LTCG Tax: ఎల్‌టీసీజీ రద్దు లేదు

by S Gopi |

సోమవారం లోక్‌సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో, అలాంటి ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదని తెలిపారు.

LTCG Tax: ఎల్‌టీసీజీ రద్దు లేదు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతానికి ఈక్విటీ పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ)ను రద్దు చేసే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం లోక్‌సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో, అలాంటి ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదని తెలిపారు. అయితే దేశ ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏడాది బడ్జెట్ సందర్భంగా పన్ను విధానాలను సమీక్షించడం సాధారణ ప్రక్రియేనని పేర్కొన్నారు. ఇదే సమయంలో, ఈక్విటీ లావాదేవీలపై ఎల్‌టీసీజీ పన్ను రూపంలో ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం గణనీయంగా పెరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన అసెస్‌మెంట్ సంవత్సరాల ప్రకారం ప్రభుత్వం మొత్తం రూ. 2.01 లక్షల కోట్లు వసూలు చేసింది. 2024-25 అసెస్‌మెంట్ ఏడాదిలో రూ. 72,249 కోట్లు వసూలు కాగా, 2025-26లో ఈ మొత్తం రూ. 1.29 లక్షల కోట్లకు చేరి దాదాపు 79 శాతం వృద్ధిని నమోదు చేసింది.

లిస్టెడ్ ఈక్విటీ పెట్టుబడులపై ప్రస్తుతం అమల్లో ఉన్న 12.5 శాతం ఎల్‌టీసీజీ పన్ను రేటు దేశీయ రిటైల్ పెట్టుబడిదారులు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐలు) ఇద్దరికీ ఒకేలా వర్తిస్తుందని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టే ఎఫ్‌పీఐలకు మాత్రం ప్రత్యేక రాయితీ కల్పించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టే ఎఫ్‌పీఐలకు వడ్డీ ఆదాయం, మూలధన లాభాలపై ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. భారత పన్ను విధానాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చడంతో పాటు, పెన్షన్ ఫండ్స్, బీమా సంస్థలు, సార్వభౌమ సంపద నిధులు వంటి దీర్ఘకాలిక విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Next Story