వచ్చే ఎన్నికల్లో నా భార్య 100% పోటీ చేస్తుంది: మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2026-05-19 12:22:21  IST  )

తన భార్య భూమా మౌనికా రెడ్డి రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా బరిలో ఉంటారని టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికల్లో నా భార్య 100% పోటీ చేస్తుంది: మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తన భార్య భూమా మౌనికా రెడ్డి రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా బరిలో ఉంటారని టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ స్పష్టం చేశారు. మే 20న తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన సతీమణి రాజకీయ రంగప్రవేశం, తాను ఇటీవల కొత్తగా స్థాపించిన ‘ఐక్య’ సంస్థ, అలాగే తన తండ్రితో ఉన్న విభేదాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాల్లోకి మౌనికా రెడ్డి

ప్రజలకు సేవ చేయాలనే బలమైన ఆకాంక్ష మౌనికా రెడ్డికి ఉందని, అందుకే వచ్చే ఎన్నికల్లో ఆమె 100 శాతం పోటీకి దిగుతుందని మనోజ్ తెలిపారు. ఆమె రాజకీయ ప్రయాణానికి తన పూర్తి మద్దతు ఉంటుందని, తాము ఇప్పటికే రాజకీయాల్లో భాగమయ్యామని ఆయన చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలను విస్తృతం చేసే ఉద్దేశ్యంతో ఇటీవలే ప్రారంభించిన ‘ఐక్య ధైర్య సేనా సమితి’ (AIKYA Dhairya Sena Samithi) పై ఉన్న అనుమానాలను మనోజ్ నివృత్తి చేశారు. ఇది కేవలం ప్రజల గొంతుకగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన సంస్థ అని, దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

తన తండ్రితో ఉన్న విభేదాలపై స్పందన

తన తండ్రితో ఉన్న విభేదాలు సద్దుమణిగాయా..? అని విలేకరులు ప్రశ్నించగా మనోజ్ తనదైన శైలిలో చమత్కరించారు. ‘అది ఎవరిని అడగాలో మీకు తెలుసుగా.. కానీ వారి దగ్గరికి మైక్‌తో వెళ్లకండి, ఒకవేళ వెళ్లినా తప్పకుండా హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి’ అంటూ సమావేశంలో నవ్వులు పూయించారు.

రజినీకాంత్ సినిమాలో శ్రీదేవి.. పోస్ట్‌తో హింట్ ఇచ్చిన యంగ్ హీరోయిన్!

Next Story