‘కృష్ణమ్మ’ను కనికరించండి సారూ..

by  |
‘కృష్ణమ్మ’ను కనికరించండి సారూ..
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తొమ్మిదికి పైగా ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. వాస్తవానికి ఒకేసారి అన్ని పథకాలు జిల్లాను వరిస్తే.. ఏ రైతాంగమైనా ఎగిరి గంతేస్తుంది. కానీ ఉమ్మడి నల్లగొండ జిల్లా విషయానికొస్తే.. పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నల్లగొండ జిల్లాలో ఇప్పటికే పెండింగులో ఉన్న ప్రాజెక్టులు ఏండ్లు గడుస్తున్నా.. ఒక్కటీ ముందుకు సాగట్లేదు. ఇందుకు ప్రధాన అడ్డంకి నిధుల కొరత. నల్లగొండ జిల్లాలో ఉమ్మడి ఏపీ హయాంలో ప్రారంభించిన ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు మొదలుకుని.. స్వరాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిండి ప్రాజెక్టు వరకు అన్నీ నిలిచిపోయాయి. ఆయా ప్రాజెక్టులకు సరిపడా నిధులు కేటాయించక పోవడం.. భూసేకరణ పూర్తి కాకపోవడం.. తదితర కారణాలతో ఏండ్ల తరబడి నత్తతో పోటీ పడుతున్నాయి. పెండింగు ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తే.. రెండు మూడేండ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాత ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా.. పెద్దగా ప్రాధాన్యతలేని కొత్త ప్రాజెక్టులను సీఎం కేసీఆర్ తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. అద్భుతమైన పాత ప్రాజెక్టులను వదిలి.. కొత్త ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయడం పట్ల ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగం, మేధావులు అసంతృప్తిని కనబరుస్తుండడం గమనార్హం. దీనికితోడు కృష్ణానదీ జలాలను వినియోగించు కోవడంలోనూ తెలంగాణ ఘోరంగా విఫలమయ్యిందనే చెప్పాలి. కృష్ణా జలాలను స్టోరేజీ చేసుకునే సామర్థ్యం లేక.. ఏపీ 650 టీఎంసీలు వినియోగిస్తే.. తెలంగాణ కేవలం 280 టీఎంసీలు వినియోగించుకుంది. పెండింగు ప్రాజెక్టులు, కృష్ణానదీ జలాల వినియోగంపై ‘దిశ’ ప్రత్యేక కథనం.

సొరంగం పనుల ఊసేలేదు..

ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. ఆ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే.. ఎడారి లాంటి దేవరకొండ నియోజకవర్గం సస్యశ్యామలం అవ్వడం ఖాయం. అదీనూ ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రారంభిస్తానన్న 9 ఎత్తిపోతల పథకాల కంటే మించిన ఫలితాన్నిస్తుంది. శ్రీశైలం ఎడమకాలువ సొరంగం పనులు ఆగిపోయి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైసా విదిల్చిన పాపాన పోలేదు. కేవలం 10 కిలోమీటర్ల సొరంగం పూర్తయితే శ్రీశైలం జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా రోజుకు 4 వేల క్యూసెక్కుల నీరు నల్లగొండ జిల్లాకు చేరుతుంది. మూడు రోజులకు ఒక టీఎంసీ చొప్పున నికర జలాలు తీసుకునే అద్భుత అవకాశం జిల్లాకు దక్కుతుంది. దీనికితోడు నక్కలగండి రిజర్వాయరు, పెండ్లిపాకల రిజర్వాయరు అందుబాటులోకి వస్తాయి. ఎగువ భాగంలోని దేవరకొండకు నీరిచ్చే అవకాశాలు మెరుగవుతాయి. ఇందుకు ఎలాంటి ఎత్తిపోతల పథకాలతో పని లేదు. పైసా కరెంటు ఖర్చు ఉండదు. కావాల్సిందల్లా సొరంగ మార్గం పూర్తవ్వడమే. కానీ ఇటు సీఎం కేసీఆర్ గానీ.. అటు జిల్లా ప్రజాప్రతినిధులు గానీ సొరంగ మార్గం ఊసెత్తకపోవడం గమనార్హం.

