన్, కొల్లి అభినయ్ తదితరులందరి మధ్య వ్యాపార బంధం ఉన్నది. అభిషేక్ మొత్తం తొమ్మిది కంపెనీలకు డైరెక్టర్‌గా ఉంటే అభినయ్‌రెడ్డి నాలుగు కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నారు. అభినయ్ రెడ్డి నాలుగు కంపెనీల్లో రెండు (మాస్టర్ శాండ్, ఆగస్తి వెంచర్స్) నవకేతన్ కాంప్లెక్స్ అడ్రస్‌తోనే రిజిస్టర్ అయ్యాయి. మరో రెండు కంపెనీలు (క్రిస్టల్ లగ్జరీ, పర్ సాఫ్ట్ అసోసియేట్స్) జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 9 నుంచి రిజిస్టర్ అయ్యాయి. తక్కళ్లపల్లి లుపిన్ మూడు కంపెనీలకు డైరెక్టర్‌గా ఉంటే అందులో రెండు (అనూస్ ఎలక్ట్రోలైసిస్, అగస్తి వెంచర్స్) నవకేతన్ కాంప్లెక్స్ చిరునామాతోనే రిజిస్టర్ అయ్యాయి. మరొకటి (అనూస్ హెల్త్ అండ్ వెల్‌నెస్ ప్రైవేట్ లిమిటెడ్) సోమాజిగూడ సంగీత్ నగర్ అడ్రస్‌తో రిజిస్టర్ అయింది.

అనూస్ లింక్!

అనూస్ బ్యూటీ పార్లర్ పేరుతో 1980వ దశకం నుంచి ఉనికిలో ఉన్నా 1993లో అనూస్ ఎలక్ట్రోలైసిస్ అండ్ ఒబెసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ అయింది. ఇందులో అన్నపూర్ణ, అనురాధ, అనుమప కీలక భూమిక పోషించారు. ఈ ముగ్గురూ 1999 జూన్ 18 నుంచి డైరెక్టర్లుగా ఉంటూ 2020 జూన్ 20న ఒకేసారి బయటికి వెళ్లిపోయారు. దీనికి ఐదు రోజుల ముందే అభిషేక్, అభినయ్‌రెడ్డి డైరెక్టర్లుగా ప్రవేశించారు. ఇంకోవైపు అనూస్ కంపెనీ క్లిక్ కావడంతో 2009లో అనూస్ హెల్త్ అండ్ వెల్‌‌నెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బంజారాహిల్స్ అడ్రస్‌తో ముగ్గురు అనూ సిస్టర్స్ మరో కంపెనీని నెలకొల్పారు. ఈ ఏడాది మార్చి నెల వరకూ వీరు డైరెక్టర్లుగానే కొనసాగారు. మార్చి 26న వీరు బాధ్యతల నుంచి తప్పుకోగా, దీనికి మూడు వారాల ముందే అనురాధ కుమారుడు అభిషేక్, తక్కళ్ళపల్లి లుపిన్ డైరెక్టర్లు అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గతడాది ద్వితీయార్ధంలో వెలుగులోకి వచ్చినా సీబీఐ గుట్టుచప్పుడు కాకుండా దర్యాప్తు జరిపింది. నాలుగైదు నెలల క్రితమే మీడియాలో చర్చలకు దారితీసినా జూలైలో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఢిల్లీకి-తెలంగాణకు ఉన్న సంబంధం వెలుగులోకి వచ్చింది. అనూస్ హెల్త్ అండ్ వెల్‌నెస్ కంపెనీ నుంచి ముగ్గురు అనూ సిస్టర్స్ తప్పుకోవడం, వారి స్థానంలో అభిషేక్, లుపిన్ చేరడం వెనక ఉన్న కారణం ఇప్పుడు ఈడీ అధికారులకు ఆసక్తి పుట్టించింది. లిక్కర్ స్కామ్‌లో రామచంద్రన్ పిళ్లైతో మొదలైన సీబీఐ, ఈడీ దర్యాప్తు ఇప్పుడు ఆయనతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యాపార సంబంధాల్లో ఉన్నవారిదాకా పాకింది. అభిషేక్ అరెస్టు తర్వాత ఆయనతో బిజినెస్ సంబంధాలు ఉన్నవారిలో ఎవరు సీబీఐ, ఈడీలకు టార్గెట్ అవుతారనేది కూడా సంచలనంగా మారింది.

ఎవరీ బోయిన్‌పల్లి అభిషేక్‌రావు?

హైదరాబాద్ నగరంలో 1980వ దశకం ప్రారంభంలో అనూస్ బ్యూటీ పార్లర్ పేరుతో ముగ్గురు 'అను' సిస్టర్స్ వ్యాపారం ప్రారంభించారు. అందులో ఒకరు చేప్యాల అనురాధ. ఈమె కుమారుడే బోయిన్‌పల్లి అభిషేక్‌రావు. తెలంగాణలో తోటపల్లి గాంధీగా గుర్తింపు పొందిన బోయిన్‌పల్లి వెంకట రామారావు కుమారుడైన హన్మంతరావు భార్యే అనురాధ. ముగ్గురు అక్కచెల్లెళ్లయిన చేప్యాల అనురాధ, పొల్సాని అన్నపూర్ణ, తక్కళ్ళపల్లి అనుపమ కలిసి అనూస్ బ్యూటీ పార్లర్‌ను మొదలుపెట్టారు. తొలి వ్యాపారమే సక్సెస్ కావడంతో అనూస్ ఎలక్ట్రోలైసిస్ అండ్ ఒబెసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్థాయికి ఎదిగింది.

ఇవి కూడా చదవండి : అభిషేక్ రావు ఖాతాలోకి రూ.3.85 కోట్లు ఎలా వచ్చాయి.. తేలేది ఇవాళే!



Next Story

Most Viewed