- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాంకర్ అనసూయపై అసభ్య పోస్టులు.. కటకటాల పాలైన మరో నిందితుడు
ప్రముఖ టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న మరో నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న మరో నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్ వేధింపులకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు.. తాజాగా నల్గొండ జిల్లాకు చెందిన దొరెపల్లి చంటి (30)ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా సైబరాబాద్ పోలీసులు నిందితుడి వివరాలు, ఫోటోను పంచుకున్నారు. చంటి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా (@chantidhorapally) ద్వారా అనసూయ గౌరవానికి భంగం కలిగించేలా అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యలు, పోస్టులు చేసినట్లు పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిర్ధారించి పట్టుకున్నారు.
గతంలో మరొకరి అరెస్ట్
గత ఏడాది డిసెంబర్ 23న తనపై పరువు నష్టం కలిగించేలా అశ్లీల పోస్టులు పెడుతున్నారంటూ అనసూయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. ఇటీవలే కడప జిల్లాకు చెందిన జనార్ధన్ అనే మరో నిందితుడిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.
సైబరాబాద్ పోలీసుల హెచ్చరిక
ఈ అరెస్టుల నేపథ్యంలో పోలీసులు నెటిజన్లకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాను కేవలం సమాచార మార్పిడికి, విజ్ఞానం కోసమే వాడాలని సూచించారు. మహిళలను కించపరుస్తూ వ్యక్తిగత దాడులకు దిగితే ఐటీ చట్టం కింద కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ వేధింపులను మౌనంగా భరించకుండా ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.






