మహిళా దొంగల హల్‌చల్.. ఆటోలో వచ్చి సీతారామ ప్రాజెక్ట్ డంపర్ బ్యాటరీలు చోరీ

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-04 11:33:16  IST  )

తిరుమలాయపాలెం మండలంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది.

మహిళా దొంగల హల్‌చల్.. ఆటోలో వచ్చి సీతారామ ప్రాజెక్ట్ డంపర్ బ్యాటరీలు చోరీ
X

దిశ,తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండలంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మండలంలో సీతారామ ప్రాజెక్టు కాలువ పనులు నడుస్తున్నాయి. అజ్మీర తండాలోనే రాకాసి తండా మీదుగా మొదలైన ఈ పనులు, తిప్పారెడ్డి గూడెం, కేశపురం, గ్రామాల మధ్య నుంచి దమ్మాయిగూడెం, బీరోలు గ్రామల్లో ఈ కాలువ పనులు జరుగుతున్నాయి. డంపర్లు, టిప్పర్ల వాహనాలు, జెసిబి, ప్రోక్లింగ్ తోపాటు ఇతర మిషనరీ వ్యవస్థతో ఈ పనులు చేపడుతున్నారు. పనుల మధ్య వాహనాలకు మిషన్లకు ఏమైనా రిపేర్లు వస్తే ఎక్కడికో వెళ్ళకుండా, తిప్పారెడ్డి గూడెం సమీపంలో ప్రాజెక్టు వాళ్ళు వాహనాలకు రిపేర్ చేసుకునేందుకు గ్యారేజ్ ఏర్పాటు చేసుకున్నారు.

నిన్న బుధవారం ఆ గ్యారేజ్ లో రెండు డంపర్లకు చిన్న చిన్న మైనర్ రిపేర్లతోపాటు, వాటర్ సర్వీసింగ్ చేసి వాహనాలు పక్కన పెట్టారు. గుర్తు తెలియని మహిళలు ఆటోలో వచ్చి ప్లాన్ ప్రకారం ఆ ఆటోని తిప్పారెడ్డి గూడెం సెంటర్లో ఉంచారు. ఆ తరువాత ఆ మహిళ దొంగలు చిత్తు కాగితాలు వేరుకుంటూ చిన్నగా గ్యారేజ్ సమీపానికి చేరుకున్నారు. ఆ తర్వాత రెండు డంపర్లలోని రూ.30 వేలు విలువ చేసే రెండు బ్యాటరీలు చోరీ చేసి ఆటోలో వేసుకుని కేశపురం మీదుగా ఖమ్మం - వరంగల్ హైవే వైపు వెళ్లారు. అది గమనించిన సంబంధిత వర్కర్లు వెంటనే బొలెరో వాహనంలో ఆ ఆటోని వెంబడించారు.

మార్గం మధ్యలో ఆటో రన్నింగ్ లో ఉండగానే ఆ నలుగురు మహిళా దొంగలు ఆటోలో నుండి బయటకు దూకి పరారయ్యారు. వర్కర్లు ఆటో పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు ఆటోను పోలీసు స్టేషన్ కు తరలించి ఆటో డ్రైవర్ మోహన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. చోరీకి పాల్పడిన మహిళలు వరంగల్ క్రాస్ రోడ్డులో పెద్ద తండాలో గుడారాలు వేసుకుని ఉంటారని చెప్పగా పోలీసులు అక్కడికి వెళ్లి చూసేసరికి ఆ గుడారాలను పీకేసి అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దీంతో పరారైన మహిళ దొంగల కోసం ఎస్సై కూచిపూడి జగదీశ్ గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

Next Story