- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్.. రాజకీయాల్లో ‘లిటిల్’ స్టార్

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చలనచిత్ర రంగంలో నటుడు చిరంజీవి ప్రతిభ అసామాన్యం. డ్యాషింగ్ అండ్ డేరింగ్ లుక్స్, ఆకట్టుకునే నటనతో దేశ వ్యాప్తంగా అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు. మెగాస్టార్‌గా అందరి హృదయాల్లో స్థానం సంపాదించారు. సీనియర్ ఎన్టీఆర్ స్ఫూర్తిగా.. సామాజికన్యాయమే ఎజెండాగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపనతో మొదలైన చిరంజీవి పొలిటికల్ జర్నీ, విజయాలు, వివాదాలు, సవాళ్లతో కూడిన ఒక ఆసక్తికర అధ్యాయం. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆ విషయాలపై ఓ లుక్కేద్దాం..
ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం..
సామాజిక న్యాయం ఎజెండాగా మేధావులు, మిత్రులు, శ్రేయోభిలాషులతో సూచనలు, సలహాలతో మెగాస్టార్ చిరంజీవి తిరుపతిలో బహిరంగ సభలో 2008, ఆగస్టు 26న ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. రాష్ట్రంలో పేదల సంక్షేమం, ప్రజల వద్దకు పారదర్శక పాలన వంటి లక్ష్యాలతో ప్రజల్లోకి వెళ్లారు. మంచి పీక్‌లో ఉన్న సినిమా కెరీర్‌ను తాత్కాలికంగా పక్కనపెట్టి పాలిటిక్స్ ఫోకస్ పెట్టారు. 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ప్రజారాజ్యం పార్టీ 295 స్థానాలకు పోటీ చేసింది. కానీ, కేవలం 18 స్థానాల్లో విజయం సాధించింది. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయగా.. తిరుపతిలో మాత్రమే విజయం సాధించారు. అయితే, ఊహించిన స్థాయిలో ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించలేకపోయింది.
కాంగ్రెస్ పార్టీలో విలీనం..
2009 శాసనసభ ఎన్నికల్లో అంచనాలను అందుకోకపోవడం, సీనియర్ నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడటం ప్రజారాజ్యం పార్టీపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. మరోవైపు తెలంగాణ ఉద్యమ తీవ్రత, అభ్యర్థుల నుంచి డబ్బు వసూళ్ల ఆరోపణలు కూడా ఓ కారణం. ఈ క్రమంలోనే ఒడిదుడుకులను తట్టుకోలేక 2011లో చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఎన్నో చర్చలకు దారితీసింది. ఆయన కాంగ్రెస్‌లో చేరడం ద్వారా రాజకీయంగా మరింత చురుకైన పాత్ర పోషించాలని భావించారు. దీంతో ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టింది. 2012 ఆగస్టు 27 నుంచి 2014 మే 26 వరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలోనే ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రచారాన్ని 2013లో కేన్స్ చలనచిత్రోత్సవంలో ప్రారంభించారు. మకావులో జరిగిన 14వ అంతర్జాతీయ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలోనూ పాల్గొన్నారు.
సినిమాల్లోకి రీ ఎంట్రీ
కేంద్ర మంత్రిగా పదవీ కాలం ముగియడంతో కాంగ్రెస్ హై కమాండ్ చిరంజీవిని రాజ్యసభ సభ్యుడి ఎలక్ట్ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో రాజకీయంగా ఆయన పాత్ర కాస్త వివాదాస్పదమైంది. కట్ చేస్తే.. 2014 తర్వాత చిరంజీవి క్రమంగా రాజకీయాల నుంచి దూరమై, మళ్లీ సినిమాలపై దృష్టి సారించారు. 2017లో ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి సైరా నరసింహ రెడ్డి, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలతో ట్రాక్‌లోకి వచ్చారు. రాజకీయాల్లో తన పాత్ర తగ్గినప్పటికీ, సీనిరంగంలో పెద్దన్నగా, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన చేస్తున్న సామాజిక సేవలు అభినందనీయం.
Read More..
చిరంజీవి-అల్లు అర్జున్ మధ్య వివాదం.. అసలేం జరిగిందంటే?
సినీ కార్మికుల సమ్మెకు శుభం కార్డు.. సీఎంకు థ్యాంక్స్ చెబుతూ మెగాస్టార్ ట్వీట్






