- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళల పట్ల నాకు గౌరవం ఉంది ఆ సీన్లలో మార్పులు చేస్తాం.. క్షమాపణలు కోరుతూ బుచ్చిబాబు ఎమోషనల్ ట్వీట్
తనకు వ్యక్తిగతంగా మహిళల పట్ల అపారమైన గౌరవం ఉందని, ఏ స్త్రీ పాత్రను వస్తువుగా చూపించాలనే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా విడుదలైనప్పటి నుంచి వివాదాలు, విమర్శల చుట్టూ తిరుగుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్‌ను గ్లామర్ బోమ్మలా చూపించడం, రొమాంటిక్ సీన్లపై ప్రేక్షకుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఈ సన్నివేశాలను తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో, తాజాగా, వివాదంపై దర్శకుడు బుచ్చిబాబు సనా స్పందిస్తూ ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులకు బహిరంగ క్షమాపణలు చెబుతూ ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. ఒక చిత్రనిర్మాతగా తాను చేసే సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా వారితో మమేకం కావాలని, ఎవరినీ అగౌరవపరిచేలా ఉండకూడదని బుచ్చిబాబు స్పష్టం చేశారు. 'పెద్ది' సినిమాలో కొన్ని సన్నివేశాలపై వచ్చిన విమర్శలను తాను విన్నానని, వాటిని చాలా తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నానని తెలిపారు. తనకు వ్యక్తిగతంగా మహిళల పట్ల అపారమైన గౌరవం ఉందని, ఏ స్త్రీ పాత్రను వస్తువుగా చూపించాలనే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఒకవేళ సినిమాలో ఏదైనా భాగం ప్రేక్షకులను అగౌరవపరిచేలా ఉంటే, వారి ఆందోళనలను తాను అర్థం చేసుకోగలనని, అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని బుచ్చిబాబు పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రేక్షకుల సున్నితమైన అంశాలపై శ్రద్ధ వహించాల్సిన బాధ్యత కథకులుగా తమపై ఉందని ఆయన అంగీకరించారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను గమనించిన తర్వాత, వివాదాస్పదంగా ఉన్న ఆ సన్నివేశాల్లో మార్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లు బుచ్చిబాబు వెల్లడించారు. ప్రతి మహిళ గౌరవించబడటానికి, హుందాగా అర్హురాలని, భవిష్యత్తులో వారిని శక్తిమంతంగా చూపించడానికి, వారి విలువను పెంచే కథలు చెప్పడానికి కట్టుబడి ఉన్నామని ఆయన భరోసా ఇచ్చారు. తన తప్పును ఎత్తిచూపి, నిజాయితీగా అభిప్రాయాలను పంచుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలియ జేశారు. ఈ విధంగా బుచ్చిబాబు తన తప్పును సరిదిద్దుకోవడమే కాకుండా, రాబోయే సినిమాల్లో మహిళా పాత్రల పట్ల మరింత హుందాగా వ్యవహరిస్తానని హామీ ఇచ్చారు. దర్శకుడు ఇంత వేగంగా స్పందించి, ప్రేక్షకుల సున్నితత్వాన్ని గౌరవించడాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు సనా పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.






