చాట్ బాట్ సలహాతో పేరెంట్స్ హత్య

by Muthe.Rajitha |

సాంకేతిక పరిజ్ఞానం మనిషి అభివృద్ధికి ఎంతలా ఉపయోగపడుతుందో, కొన్నిసార్లు అదే టెక్నాలజీ వినాశకరమైన నేరాలకు ఎలా దారితీస్తుందో బెంగళూరులో వెలుగుచూసిన దారుణ హత్యల ఉదంతం నిరూపిస్తోంది.

చాట్ బాట్ సలహాతో పేరెంట్స్ హత్య
X

దిశ, వెబ్ డెస్క్ : సాంకేతిక పరిజ్ఞానం మనిషి అభివృద్ధికి ఎంతలా ఉపయోగపడుతుందో, కొన్నిసార్లు అదే టెక్నాలజీ వినాశకరమైన నేరాలకు ఎలా దారితీస్తుందో బెంగళూరులో వెలుగుచూసిన దారుణ హత్యల ఉదంతం నిరూపిస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరు పరిధిలోని సీగేహళ్లి అపార్ట్‌మెంట్‌లో జరిగిన సోమసుందర్‌ (52), ఆయన భార్య ముత్తులక్ష్మి (48), వారి చిన్న కుమార్తె సుప్రియ (19) హత్యోదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తొలుత సాధారణ మరణాలుగా భావించిన ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా, కన్న కూతురే కసాయిగా మారి తన ప్రియుడితో కలిసి ఈ అరాచకానికి పాల్పడినట్లు తేలడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. సోమసుందర్‌ పెద్ద కుమార్తె శ్వేత, ఆమె ప్రియుడు కెన్నెత్‌ కలిసి ఈ ముగ్గురిని అత్యంత కిరాతకంగా కడతేర్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ అయింది.

ఈ హత్యల వెనుక అత్యంత విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా సొంత కుటుంబ సభ్యులను హతమార్చడం కోసం శ్వేత, కెన్నెత్‌లు గత ఆరు నెలలుగా అత్యంత పక్కాగా వ్యూహరచన చేసినట్లు తేలింది. ముఖ్యంగా ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ఎవరినైనా అత్యంత చాకచక్యంగా ఎలా హత్య చేయాలి? మృతదేహాలను ఎలా మాయం చేయాలనే విషయాలపై వారు ఇంటర్నెట్‌లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్‌ను ఆశ్రయించారు. ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసే శ్వేతకు టెక్నాలజీపై అవగాహన ఉండటంతో, ఏఐ చాట్‌బాట్‌ను నిత్యం వాడుకుంటూ హత్యకు సంబంధించిన మెళకువలు, ప్లాన్‌లను అడిగి తెలుసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆరు నెలల పాటు ఏఐ చాట్‌బాట్ ఇచ్చిన సూచనల ప్రకారమే తాము ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు నిందితులు విచారణలో అంగీకరించినట్లు సమాచారం.

ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన కేఆర్‌పురం పోలీసులు, నిందితులు ఉపయోగించిన ఏఐ చాట్‌బాట్ టూల్ కంపెనీకి అధికారికంగా లేఖ రాశారు. ఆరు నెలల కాలంలో శ్వేత, కెన్నెత్‌లు ఏఐ టూల్‌ను ఏయే అంశాలపై సంప్రదించారు? ఏ విధమైన ప్రశ్నలు అడిగారు? చాట్‌బాట్ ఇచ్చిన రెస్పాన్స్‌లు ఏమిటనే పూర్తి డిజిటల్ డేటాను కోరారు. ఏఐ కంపెనీ అందించే ఈ సాంకేతిక వివరాలను ఈ కేసులో అత్యంత కీలకమైన డిజిటల్ సాక్ష్యంగా (Digital Evidence) పరిగణించనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. టెక్నాలజీని సన్మార్గంలో ఉపయోగించాల్సిందిపోయి, నేరాలకు పాల్పడేందుకు కృత్రిమ మేధను దుర్వినియోగం చేసిన ఈ ఉదంతం డిజిటల్ యుగంలో పెను ఆందోళన కలిగిస్తోంది.

Next Story