సినీ కార్మికుల సమ్మెకు శుభం కార్డు.. సీఎంకు థ్యాంక్స్ చెబుతూ మెగాస్టార్ ట్వీట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-22 03:17:53  IST  )

18 రోజుల సినీ కార్మికుల సమ్మెకు ఎట్టకేలకు శుభం కార్డు పడింది.

సినీ కార్మికుల సమ్మెకు శుభం కార్డు.. సీఎంకు థ్యాంక్స్ చెబుతూ మెగాస్టార్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: 18 రోజుల సినీ కార్మికుల సమ్మెకు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. వేతనాలతో పాటు ఇతర అంశాలపై నిర్మాతలు, కార్మిక సంఘాల మధ్య రాజీ కుదరడంతో శుక్రవారం నుంచి షూటింగ్స్ మళ్లీ ప్రారంభం కానున్నాయి. కార్మిక సంఘాలు 30 శాతం వేతనాల పెంపు కోరుతూ 18 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం విదితమే. కొన్ని రోజులుగా సమస్య కొలిక్కి రాకపోవడంతో సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో గురువారం కార్మికశాఖ అదనపు కమిషనర్‌ గంగాధర్, FDC చైర్మన్‌ దిల్‌రాజు ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు, నిర్మాతలు, చలన చిత్ర వాణిజ్య మండలికి మధ్య సుదీర్ఘంగా చర్చలు ఫలించాయి. ఈ నేపథ్యంలోనే సినీ కార్మికులు సమ్మెను విరమించంలో కీలకం వ్యవహరించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతూ.. మెగాస్టార్ చిరంజీవి ‘X’ వేదికగా ట్వీట్ చేశారు.

‘ఎంతో జ‌టిల‌మైన‌ ఇండ‌స్ట్రీ స‌మ‌స్యను చాలా సామ‌ర‌స్యపూర్వకంగా ఇటు నిర్మాత‌లకు, అటు కార్మికులకు స‌మ‌న్యాయం జ‌రిగే విధంగా ప‌రిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మ‌న‌స్ఫూర్తిగా కృత‌జ్ఞత‌లు తెలియ‌జేసుకొంటున్నా. తెలుగు చిత్రసీమ అభివృద్ధికి సీఎం గారు తీసుకొంటున్న చ‌ర్యలు అభినంద‌నీయం. హైద‌రాబాద్‌ను దేశానికే కాదు, ప్రపంచ చ‌ల‌నచిత్ర రంగానికే ఓ హ‌బ్‌గా మార్చాల‌న్న ఆయ‌న ఆలోచ‌న‌లు, అందుకు చేస్తున్న కృషి హ‌ర్షించ‌ద‌గిన‌వి. తెలుగు చిత్రసీమ ఇలానే క‌లిసి మెలిసి ముందుకు సాగాల‌ని, ప్రభుత్వం కూడా అన్ని ర‌కాలుగా అండ‌దండ‌లు అందిస్తుంద‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకొంటున్నా’ అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు.

కాగా, సినీ కార్మికులు 30 శాతం వేతనాలను పెంచాలని కార్మికులు డిమాండ్‌ చేయగా, రోజుకి రూ.2 వేల లోపు వేతనాలు పొందుతున్న వారికి మూడేళ్లలో దశలవారీగా 22.5 శాతం, రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు వేతనాలు పొందుతున్న కార్మికులకి 17.5 శాతం పెంచేందుకు నిర్మాతల మండలి అంగీకరించింది. ప్రొడ్యూసర్లు కోరుకుంటున్న వర్కింగ్‌ కండిషన్ల విషయంలోనూ ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది.

Read More..

సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్.. రాజకీయాల్లో ‘లిటిల్‌’ స్టార్

Next Story