సామర్థ్యంపై సోయి మరిచిన ప్రభుత్వం..

సీఎం కేసీఆర్ సాగునీటి వ్యవస్థపై తనకు పూర్తిస్థాయి అవగాహన ఉందంటూ వీలు చిక్కినప్పుడల్లా చెబుతుంటారు. అదే నిజమైతే.. కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా విషయం వేరుగా ఉండేది. ఎందుకంటే.. ఇప్పటివరకు కృష్ణానదిలో తెలంగాణ వాటాను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారు. కృష్ణానది జలాలను ఏపీ, తెలంగాణలు 66:34 నిష్పత్తిలో నీటిని వాడుకోవాలి. గతేడాది 2020 మే చివరి వరకు రెండు రాష్ట్రాలు కలిసి 930 టీఎంసీలు వినియోగించుకున్నాయి. ఇందులో తెలంగాణ వాటా ప్రకారం 316 టీఎంసీలు వాడుకోవాలి. కానీ కేవలం 280 టీఎంసీలను మాత్రమే తెలంగాణ వాడుకుంది. ఈ లెక్కన చూస్తే.. తెలంగాణ రాష్ట్రం అదనపు కృష్ణా జలాలను వాడుకోవడం సంగతి పక్కనబెడితే.. ఉన్న వాటా నీటిని వాడుకోలేకపోయింది. 36 టీఎంసీల నీటిని అప్పనంగా ఏపీకి అప్పజెప్పినట్టయ్యింది. వాస్తవానికి ఆ జలాలను స్టోర్ చేసుకుని వాడుకునే సామర్థ్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుని ఉంటే.. రైతాంగానికి ఇన్ని తిప్పలు ఉండేవి కావు. పక్క రాష్ట్రమైన ఏపీ మాత్రం.. తన వాటా కింద 512 టీఎంసీలు వాడుకోవాలి. కానీ ఆ రాష్ట్రం అదనపు జలాలతో కలిపి 650 టీఎంసీలను వాడుకోగలిగింది. ఒక్క పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచే 169 టీఎంసీలు తరలించుకు పోయింది. సీఎం కేసీఆర్ అందుబాటులో ఉన్న కృష్ణా జలాలను వదిలేసి.. గోదావరి నీటితో కృష్ణానది ఆయకట్టు భూములను సాగులోకి తీసుకొస్తానంటూ చెబుతున్నారు. బెత్తెడు దూరంలో ఉన్న కృష్ణా నీటిని వదిలి.. ఆరు అడుగుల దూరం ఉన్న గోదావరి జలాల వెంట పడడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

ఎత్తిపోతలతో రైతులపై భారం..

నల్లగొండ జిల్లాలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న ఎత్తిపోతల పథకాల్లో సగం అవసరం లేనివే. ఉదాహరణకు పెద్ద మునగాల కోసం ఒక ఎత్తిపోతల పథకం ప్రకటించారు. అయితే ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తయ్యి.. నక్కల‌గండి, పెండ్లిపాకల రిజర్వాయర్లలోకి నీరు చేరితే.. గ్రావిటీ ద్వారా పెద్ద మునగాలకు నీరు చేరుతుంది. ఇందుకు ఎలాంటి ఎత్తిపోతలు అవసరం లేదు. కానీ సీఎం కేసీఆర్ నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలు భవిష్యత్తులో రైతులకు భారంగా మారే పరిస్థితి ఉంది. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కింద నీటి వినియోగ చార్జీలను వసూలు చేయాలన్న ప్రతిపాదనపై జోరుగా చర్చ సాగుతోంది. దీనికితోడు విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేస్తేనే నిధులిస్తామంటూ మరోవైపు కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఎత్తిపోతల పథకాల కింద సాగు చేసే రైతుల నుంచి నీటి వినియోగ చార్జీల వసూలును తప్పనిసరి చేస్తే.. రైతులపై ఆర్థిక భారం తప్పదు.

కృష్ణా, గోదావరి బేసిన్‌లో వరద ప్రవాహాలు ఇలా..


Next Story

Most Viewed