హాలీవుడ్ యాక్షన్ దిగ్గజం చక్ నోరిస్ కన్నుమూత.. తీవ్ర దిగ్భ్రాంతిలో సినీ ప్రపంచం

by Ramesh Naini |   (  Updated:2026-03-21 08:50:22  IST  )

హాలీవుడ్ యాక్షన్ చిత్రాల సామ్రాజ్యంలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ నటుడు, ప్రపంచ ప్రఖ్యాత మార్షల్ ఆర్టిస్ట్ చక్ నోరిస్ కన్నుమూశారు.

హాలీవుడ్ యాక్షన్ దిగ్గజం చక్ నోరిస్ కన్నుమూత.. తీవ్ర దిగ్భ్రాంతిలో సినీ ప్రపంచం
X

దిశ, డైనమిక్ బ్యూరో: హాలీవుడ్ యాక్షన్ చిత్రాల సామ్రాజ్యంలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ నటుడు, ప్రపంచ ప్రఖ్యాత మార్షల్ ఆర్టిస్ట్ చక్ నోరిస్ (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హవాయిలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవలనే ఆయన తన 86వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఆయన మరణవార్తను కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు.

నటన నుంచి మార్షల్ ఆర్ట్స్ వరకు..

1968లో ‘ది రెకింగ్ క్రూ’ (The Wrecking Crew) చిత్రంతో వెండితెరకు పరిచయమైన చక్ నోరిస్, తక్కువ కాలంలోనే యాక్షన్ హీరోగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా 1973లో వచ్చిన ‘వే ఆఫ్ డ్రాగన్’ (Way of the Dragon) సినిమాలో మార్షల్ ఆర్ట్స్ ఐకాన్ బ్రూస్ లీతో రోమ్‌లోని కొలోసియంలో ఆయన చేసిన పోరాట ఘట్టం సినీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఆరుసార్లు 'వరల్డ్ ప్రొఫెషనల్ మిడిల్‌వెయిట్ కరాటే ఛాంపియన్'గా నిలిచిన ఆయన, తన నిజ జీవిత పోరాట పటిమను వెండితెరపై కూడా ప్రదర్శించి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ‘మిస్సింగ్ ఇన్ యాక్షన్’, ‘వాకర్, టెక్సాస్ రేంజర్’ వంటి చిత్రాలు ఆయనను యాక్షన్ సినిమాల రారాజుగా నిలబెట్టాయి.

అక్షయ్ కుమార్ భావోద్వేగ నివాళి

చక్ నోరిస్ మృతి పట్ల పలువురు భారత చలనచిత్ర పరిశ్రమ నటులు నివాళులు అర్పించారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘నేను మార్షల్ ఆర్టిస్ట్‌గా ఎదుగుతున్న క్రమంలో చక్ నోరిస్ సినిమాలు నాకు కేవలం వినోదాన్ని మాత్రమే ఇవ్వలేదు, అవి ఒక పాఠశాల లాంటివి. ఆయన క్రమశిక్షణ, బలం నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. నా కెరీర్‌లో క్రమశిక్షణను అలవర్చుకోవడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది’ అని అక్షయ్ కొనియాడారు.

ప్రశాంతంగా తుదిశ్వాస..

‘నిన్న ఉదయం మా ప్రియతమ చక్ నోరిస్ మమ్మల్ని విడిచి వెళ్ళారని చెప్పడానికి మా గుండెలు బరువెక్కుతున్నాయి. చివరి నిమిషంలో ఆయన కుటుంబ సభ్యుల మధ్య ఎంతో ప్రశాంతంగా గడిపారు’ అని ఆయన కుటుంబం సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.

‘ధురంధర్ 2’ భారతీయ సినిమాకు రీసెట్ బటన్.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

Next Story