Breaking: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత

by Ramesh Naini |   (  Updated:2026-05-13 06:06:55  IST  )

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

Breaking: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత
X

దిశ, డైనమిక్ బ్యూరో: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. బుల్లితెర, వెండితెరతో పాటు నాటక రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన అకాల మరణం అభిమానులను, కన్నడ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

గుండెపోటుతో ఆసుపత్రికి తరలింపు

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున దిలీప్ రాజ్‌కు తీవ్రమైన గుండెపోటు రావడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు ఎంత శ్రమించినా ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు.

‘బాయ్ ఫ్రెండ్’ నుంచి ‘యూ-టర్న్’ వరకు

2005లో వచ్చిన ‘బాయ్ ఫ్రెండ్’ చిత్రంతో దిలీప్ రాజ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2007లో దివంగత స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్‌తో కలిసి నటించిన ‘మిలనా’ చిత్రం ఆయనకు విశేష గుర్తింపు తెచ్చిపెట్టింది. తన కెరీర్‌లో ‘యూ-టర్న్’ సహా సుమారు 24కు పైగా చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. సినిమాలతో పాటు బుల్లితెరపై ఆయన ప్రస్థానం అద్భుతంగా సాగింది. ‘కంబడ మనె’ అనే టెలీఫిలింతో టీవీ రంగంలోకి ప్రవేశించిన ఆయన.. సీనియర్ నటి భారతి విష్ణువర్ధన్ మనవడిగా ‘జనని’ సీరియల్‌లో నటించి ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. ముఖ్యంగా జీ కన్నడలో ప్రసారమైన ‘హిట్లర్ కళ్యాణ’ సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషించి విశేష ఆదరణ పొందారు. నటుడిగానే కాకుండా ‘డీఆర్ క్రియేషన్స్’ (DR Creations) బ్యానర్‌ను స్థాపించి పలు టీవీ సీరియల్స్‌కు నిర్మాతగానూ వ్యవహరించారు.

నాటక రంగంతో విడదీయరాని బంధం

దిలీప్ రాజ్‌కు నాటక రంగంతో విడదీయరాని బంధం ఉంది. సినిమాలు, టీవీల్లో ఎంత బిజీగా ఉన్నా నాటక రంగాన్ని ఆయన ఎప్పుడూ దూరం పెట్టలేదు. ‘నటరంగ’, ‘దృష్టి’ వంటి ప్రముఖ థియేటర్ గ్రూపులతో కలిసి పనిచేశారు. నాటకాల్లో నటిస్తున్న సమయంలోనే ప్రముఖ నటి నందిత పరిచయం ఆయనను టీవీ రంగానికి అడుగుపెట్టేలా చేసింది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన దిలీప్.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ సత్తా చాటారు. విభిన్నమైన, సహజమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన దిలీప్ రాజ్.. కన్నడ నాట అత్యంత నమ్మకమైన, ఉత్తమ సహాయ నటుల్లో ఒకరిగా నిలిచారు. ఆయన మృతి పట్ల పలువురు కన్నడ సినీ, టీవీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కంటతడి పెట్టిస్తున్న దృశ్యం.. సైకిల్‌పై మహిళ మృతదేహంతో 15 కిలోమీటర్ల ప్రయాణం

Next Story