ఫారో దీవుల్లో దారుణం.. వందల కొద్దీ డాల్ఫిన్లు, తిమింగలాల ఊచకోత

by Muthe.Rajitha |

ఫారో దీవుల్లో ప్రతి ఏటా జరిగే సంప్రదాయ వేడుక అయిన తిమింగలాలు, డాల్ఫిన్ల వేట 'గ్రైండాడ్రాప్' జంతు ప్రేమికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

ఫారో దీవుల్లో దారుణం.. వందల కొద్దీ డాల్ఫిన్లు, తిమింగలాల ఊచకోత
X

దిశ, వెబ్ డెస్క్ : నార్త్ అట్లాంటిక్ సముద్రంలోని ఫారో దీవుల్లో (Faroe Islands) దారుణ ఘటన జరిగింది. ఫారో దీవుల్లో ప్రతి ఏటా జరిగే సంప్రదాయ వేడుక అయిన తిమింగలాలు, డాల్ఫిన్ల వేట 'గ్రైండాడ్రాప్' (Grindadráp) ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మే 27న ఒకే ఒక్క రోజులో ఏకంగా 700కు పైగా సముద్ర జీవులను వేటగాళ్లు దారుణంగా ఊచకోత కోశారు. తిమింగలాలు 402, డాల్ఫిన్లను 306 వరకు దారుణంగా చీల్చిపారేశారు. సముద్రంలో ఉన్న తిమింగలాలు, డాల్ఫిన్లను పడవలు, మోటార్ బోట్ల సహాయంతో గుంపులుగా తీరం వైపునకు తరుముతారు. అవి ఒడ్డున ఉన్నలోతు లేని నీటిలోకి రాగానే, ప్రత్యేక బ్లేడ్‌లు, హుక్స్‌తో వాటి వెన్నెముకలను తెంపి అత్యంత క్రూరంగా చంపేస్తారు. ఈ సామూహిక వధ కారణంగా వందలాది లీటర్ల రక్తం సముద్రంలో కలవడంతో తీరమంతా పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోయింది.

ఈ భయానక దృశ్యాన్ని చిన్నారులతో సహా స్థానికులు వందలాది మంది ఒడ్డున నిలబడి చూస్తూ కేరింతలు కొట్టడం గమనార్హం. కాగా ఈ భారీ వధ జరగడానికి కేవలం ఒక రోజు ముందు అంటే మే 26న ఫారో దీవుల పార్లమెంట్ డాల్ఫిన్ల వేటకు సంబంధించిన జంతు సంక్షేమ చట్టాన్ని సవరించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. వేటాడే ప్రక్రియను మరింత సులభతరం చేసేలా, నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు. కాగా ఇది తమ వెయ్యేళ్ళ సంప్రదాయం అని స్థానికులు చెబుతున్నారు.

Next Story