- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర ప్రమాదం: రెండు కాళ్లకు ఆపరేషన్.. పండు మాస్టర్ హెల్త్ బులిటెన్ విడుదల
ప్రముఖ టెలివిజన్ డ్యాన్స్ మాస్టర్, ‘ఢీ’ ఫేమ్ పండు (జి. షణ్ముఖ) ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ టెలివిజన్ డ్యాన్స్ మాస్టర్, ‘ఢీ’ ఫేమ్ పండు (జి. షణ్ముఖ) ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. విశాఖపట్నం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలు కాగా, వైద్యులు శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారు. ఆయన కోలుకోవడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
ప్రమాదం జరిగిందిలా..!
మంగళవారం రాత్రి తగరపువలస (భీమిలి మండలం)లో జరిగిన ఓ జాతరలో డ్యాన్స్ ఈవెంట్ ముగించుకుని పండు తన బృందంతో (బాలు రైడర్స్) కలిసి కారులో విశాఖకు తిరుగుపయణమయ్యారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆనందపురం మండలం లొడగలవానిపాలెం జాతీయ రహదారిపై.. కారులో ఉన్న ఓ మహిళా డ్యాన్సర్‌కు వాంతులు కావడంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపారు. కారు దిగి వెనుక భాగంలో పండు మాస్టర్ నిలబడి ఉండగా.. కోళ్ల లోడ్‌తో అతి వేగంగా వచ్చిన ఓ బొలెరో వాహనం వారి కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పండుతో పాటు లిఖిత ప్రియ, హారిక అనే మరో ఇద్దరు డ్యాన్సర్లకు తీవ్ర గాయాలయ్యాయి.
ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల ప్రకటన
గాయపడిన పండును తోటి సభ్యులు వెంటనే విశాఖలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ ఎ. ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. పండు మాస్టర్ రెండు కాళ్లు విరిగిపోయాయని, ఎముకలు ఫ్రాక్చర్ కావడంతో అత్యవసర శస్త్రచికిత్స నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రాణాపాయం లేదని, ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. ఆపరేషన్ తర్వాత కనీసం ఆరు నెలల పాటు పూర్తి విశ్రాంతి (బెడ్ రెస్ట్), ఫిజియోథెరపీ అవసరమని, అప్పుడే ఆయన తిరిగి యథావిధిగా డ్యాన్స్ చేయగలరని వివరించారు.
పోలీసుల దర్యాప్తు..
బొలెరో డ్రైవర్ నిర్లక్ష్యం, నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, బుల్లితెరపై ఎంతో చలాకీగా ఉండే పండు ప్రమాదానికి గురయ్యారన్న వార్త తెలుసుకున్న తోటి కళాకారులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ వేదికపైకి రావాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.






