- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలకలం రేపుతున్న క్రషర్ మిషన్ !
నవాబుపేట మండలంలోని చౌడూరు గ్రామ సమీపంలో కొనసాగుతున్న క్రషర్ మిషన్ కార్యకలాపాలు రైతులు, గ్రామ ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి.

దిశ, నవాబుపేట : నవాబుపేట మండలంలోని చౌడూరు గ్రామ సమీపంలో కొనసాగుతున్న క్రషర్ మిషన్ కార్యకలాపాలు రైతులు, గ్రామ ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. క్రషర్ నుంచి వెలువడుతున్న దుమ్ము, బ్లాస్టింగ్‌ల ప్రభావంతో జల-వాయు కాలుష్యం పెరిగి వ్యవసాయ భూములు, పంటలు, భూగర్భ జలాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం పై చౌడూరు గ్రామ పంచాయతీ సర్పంచ్, కార్యదర్శి ఇప్పటికే మూడు సార్లు యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో అక్రమంగా నడుపుతున్న క్రషర్ మిషన్ ను నిలిపివేయించి, క్రషర్ మిషన్ యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరుతూజిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ సంబంధిత శాఖల నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన చర్యలు కనిపించకపోవడం పై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
క్రషర్ దుమ్ముతో పంటల దిగుబడులు తగ్గిపోతున్నాయని, భారీ వాహనాల రాకపోకలు, బ్లాస్టింగ్‌ల కారణంగా ప్రజలు, పశువుల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని రైతులు వాపోతున్నారు. మరోవైపు అధికార నివేదికలు అనుమతులు ఉన్నట్లు పేర్కొంటున్నప్పటికీ, గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు అంటున్నారు. క్రషర్‌కు సంబంధించిన అన్ని అనుమతులు, పర్యావరణ నిబంధనల అమలు, కాలుష్య నియంత్రణ చర్యలపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని గ్రామ సర్పంచ్ సునీత కోరుతున్నారు. విచారణ పూర్తయ్యే వరకు క్రషర్ కార్యకలాపాలను నిలిపివేసి రైతులు, గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు.
ప్రజల ఆరోగ్యం, రైతుల జీవనాధారమే ముఖ్యం : సునీత, సర్పంచ్, చౌడూరు
చౌడూరు గ్రామ ప్రజలు, రైతుల నుంచి వరుసగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో క్రషర్ యాజమాన్యానికి మూడు సార్లు నోటీసులు జారీ చేశాం. స్పందన లేకపోవడంతో జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశాం. గ్రామంలో జల-వాయు కాలుష్యం, దుమ్ము సమస్యల పై సంబంధిత శాఖలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాస్తవ పరిస్థితులను నిర్ధారించాలి. పూర్తి విచారణ జరిగే వరకు క్రషర్ కార్యకలాపాలను నిలిపివేసి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాం.






