కంటతడి పెట్టిస్తున్న దృశ్యం.. సైకిల్‌పై మహిళ మృతదేహంతో 15 కిలోమీటర్ల ప్రయాణం

by Ramesh Naini |   (  Updated:2026-05-13 06:06:03  IST  )

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యానికి నిరసనగా.. బాధిత కుటుంబ సభ్యులు ఏకంగా మహిళ మృతదేహాన్ని సైకిల్‌పై ఉంచి సుమారు 15 కిలోమీటర్ల మేర పోలీస్ స్టేషన్‌కు మోసుకెళ్లారు.

కంటతడి పెట్టిస్తున్న దృశ్యం.. సైకిల్‌పై మహిళ మృతదేహంతో 15 కిలోమీటర్ల ప్రయాణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యానికి నిరసనగా.. బాధిత కుటుంబ సభ్యులు ఏకంగా మహిళ మృతదేహాన్ని సైకిల్‌పై ఉంచి సుమారు 15 కిలోమీటర్ల మేర పోలీస్ స్టేషన్‌కు మోసుకెళ్లారు. ఈ దృశ్యాలు స్థానికులతో పాటు సోషల్ మీడియాలో తాజాగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఖైరా పోలీస్ స్టేషన్ పరిధిలోని హరిపూర్ గ్రామంలో ఆదివారం రెండు పొరుగు కుటుంబాల మధ్య ఇంటి సరిహద్దుల విషయంలో వివాదం తలెత్తింది. సురేంద్ర సేథి అనే వ్యక్తి ఇంట్లో పైకప్పు (రూఫ్ సెంట్రింగ్) పనులు జరుగుతుండగా, కొంత నిర్మాణ సామాగ్రి పక్కింట్లో పడింది. దీనిపై పొరుగున ఉండే భరత్ జెనా కుటుంబం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మొదట మాటల యుద్ధంగా మొదలైన ఈ గొడవ, చివరకు దాడులకు దారితీసింది. బాధితుల ఫిర్యాదు మేరకు.. భరత్ జెనా, అతని భార్య భారతి జెనా, కుమారుడు మానస్ సహా మరో బంధువు కలిసి సురేంద్ర కుటుంబంపై పారలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో సురేంద్ర సోదరి కమలా సేథి (39) తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. సురేంద్ర భార్య శకుంతల సైతం తీవ్ర గాయాలపాలై కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

పోలీసుల తీరుపై ఆగ్రహం..

హత్య జరిగి మూడు రోజులవుతున్నా ప్రధాన నిందితులను పోలీసులు ఇంకా అరెస్టు చేయకపోవడంతో బాధిత కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖైరా పోలీసుల తీరును నిరసిస్తూ బుధవారం కమల మృతదేహాన్ని ఒక సైకిల్‌పై ఉంచి, సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు కాలినడకన బయలుదేరారు. న్యాయం కోసం వారు చేసిన ఈ నిరసన స్థానికులను కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న ఖైరా పోలీసులు.. మృతదేహాన్ని తరలించేందుకు మార్గమధ్యలో అంబులెన్స్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, బాధిత కుటుంబ సభ్యులు దాన్ని తిరస్కరించారు. నిందితులందరినీ తక్షణమే అరెస్టు చేయడమే తమ ప్రధాన డిమాండ్ అని వారు తేల్చిచెప్పారు.

పోలీసుల వివరణ..

ఈ ఘటనపై ఖైరా పోలీస్ స్టేషన్‌లో కేసు (క్రైమ్ నంబర్ 123/26) నమోదైందని, దాడికి సంబంధించి నిందితుల్లో ఒకరైన భారతిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

జనాభా లెక్కల కోసం ఇంటికి వెళ్తే.. అక్కడ కనిపించిన దృశ్యానికి అధికారి షాక్!

Next Story