ఆవులా గడ్డి మేస్తూ యువకుడి వింత స్టంట్.. వైరల్ వీడియో చూసి షాకవుతున్న డాక్టర్లు!

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-04 12:13:36  IST  )

సోషల్ మీడియాలో పశువుల పచ్చిగడ్డి తింటూ ఓ యువకుడు రెచ్చిపోయాడు.

ఆవులా గడ్డి మేస్తూ యువకుడి వింత స్టంట్.. వైరల్ వీడియో చూసి షాకవుతున్న డాక్టర్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవ్వడం కోసం, నలుగురిలో గుర్తింపు తెచ్చుకోవడం కోసం కొందరు యువకులు చేసే పనులు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా, పశువులకు మేతగా వేసే పచ్చి గడ్డిని ఓ యువకుడు పెద్ద మొత్తంలో తింటున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. ఓ ప్రత్యేక కార్యక్రమంలో చుట్టూ ఉన్నవారంతా ఈలలు, కేకలతో ఉత్సాహపరుస్తుండగా.. ఆ యువకుడు ఏమాత్రం సంకోచించకుండా పచ్చిగడ్డిని నోట్లో పెట్టుకుని నమిలి మింగేస్తూ ఈ వింత పనికి పూనుకున్నాడు. ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేయడంతో దీనిపై వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వైద్యులు హెచ్చరిక ..

యువకుడ గడ్డి తింటున్న వీడియోపై స్పందించిన వైద్యులు, ఇలాంటి పిచ్చి పనులు ప్రాణాంతకంగా మారతాయని హెచ్చరిస్తున్నారు. గడ్డిలో సెల్యులోజ్ (Cellulose) అనే కఠినమైన కార్బోహైడ్రేట్ ఉంటుందని అన్నారు. ఆవులు, గేదెలు, మేకల వంటి జంతువుల జీర్ణ వ్యవస్థలో ఆ సెల్యులోజ్‌ను బ్రేక్‌డౌన్ చేసే స్పెషల్ బ్యాక్టీరియా, ఎంజైమ్‌తో పాటు రూమెన్ (Rumen) అనే ప్రత్యేక జీర్ణాశయ భాగం ఉంటాయని తెలిపారు. కానీ, మనుషుల జీర్ణవ్యవస్థ సెల్యులోజ్‌ను జీర్ణం చేసుకోలేదని వైద్యులు అంటున్నారు. ఇక పచ్చిగడ్డిని అలానే తినడం వల్ల కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు అవ్వడమే కాకుండా.. అది పేగుల్లో ఇరుక్కుపోయి ఇంటెస్టినల్ అబ్‌స్ట్రక్షన్ అంటే పేగులు అడ్డుపడటం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. దీంతో అత్యవసరంగా సర్జరీ చేయాల్సి రావొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

ఇన్ఫెక్షన్ల ప్రమాదం..

పచ్చిగడ్డిపై పశువుల మలమూత్రాల అవశేషాలు, క్రిమి సంహారక మందులు (Pesticides), ప్రమాదకరమైన పరాన్నజీవులు బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి నేరుగా కడుపులోకి వెళ్తే కాలేయం, కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే, లక్షల్లో లైకులు, వ్యూస్ కోసం ఇలాంటి ప్రాణాంతకమైన స్టంట్స్ చేయవద్దని, ఇతరులు కూడా ఆ వీడియోలను చూసి అనుకరించే ప్రయత్నం చేయవద్దని వైద్యులు, నెటిజన్లకు సూచిస్తున్నారు.

Next Story