మైనర్ బాలికను తొమ్మిదేళ్లు లోబర్చుకున్న వివాహితుడు.. చివరకు పరారీ!

by Batti.Sumithra |   (  Updated:2026-01-06 06:16:46  IST  )

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మైనర్ బాలికను తొమ్మిదేళ్లు లోబర్చుకున్న వివాహితుడు.. చివరకు పరారీ!
X

దిశ, బయ్యారం : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికగా ఉన్నప్పటి నుంచే ఓ వివాహితుడు ఆమెను గుట్టుచప్పుడు కాకుండా లోబరుచుకొని రిలేషన్షిప్ పేరుతో తొమ్మిది సంవత్సరాల పాటు శారీరకంగా వాంఛ తీర్చుకున్న ఘటన గ్రామంలో తీవ్రచర్చకు దారితీసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలికి ప్రస్తుతం 23 సంవత్సరాలు కాగా, నిందితుడి వయస్సు సుమారు 40 సంవత్సరాలు. అతడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధితురాలు అదే గ్రామంలో అతని ఇంటి పక్కనే నివసిస్తూ, ఆ దంపతుల ఇంట్లో నిత్యం పనులు చేస్తూ ఉండేది. ఈ క్రమంలో ఆమె మైనర్‌గా ఉన్నప్పుడే నిందితుడు ఆమెను మోసపూరితంగా లోబర్చుకొని శారీరక వాంఛ తీర్చుకున్నట్లు సమాచారం.

ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేందుకు గర్భనిరోధక మందులు కూడా వాడించాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మేజర్ అయిన తర్వాత కూడా పెళ్లి చేస్తానని నమ్మించి సంబంధాన్ని కొనసాగించాడు. అయితే ఇటీవల ఆమె తల్లిదండ్రులు వివాహానికి సంబంధించి ఇతర గ్రామాల నుంచి వచ్చిన సంబంధాలను పరిశీలించగా, ఈ విషయం నిందితుడికి తెలిసింది. దీంతో ఆమెను బెదిరిస్తూ నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావో చూస్తా… నీతో ఉన్న ఫోటోలు అందరికీ చూపిస్తా… వచ్చిన సంబంధాలన్నీ చెడగొడతా అంటూ బ్లాక్‌మెయిల్ చేసినట్లు సమాచారం.

గత డిసెంబర్ 28న మహబూబాబాద్ జిల్లా ధర్మారం తండా సమీపంలోని ఓ గ్రామానికి ఆమెను తీసుకెళ్లి అక్కడే ఉంచినట్లు తెలిసింది. బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి డిసెంబర్ 29న ఆమెను ట్రేస్ చేసి, విచారణ అనంతరం తల్లిదండ్రులకు అప్పగించినట్లు సమాచారం. ఈ పరిణామాలతో భయపడిన నిందితుడు తన స్వగ్రామాన్ని వదిలి పరారైనట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, గ్రామంలోని కొందరు పెద్దమనుషులు గుట్టుచప్పుడు కాకుండా రాజీ ప్రయత్నాలు చేస్తూ, బాధితురాలి శీలానికి వేలం కట్టే విధంగా పంచాయితీలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 2, 3 తేదీల్లో రెండు సార్లు పంచాయితీ కూర్చొని రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు రాజీ మాటలు నడిచినట్లు సమాచారం.

నష్టపరిహారం వద్దు… అతనినే పెళ్లి చేసుకుంటా

పెళ్లి చేసుకుంటానని నమ్మించి నన్ను మోసం చేశాడు. ఇప్పుడు గ్రామం వదిలి పారిపోయాడు. ఇంత జరిగిన తర్వాత నన్ను ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు ? అతన్ని కాకుండా వేరే పెళ్లి చేసుకుంటే సమాజం నాపై వేలెత్తి చూపుతుంది. నా తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చుకోలేను. కేసు పెడితే సంవత్సరాల పాటు న్యాయం ఆలస్యం అవుతుంది. చనిపోతే కూడా అతని చేతిలోనే చనిపోతా… చావో రేవో అతనితోనే తేల్చుకుంటా అంటూ కన్నీటిపర్యంతమైంది. నష్టపరిహారం గానీ, రాజీ గానీ వద్దని, అతనిని పెళ్లి చేసుకునే వరకూ అతని ఇంట్లోనే ఉండేందుకు సిద్ధమని ఆమె తెలిపినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో ఏం చేయాలన్నది పెద్దమనుషులకు కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది.

పోలీసుల వివరణ

ఈ విషయమై ఎస్‌ఐ తిరుపతి వివరణ కోరగా గత డిసెంబర్ 28న బాలిక తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేశారని, దర్యాప్తులో భాగంగా ఆమెను ట్రేస్ చేసి తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు. తదుపరి చర్యలు ఫిర్యాదుపై ఆధారపడి ఉంటాయని వెల్లడించారు.

Read More..

చైల్డ్ అబ్యూస్‌ కంటెంట్‌ చూడటం, అప్‌లోడ్ నేరం.. వందల సంఖ్యలో అరెస్టులు : డీజీపీ హెచ్చరిక

Next Story