రజినీకాంత్ సినిమాలో శ్రీదేవి.. పోస్ట్‌తో హింట్ ఇచ్చిన యంగ్ హీరోయిన్!

by Mallepaka Hamsa |

కమల్ హాసన్ నిర్మాణంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘తలైవర్-173’లో ఈ అమ్మడు నటిస్తోందని, అందుకే ఈ విధంగా హింట్ ఇచ్చిందని టాక్.

రజినీకాంత్ సినిమాలో శ్రీదేవి.. పోస్ట్‌తో హింట్ ఇచ్చిన యంగ్ హీరోయిన్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీదేవి ‘కోర్ట్’ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి చిత్రంతోనే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, తన యాక్టింగ్‌తో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది. యంగ్ హీరో రోషన్ సరసన స్క్రీన్ షేర్ చేసుకోగా.. వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమా సక్సెస్ తర్వాత ఆమె ‘బ్యాండ్ మేళం’ అనే మూవీలో యంగ్ హీరో రోషన్‌తో రెండోసారి జత కట్టింది. అయితే, భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం శ్రీదేవి తెలుగుతో పాటు కోలీవుడ్‌లో కూడా బిజీ అవుతోంది. అక్కడ కేజేఆర్ సరసన నటిస్తూ తమిళ చిత్ర పరిశ్రమలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా, తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ఒక భారీ చిత్రంలో శ్రీదేవికి క్రేజీ ఆఫర్ దక్కిందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి.

ఈ రూమర్స్ రావడానికి అసలు కారణం.. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన పోస్ట్. రజినీకాంత్ హీరోగా 1991లో వచ్చి క్లాసిక్ హిట్‌గా నిలిచిన ‘తళపతి’ సినిమాలోని ఒక ఐకానిక్ ఫోజు పక్కన, శ్రీదేవి కూడా అదే స్టైల్లో నిల్చుని దిగిన ఒక ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పోస్ట్ క్షణాల్లోనే నెట్టింట విపరీతంగా వైరల్ అయిపోయింది. ఇది చూసిన సినీ నెటిజన్లు.. లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘తలైవర్-173’లో ఈ అమ్మడు నటిస్తోందని, అందుకే ఈ విధంగా హింట్ ఇచ్చిందని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో హీరోయిన్లు తాము నటించబోయే పెద్ద ప్రాజెక్ట్‌ల గురించి ముందే ఇలాంటి క్రేజీ హింట్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పుకార్లు బాగా వైరల్ అయ్యాక, మేకర్స్ నుండి అధికారిక ప్రకటన తెచ్చి సర్ప్రైజ్ చేయడం ఒక ట్రెండ్‌గా మారింది. ఇప్పుడు శ్రీదేవి కూడా సరిగ్గా అదే ఫాలో అవుతూ, సడెన్‌గా రజినీకాంత్ ఫొటోతో పోస్ట్ పెట్టిందని నెటిజన్లు అంటున్నారు.

Next Story